వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి
close
Updated : 14/05/2020 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి

మరో ఘటనలో ఎద్దుల బండిని లాక్కెళ్లిన వ్యక్తి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ఎంతో మంది జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో వేలాది మంది వలసజీవులు తామున్న చోట పనుల్లేక  స్వగ్రామాల బాటపట్టారు. అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా అంతకుముందే ఎంతో మంది కాలిబాటన వందల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రమాదాలకు గురవ్వగా మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వలసకూలీ హైదరాబాద్‌లో నివసిస్తూ.. నిండు గర్భిణి అయిన తన భార్య, రెండేళ్ల పాపతో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. మంగళవారం సొంతూరుకు చేరినా ఆయన  ప్రయాణం సాగించిన తీరు అమోఘం. ఎందుకో మీరే చదవండి..

తోపుడు బండిపై భార్య, కూతురును కూర్చోబెట్టి..
కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా మార్చిలో ఉన్నపళంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది వలసకార్మికులు ఆందోళన చెందారు. ఉన్నచోట పనులు లేక, చేతిలో డబ్బు లేక సొంతూర్ల బాట పట్టారు. ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు సైతం స్తంభించిపోవడంతో చేసేదిలేక కాలిబాటన స్వగ్రామాలకు బయలుదేరారు. మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు. అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

‘తొలుత నా కూతుర్ని ఎత్తుకొని వెళ్లాలని నిర్ణయించుకున్నా. కానీ అన్ని కిలోమీటర్లు నడిచివెళ్లాలంటే కష్టం. పైగా నా భార్య నిండు గర్భిణి. దాంతో మార్గమధ్యలో దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేసి, వారిద్దర్నీ దానిపై కూర్చోబెట్టి లాక్కుంటూ ముందుకెళ్లా’ అని రామూ తన అనుభవాన్ని వివరించాడు. కాగా, మార్గమధ్యలో మహారాష్ట్ర పోలీసులు వీరి పరిస్థితిని చూసి సహాయం చేశారు. నితేశ్‌ భార్గవ అనే పోలీస్ అధికారి వారికి ఆహారం అందించి, వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి స్వస్థలానికి తరలించారు. 

ఎద్దులబండిని మోసుకెళ్తూ..

లాక్‌డౌన్‌ వేళ మధ్యప్రదేశ్‌లోనే మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండోర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులను స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఆయనే ఓ ఎద్దులా మారాడు. తన బండికి ఒకే ఎద్దు ఉండడంతో చేసేది లేక ఒకవైపు ఆ ఎద్దును కట్టి మరోవైపు తాను కాడి పట్టాడు. ఆ బండిపై ఇద్దరు కుటుంబసభ్యుల్ని మోసుకెళ్తూ పయనించాడు. మహుగావ్‌ నుంచి 25 కిమీ దూరంలో ఉన్న తన స్వగ్రామానికి ఆ బండిని లాక్కెళ్లడం విశేషం. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ వేళ ఎంతో మంది వలస కూలీలు కాలినడకన బయలుదేరి ప్రమాదాల బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మహారాష్ట్రంలో ఓ గూడ్సురైలు 16 మంది వలసకూలీలపై దూసుకెళ్లగా, తాజాగా బుధవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రహదారి ప్రమాదాల్లో 14 మంది వలసకూలీలు మృతిచెందారు. 


 


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని