కరోనా కష్టంలో ఆదుకుంటున్న కలప నోట్లు
close
Published : 25/06/2020 12:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కష్టంలో ఆదుకుంటున్న కలప నోట్లు

కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసింది. వ్యాపారాలు, ఉపాధి లేక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేక ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ ప్రజలకు ఆర్థిక సాయం చేయడం కోసం అమెరికాలోని టెనినో పట్టణం అసలు నోట్ల స్థానంలో సొంతంగా కలప నోట్లను ముద్రిస్తోంది. వాటినే మార్కెట్లో చలామణి అయ్యేలా చూస్తోంది.

కరోనాతో దాదాపు అందరి జేబులు ఖాళీ అయ్యాయి. దీంతో ప్రజలను ఆదుకోవడం కోసం ఏం చేయాలా? అని టెనినో ప్రభుత్వం ఆలోచిస్తుండగా.. పట్టణ మేయర్‌ వేన్‌ ఫర్నియర్‌ ఈ కలప నోట్ల విధానాన్ని ప్రతిపాదించారు. గతంలో అమెరికాలో ది గ్రేట్‌ డిప్రెషన్‌లోనూ ఇలాగే అసలు నోట్లకు బదులు కలప నోట్లను వినియోగించారట. ఇప్పుడు మళ్లీ దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కో కలప నోటును 25 డాలర్లు విలువతో ముద్రించారు. 1,800 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి నెలకు 300 కలప డాలర్లను ఇస్తున్నారట. అసలు నోట్లతోపాటు ఈ నోట్లను ఉపయోగించి సూపర్‌మార్కెట్‌ నుంచి పెట్రోల్‌ బంకుల వరకూ అన్ని దుకాణాల్లో లావాదేవీలు జరపొచ్చు. అయితే ఈ కలప నోట్లకు చిల్లర తిరిగి ఇవ్వరు. 25 డాలర్ల విలువకు సరిపడా సరకులు కొనుగోలు చేయాల్సిందే. సిగరెట్లు, మద్యం వంటి కొనుగోళ్లకు ఈ కలప నోట్లు చెల్లవు. 

ప్రభుత్వ ఆదేశాలతో అన్ని దుకాణాల యజమానులు ఈ కలప నోట్లను స్వీకరిస్తున్నారు. వీటిని స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అసలు నోట్లుగా మార్చుకోవచ్చు. లేదా ప్రపంచవ్యాప్తంగా విభిన్న నోట్లను సేకరించేవారు ఉంటారు. ఇలాంటి వారి కోసం ఉండే మార్కెట్లో వీటి విలువ.. నోటు విలువ కన్నా రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుందట. అలా నోట్లు సేకరించేవారికి ఈ కలప నోట్లను అమ్ముకోవచ్చట. ‘‘సాయం చేయాలంటే కష్టాల్లో ఉన్న వారికి డెబిట్‌ కార్డులు, లేదా నగదు ఇచ్చి ఆర్థిక సాయం చేయొచ్చు. కానీ ప్రజలు ఆ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తారో అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఇలా కలప నోట్ల రూపంలో ఇస్తే ఆ డబ్బు మా పట్టణం లోపలే చలామణీ అవుతుంది’’అని స్థానిక నాయకుడు టేలర్‌ వైట్‌వర్త్‌ తెలిపారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని