‘జీహెచ్‌ఎంసీలో లాక్‌డౌన్‌పై త్వరలో నిర్ణయం’
close
Published : 29/06/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జీహెచ్‌ఎంసీలో లాక్‌డౌన్‌పై త్వరలో నిర్ణయం’

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి మూడు, నాలుగు రోజుల్లో వ్యూహం ఖరారు చేయాలని అధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రాష్ట్రంలో అందులోనూ జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కేసీఆర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి వ్యూహం, అవసరమైతే లాక్‌డౌన్‌ విధించడం లాంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తేశాక కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్యను పెంచిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1087 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీవి 888 కేసులు కావడం గమనార్హం. జీహెచ్‌ఎంసీలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో... మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలని ప్రజల నుంచి వినతులు, వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. 

లాక్‌డౌన్‌ అంశంపైనా సమావేశంలో చర్చించారని సమాచారం. జీహెచ్‌ఎంసీలో లాక్‌డౌన్‌ విధింపుపై కొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కువ కరోనా కేసులు వచ్చినంత మాత్రాన ప్రజలు భయాందోళన చెందక్కర్లేదని సీఎం అన్నారు. అందరికీ సరైన వైద్యం కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని కేసీఆర్‌ తెలిపారు.

‘‘జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాలి. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయడానికి వీలుగా రోజుకి ఒకటి, రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి... రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుంది. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుంది. ప్రభుత్వపరంగా అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ లోతుగా పరిశీలించి ప్రభుత్వం అవసరమైన నిర్ణయం తీసుకుంటుంది’’ అని కేసీఆర్ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని