చావు తప్పదన్నారు.. ఆ మాట తప్పని నిరూపించాం!
close
Published : 07/07/2020 08:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చావు తప్పదన్నారు.. ఆ మాట తప్పని నిరూపించాం!

స్తోమత లేకున్నా.. వంటింటి చిట్కాలే బతికించాయి

ఇరుకు గదిలో ఉంటున్నా ధైర్యం తోడుంటే చాలు

‘ఈనాడు’తో కొవిడ్‌ విజేతలు

కొవిడ్‌-19 విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరిలోనూ భయం.. వైరస్‌ వస్తే కోలుకుంటామా..? వస్తే ఏం చేయాలి..?..ఇలా ఎన్నో సందేహాలు. ఇతరుల పరిస్థితి ఎలా ఉన్నా నగరంలోని పేద కుటుంబాల్లో మాత్రం ఆందోళన. ఇరుకు గదిలో కోలుకోవడం సాధ్యం కాదు.. అలాగని రూ.లక్షలు ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరగలేం.. ఈ ఆందోళనే వారిని వెన్నాడుతోంది. కానీ ఆ సందేహాలన్నింటినీ సంకల్ప బలంతో జయించింది ఓ కుటుంబం. ఇంటికి దిక్కుగా ఉన్న యజమాని కరోనా బారినపడి మరణించినా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం వారు అప్రమత్తమయ్యారు. కరోనాపై విజేతలయ్యారు. పౌష్టికాహారం తినేంత స్థోమత లేకున్నా వంటింటి చిట్కాలతోనే జయించామన్నారు. ‘ఈనాడు’తో తమ అభిప్రాయాలను వారు పంచుకున్నారు. - ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

గడ్డు పరిస్థితుల్లోనూ ధైర్యం వీడలేదు: 68 ఏళ్ల విజేత

నా కుమారుడు విద్యుత్తు కార్మికునిగా పనిచేసేవాడు. ప్రమాదంలో దివ్యాంగుడయ్యాడు. అప్పటి నుంచి కుటుంబాన్ని నేను, కోడలే పోషిస్తున్నాం. కొద్దిరోజుల క్రితం ఆరోగ్యం బాగాలేదని అతన్ని నా కోడలు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. కరోనా వచ్చిందని చెప్పారు. గాంధీలోనే చేర్చుకున్నారు. దివ్యాంగుడు కావడంతో సొంతంగా ఏ పనీ చేసుకోలేడు. దీంతో నా కోడలు సహాయకురాలిగా అక్కడే ఉంది. నేను మధ్యలో ఆసుపత్రికి వెళ్లి వచ్చాను. అన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితి విషమించి ఓ రోజు అతడు చనిపోయాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితి. అప్పుడు మా ఇద్దరికి కూడా పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. లక్షణాలేం లేవు, ఇంటికెళ్లిపోవాలని సూచించారు. కానీ మాకంత స్తోమత లేదు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారని చెబితే నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11 రోజులున్నాం. అప్పటికే కొడుకు మరణ బాధ తప్ప కరోనా భయమేం లేదు. ఇప్పుడు ఇంటికి దిక్కు నేనే. కుటుంబంలో భరోసా నింపాల్సింది నేనే. అందుకే ధైర్యంగా నిలుచున్నా. వైద్యులు చెప్పిన సూచనలన్నీ పాటించాను. డిశ్ఛార్జి అయ్యాక కూడా ఇంట్లోనే వంటింటి చిట్కాలు పాటించాం. ఇప్పుడు ఇద్దరం కోలుకున్నాం. ఆ బాధలో కుంగిపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. ధైర్యమే గెలిపించింది.

వైద్యులు..తోటి బాధితులు భరోసా ఇచ్చారు

- కొవిడ్‌ మృతుడి భార్య

మా ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి నేను గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నా. దివ్యాంగుడు కావడంతో నేనే దగ్గరుండి చూసుకున్నా. పీపీఈ కిట్‌ ధరించి సేవలందించా. పరిస్థితి చేయి దాటడంతో అతను చనిపోయాడు. కొందరు ఆయనకు పాజిటివ్‌ వచ్చిన మొదట్లోనే చనిపోతాడన్నారు. వెంట ఉన్న మాకూ పాజిటివ్‌ రాగానే ఇక మేం కూడా చనిపోతామన్నారు. ఆయన కనుమూసిన తర్వాత మరింత భయం పెరిగింది. వైద్యులు, తోటి బాధితులు భరోసా ఇచ్చారు. అక్కడ ఇచ్చిన ఆహారం, వైద్యంతో నెగెటివ్‌ వచ్చింది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇరుకు గది.. ఇద్దరు పిల్లలున్నారు. వారికి దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకున్నాం. పౌష్టికాహారం తినే స్థోమత లేదు. వైద్యుల సూచనతో కషాయం తాగుతున్నాం. పసుపు, అల్లం, మిరియాలు, తులసి వేడి నీటిలో మరిగించి తీసుకుంటున్నాం. పిల్లలకూ తాగిస్తున్నాం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని