490 మంది మృత్యుఒడికి..
close
Updated : 05/02/2020 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

490 మంది మృత్యుఒడికి..

బీజింగ్‌: చైనాలో మృత్యుఘోష కొనసాగుతోంది. కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య 490కి చేరింది. మరో 24,324 మందిలో ఈ వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు చైనా అధికారులు బుధవారం అధికారిక ప్రకటన చేశారు. వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సులో ఒక్క మంగళవారం రోజే 65 మంది చనిపోవడం వైరస్‌ విజృంభణకు అద్దంపడుతోంది. 3,887 మంది కొత్తవారిలో ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించారు. వీరిలో 431 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మంగళవారం 262 మంది వైరస్‌ బారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 892 మంది వైరస్ నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారు. దాదాపు 1.85 లక్షల మంది అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 

మరో 1300 పడకల ఆస్పత్రి...

 హాంకాంగ్‌లో 18 మందికి, మకావులో 10 మందికి, తైవాన్‌లో 11 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వైరస్‌ కట్టడికి చైనా అనేక పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే 1000 పడకల ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించిన ప్రభుత్వం నేడు మరో 1300 పడకల ఆస్పత్రిని తెరిచేందుకు సిద్ధమైంది. మరో 8 మొబైల్‌ క్యాబిన్‌ ఆస్పత్రుల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వుహాన్‌లోని అధికారులు తెలిపారు.

చైనా వెలుపల 176 కేసులు...

మరోవైపు  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 దేశాలకు ఈ వైరస్ వ్యాపించింది. భారత్‌లో మూడు కేసులు సహా ఇప్పటి వరకు చైనా వెలుపల 176 కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్న భారత్‌ మంగళవారం వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చిన 647 మంది భారతీయులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరోవైపు వుహాన్‌లో ఉన్న 16 మంది విదేశీయులకు ఈ వైరస్ సోకినట్లు చైనా అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు పాకిస్థానీలు, ఇద్దరు ఆస్ట్రేలియా వాసులు ఉన్నట్లు సమాచారం. తమని సొంత దేశానికి తీసుకెళ్లాలని పాకిస్థానీయులు వేడుకుంటున్నా ప్రభుత్వ నుంచి స్పందన కరవైంది. తమ వద్ద వైరస్‌ కట్టడి చేసేందుకు సరైన వసతులు లేవని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

‘ప్రపంచవ్యాప్త అంటువ్యాధి’ కాదు...

తాజా పరిస్థితిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ).. కరోనా వైరస్‌ను ఇప్పుడే ‘ప్రపంచవ్యాప్త అంటువ్యాధి’గా పరిగణించలేమని తెలిపింది. చైనా సహా పలు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల వైరస్‌వ్యాప్తిని పెద్ద ఎత్తున కట్టడి చేయగలిగామని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కలిసి పనిచేస్తేనే వైరస్‌ని నిలువరించగలమని తెలిపింది. అయితే కొన్ని సంపన్న దేశాలు వైరస్‌ కేసులను బయటకు వెల్లడించడానికి ఇష్టపడడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే డబ్ల్యూహెచ్‌ఓ ‘అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక స్థితి’ ప్రకటించిన విషయం తెలిసిందే.     

జపాన్‌ నౌకలో 10 మందికి...

జపాన్‌లో ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’ విహార నౌకలో ప్రయాణిస్తున్న 3711 మందిలో కనీసం పది మందికి ఈ వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నారు. వైరస్‌ భయంతో నౌకను విడిగా ఉంచిన విషయం తెలిసిందే. దీనిలో ప్రయాణించి, హాంకాంగ్‌లో దిగిన ఒక వ్యక్తికి పరీక్షలు నిర్వహించినప్పుడు వైరస్‌ లక్షణాలు బయటపడడంతో ముందు జాగ్రత్తగా మొత్తం అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. అందరినీ తమతమ గదుల్లోనే ఉండాల్సిందిగా సూచించారు. యొకహామా తీరానికి సోమవారం ఈ నౌక వచ్చినప్పటికీ అందరికీ వైద్య పరీక్షలు జరిపే వరకు ప్రయాణికులను బయటకు వదిలిపెట్టడం లేదు. దీంతో నౌకను ఒకటిరెండు రోజుల పాటు జపాన్‌లోనే నిలిపివేయనున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని