జపాన్‌ నౌకలోభారతీయుల పరిస్థితి ఏంటి?
close
Updated : 09/02/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపాన్‌ నౌకలోభారతీయుల పరిస్థితి ఏంటి?

దిల్లీ: జపాన్‌కు చెందిన విహార నౌక ‘డైమండ్‌ ప్రిన్సెస్‌’లో కరోనా సోకిన వారి సంఖ్య 64కు చేరింది. శనివారం మరో ముగ్గురు ఈ వైరస్‌ బారిన పడ్డట్లు గుర్తించారు. గత కొన్ని రోజులుగా యొకొహామ పోర్టులోనే నిలిచిపోయిన ఈ నౌకలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. దీనిలో భారతీయులు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వారెవరికీ వ్యాధి సోకలేదని విదేశాంగమంత్రి జైశంకర్‌ శనివారం స్పష్టం చేశారు. నౌకలో మొత్తం 138 మంది భారతీయులు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. వీరిలో 132 మంది సిబ్బంది కాగా.. మరో ఆరుగురు ప్రయాణికులు. ఈ నేపథ్యంలో నౌకలోకి సైన్యాన్ని పంపాలని జపాన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. నౌక నిర్వహణ కోసం లేదా ప్రయాణికుల్ని అక్కడి నుంచి తరలించడం కోసమో సైన్యాన్ని రంగంలోకి దింపే అవకాశం ఉందని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ నౌకలో పనిచేసే వినయ్‌ కుమార్‌ సర్కార్‌ ఫేస్‌బుక్‌లో ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. తమను ఎలాగైనా రక్షించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. శనివారం మరో భారతీయుడు తమ కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. కర్ణాటకలోని కార్‌వార్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు నౌకలో ‘స్టీవార్డు’గా పనిచేస్తున్నాడు. భారత ప్రభుత్వ సాయంతో తమని బయటకు తెచ్చేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు కోరాడు. అయితే నౌక యాజమాన్య కంపెనీ ప్రతినిధులు ‘కార్నివాల్‌ కార్పొరేషన్‌ అండ్ పీఎల్‌సీ’ కూడా సదరు యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి అపాయం జరగదని హామీ ఇచ్చినట్లు సమాచారం. నౌకలో ఉన్న భారతీయుల్లో చాలా మంది ముంబయి, కేరళ, గోవాకు చెందినవారని తెలిసింది. మరోవైపు ఇటు భారత్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

ఫిబ్రవరి 19తో వారి వైద్యపర్యవేక్షణ సమయం పూర్తవుతుందని సమాచారం. అప్పటి వరకు వారు వేచిచూడక తప్పదని తెలుస్తోంది. జపాన్‌లో అత్యాధునిక వసతులు ఉన్నా.. వైరస్ సోకే ప్రమాదకర ప్రదేశంలో మిగిలిన వారిని కూడా ఉంచాల్సిన అవసరం ఏంటని భారతీయులు ప్రశ్నిస్తున్నారు.  మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని