హఫిజ్‌ సయీద్‌కు శిక్ష అమలవుతుందా..?
close
Updated : 13/02/2020 15:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హఫిజ్‌ సయీద్‌కు శిక్ష అమలవుతుందా..?

అనుమానించాల్సిందేనంటున్న భారత ప్రభుత్వ వర్గాలు

దిల్లీ: ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫిజ్‌ సయీద్‌ను జైలుకు పంపాలన్న పాక్‌ నిర్ణయం ఎంత మేరకు అమలవుతుందో చూడాల్సి ఉందని భారత ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. బుధవారం పాకిస్థాన్‌ కోర్టు ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే మరో నాలుగురోజుల్లో ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) ప్లీనరీ జరగనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం వెలువడినట్లుగా భావించాల్సి ఉందని అభిప్రాయపడ్డాయి. సయీద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతోకాలంగా అంతర్జాతీయ సమాజం పాక్‌ను ఒత్తిడి చేస్తోందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాయి. ఇదే తరహాలో పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇతర ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలపై కూడా చర్యలు తీసుకుంటారో లేదో గమనించాల్సిన అంశం అన్నారు. పఠాన్‌కోట్‌, ముంబయి దాడులకు కారణమైన విద్రోహులను ఎంత తొందరగా చట్టం ముందుకు తీసుకొస్తారో కూడా పరిశీలించాల్సి ఉందన్నారు.

ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నారన్న ఆరోపణల కింద గత జులైలో హఫిజ్‌ సయీద్‌ను పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం లాహోర్లోని జైలుకు తరలించారు. ఆయనపై మొత్తం ఆరు కేసులు పెండింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం రెండింటిలో మాత్రమే తీర్పు వెలువరించింది. అయితే కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సయీద్‌ ఉన్నత న్యాయస్థానాల్ని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడికి విధించిన శిక్ష ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు సయీద్‌కు శిక్ష విధించడాన్ని అగ్రరాజ్యం అమెరికా  స్వాగతించింది.

పాకిస్థాన్‌ను ‘గ్రే జాబితా’లోనే కొనసాగిస్తూ ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద ముఠాలకు నిధుల ప్రవాహాన్ని కట్టడి చేయడంలో ఆ దేశం విఫలమైందన్న కారణంతో ఎఫ్‌ఏటీఎఫ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లోగా పాకిస్థాన్‌ ఈ జాబితా నుంచి బయటపడకపోతే బ్లాక్‌ లిస్ట్‌లో చేరిపోతుంది. అదే జరిగితే దాయాది దేశంపై తీవ్ర ఆర్థిక ఆంక్షలు తప్పవు. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ దేశానికి ఇది గుదిబండగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సయీద్‌పై తాత్కాలిక చర్యలు తీసుకొని బ్లాక్‌లిస్ట్‌ గండం నుంచి గట్టేక్కేందుకు పాక్‌ ప్రయత్నిస్తోందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని