పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ కీలక వ్యాఖ్యలు!
close
Updated : 18/02/2020 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌పై ఎఫ్‌ఏటీఎఫ్‌ కీలక వ్యాఖ్యలు!

 

ప్యారిస్‌: పాకిస్థాన్‌ ‘గ్రే లిస్ట్‌’పై కీలక నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాద సంస్థలకు ఇంకా అక్రమ మార్గాల ద్వారా నిధులు అందుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సహకారం ఇంకా కొనసాగుతూనే ఉందని తేటతెల్లం చేసింది. వారం రోజుల పాటు జరిగే ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశాలు ప్యారిస్‌లో ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ను ‘గ్రే లిస్ట్‌’లో ఉంచాలా లేక ‘బ్లాక్‌ లిస్ట్‌’లో చేర్చాలా లేదా మొత్తానికే ఆంక్షల పరిధి నుంచి తొలగించాలా అన్న విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ తరుణంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మానవహక్కుల కోసం పోరాడుతున్న వారిపై దాడులు జరుగుతున్నాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఐసిల్‌, అల్‌ఖైదా వంటి ఉగ్రసంస్థలకు ఇంకా నిధులు అందుతన్నాయని స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీ వంటి అత్యాధునిక మార్గాల ద్వారా కూడా ఉగ్రసంస్థలకు నిధులు సమకూరుతున్నాయని వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అక్రమ నగదు చలామణి, ఉగ్రసంస్థలకు నిధులు సమకూరడం వంటి కార్యకలాపాలపై సమావేశంలో చర్చించనున్నారు. వీటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన కఠిన నిబంధనలపైన దృష్టి సారించనున్నారు.

పాకిస్థాన్‌ ఇప్పటికే ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన లక్ష్యాల మేరకు కొన్ని చర్యలు చేపట్టినట్లు చెబుతోంది. అందులో భాగంగానే ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పు వెలువరించింది. మరో కరడుగట్టిన ఉగ్రవాది మసూద్‌ అజార్‌ ఆచూకీ దొరకడం లేదంటూ పాక్‌ కట్టుకథలు చెబుతోంది. అలాగే ఐరాస ఉగ్రవాదులుగా ముద్రవేసిన 16 మందిలో ఏడుగురు చనిపోయారని చెప్పుకొచ్చింది. మరో తొమ్మిది మందిలో ఏడుగురు తమని జాబితా నుంచి తొలగించాలని ఐరాసకు దరఖాస్తు చేసుకున్నారని ఎఫ్‌ఏటీఎఫ్‌కు వివరించింది.

39 దేశాలున్న ఎఫ్‌ఏటీఎఫ్‌లో పాక్‌ ‘గ్రే లిస్ట్‌’ నుంచి తప్పించుకొని ‘వైట్‌ లిస్ట్‌’లో చేరడానికి 15-16 సభ్యుల మద్దతు అవసరం. ఇక బ్లాక్‌ లిస్ట్‌ ముప్పు తప్పించుకోవడానికి మూడు దేశాలు పాక్‌కు అండగా నిలవాల్సి ఉంటుంది. గత నెల బీజింగ్‌లో జరిగిన ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశంలో చైనా సహా పాక్‌కు మద్దతుగా మలేషియా, టర్కీ నిలిచాయి. అక్టోబరు 2019లో జరిగిన సమావేశంలో పాక్‌కు నిర్దేశించిన 27 లక్ష్యాల్లో కేవలం ఐదు అంశాల్లో మాత్రమే పురోగతి సాధించిందని హెచ్చరిస్తూ దాయాదికి చివరి అవకాశం ఇచ్చింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని