నేను కరిగిపోయాను..అబూసలేం పారిపోయాడు
close
Updated : 19/02/2020 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను కరిగిపోయాను..అబూసలేం పారిపోయాడు

ముంబయి: ‘జీవితంలో ఓ పెద్ద తప్పు చేశా.. ఓ మహిళ కన్నీళ్లను నమ్మి ఆమెపై సానుభూతి చూపించా. ఆ పొరబాటే అబూ సలేం తప్పించుకోడానికి కారణమైంది. అతడిని అండర్‌వరల్డ్‌ డాన్‌ను చేసింది’ అని అంటున్నారు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మరియా. తన ఆటోబయోగ్రఫీ ‘లెట్‌ మి సే ఇట్‌ నౌ’ ద్వారా మరియా.. ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లు, ఉగ్ర ఘటనలకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 26/11 ముంబయి పేలుళ్ల కేసులో దోషి అయిన అజ్మల్‌ కసబ్‌ చేతికి ఎర్రదారం వెనుక కథను వెల్లడించిన ఆయన.. 1993 నాటి పేలుళ్ల తర్వాత అబూ సలేం ఎలా పారిపోయాడో వివరించారు. 

1993లో ముంబయిలో వరుస పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో రాకేశ్‌ మరియా సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా ఘటనకు ఉపయోగించిన ఆయుధాలను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నివాసంలో దాచినట్లు మరియాకు సమాచారం వచ్చింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణకు సంబంధించిన విషయాలను మరియా తన పుస్తకంలో వెల్లడించారు. 

‘సంజయ్‌ దత్‌ నివాసం నుంచి ఆయుధాలు తీసుకున్న వారిలో జైబున్నిసా ఖాజీ అనే మహిళ తప్పకుండా ఉందని మాకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఆమెను విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించా. అయితే స్టేషన్‌లో జైబున్నిసా భావోద్వేగానికి గురై ఏకధాటిగా ఏడ్వటం మొదలుపెట్టింది. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపింది. ఆయుధాల గురించి తనకేమీ తెలియదని చెప్పింది. ఆమె చెప్పిన మాటలకు నాకు సానుభూతి కలిగింది. దీంతో ఆమెను వెళ్లిపొమ్మని చెప్పా. ఆమెను నమ్మడమే నా జీవితంలో చేసిన పెద్ద తప్పు’

‘ఆ తర్వాత ఆయుధాలను సరఫరాకు ఉపయోగించిన కారు యజమాని అయిన మన్సూర్‌ అహ్మద్‌ అనే వ్యక్తిపై దృష్టి పెట్టి అతడిని విచారణకు పిలిపించా. నిజానికి మన్సూర్‌ను అంతకుముందు కూడా ప్రశ్నించాం. జైబున్నిసా పేరు చెప్పింది కూడా అతడే. రెండోసారి విచారణలో మన్సూర్‌ మరిన్ని విషయాలు బయటపెట్టాడు. జైబున్నిసా కన్పించేంత అమయాకురాలు కాదని, ఆయుధాల గురించి ఆమెను అనేక విషయాలు తెలుసని చెప్పాడు. దీంతో నాకు అసలు విషయం అర్థమైంది. తన కన్నీళ్లకు కరిగిపోయి పెద్ద తప్పు చేశానని తెలిసింది. ఆలస్యం చేయకుండా జైబున్నిసాను మళ్లీ విచారించా. నా ముందుకు రాగానే లాగి పెట్టి కొట్టా. అప్పుడు ఆమె నిజం ఒప్పుకుంది. అబూ సలేం తనకు ఆయుధాలు ఇచ్చి దాచిపెట్టమని చెప్పాడని తెలిపింది. అతడి అంధేరీ అడ్రస్‌ కూడా ఇచ్చింది’ 

‘మేం వెంటనే అక్కడకు వెళ్లాం. అయితే అప్పటికే చాలా ఆలస్యమైంది. మా కంటే ముందే జైబున్నిసా అబూ సలేంకు విషయం మొత్తం చెప్పింది. దీంతో అతడు దిల్లీకి పారిపోయి అక్కడి నుంచి నేపాల్‌ మీదుగా దుబాయి చేరాడు. ఆ తర్వాత అండర్‌ వరల్డ్‌ డాన్‌గా మారి ముంబయిలోని బాలీవుడ్‌ ప్రముఖులు, బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడ్డాడు’ అని మరియా తన పుస్తకంలో రాసుకొచ్చారు. 

1993 నాటి ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక పాత్రధారి అయిన అబూ సలేంను 2002లో ఇంటర్‌పోల్‌ అధికారులు పోర్చుగల్‌లో అరెస్టు చేశారు. ఆ తర్వాత భారత్‌కు అప్పగించారు. పేలుళ్లు, బెదిరింపులు, హత్య కేసుల్లో 2015లో అతడికి జీవిత ఖైదు పడింది. అబూ సలేం ప్రస్తుతం తలోజా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని