దిల్లీ హింస: హైకోర్టు న్యాయమూర్తి బదిలీ
close
Updated : 27/02/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ హింస: హైకోర్టు న్యాయమూర్తి బదిలీ

32కి పెరిగిన మృతులు

దిల్లీ: ఈశాన్య దిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు బుధవారం రాత్రి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

‘భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌ను పంజాబ్‌-హరియాణా హైకోర్టు జడ్జీగా బదిలీ చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్‌, హరియాణా హైకోర్టులో బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు’ అని న్యాయశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నిజానికి జస్టిస్‌ మురళీధర్‌ బదిలీని సుప్రీంకోర్టు కొలీజియం రెండు వారాల క్రితమే సిఫార్సు చేసిప్పటికీ.. దిల్లీ పోలీసులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ఈ నోటిఫికేషన్‌ వెలువడం పలు అనుమానాలకు దారితీస్తోంది. 

దిల్లీ అల్లర్లకు కారణమైనవారిపై కేసులు పెట్టి, అరెస్టు చేయాలన్న అభ్యర్థలనపై జస్టిస్‌ మురళీధర్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఘటనల సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అంతేగాక, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన భాజపా నేతలపై ఎందుకు కేసులు పెట్టలేదని పోలీసులను ప్రశ్నించింది. ఈ విచారణ జరిగిన కొద్ది గంటల తర్వాత జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేస్తూ న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీచేయడం గమనార్హం. 

బదిలీపై కాంగ్రెస్‌ విమర్శలు

మరోవైపు జస్టిస్‌ మురళీధర్‌ను కేంద్రం కావాలనే బదిలీ చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రికి రాత్రే జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేయడం షాకింగ్‌ విషయం కానప్పటికీ.. న్యాయవ్యవస్థకు ఇది సిగ్గుచేటు. న్యాయవ్యవస్థపై కోట్లాది మంది భారతీయులకు అపారమైన విశ్వాసం ఉంది. అయితే, వాస్తవాల్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఈ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయి’ అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. 

32కి చేరిన మృతులు

ఇదిలా ఉండగా.. దిల్లీలో ఉద్రిక్తతలు కాస్త తగ్గినా అల్లర్ల కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 32కి పెరిగింది. అల్లర్లలో గాయపడిన ఐదుగురు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. మరోవైపు ఆందోళనలు చోటుచేసుకున్న మౌజ్‌పుర్‌, జఫ్రాబాద్‌, సీలంపూర్‌, బాబర్‌పూర్‌లో భద్రతా బలగాలు మోహరించాయి. Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని