కరోనా కట్టడికి సుప్రీం కీలక నిర్ణయం
close
Published : 16/03/2020 16:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కట్టడికి సుప్రీం కీలక నిర్ణయం

దిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆవరణలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయాలు తీసుకొంది. కరోనా వైరస్‌ కారణంగా సుప్రీం కోర్టును పూర్తిగా మూసివేయడం సాధ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బొబ్డే అన్నారు. ఆదివారం జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యుయు లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఎల్ నాగేశ్వరరావులతో పాటు సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, వైద్యులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు.

వైద్యులు సూచించిన విధంగా ముందస్తు భద్రతా చర్యలు పాటించేలా చూడాలని సీజేఐ బార్‌ అసోసియేషన్లను కోరారు. దానితో పాటు వాలంటీర్లను ఏర్పాటు చేసి సభ్యులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండేలా చూడాలని కోరారు. న్యాయస్థానం ఆవరణలోకి సందర్శకులకు ఇచ్చే అనుమతులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కోర్టులోని క్యాంటీన్‌లను మూసివేయాలని ఆదేశించారు. అంతే కాకుండా న్యాయవాదులు, ఇతర సిబ్బంది కోర్టు ఆవరణలో తమ విధులు ముగిసిన వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. కరోనా వ్యాపించిన దేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులకు కోర్టు ఆవరణలోకి అనుమతించవద్దని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు సందర్శన కోసం వచ్చే వ్యక్తులు ఎవరైనా రెండు రోజుల నుంచి దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే ఆ విషయాన్ని ముందుగా తెలియాజేయాలని సూచించారు. ఇందుకోసం ప్రవేశ ప్రాంగణంలోనే ధ్రువీకరణ పత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని ఉపయోగించేలా బార్‌ సభ్యులను ప్రోత్సహించాలని కోరారు. కొద్ది రోజుల క్రితం అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని సుప్రీం ప్రకటించిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని