కరోనా ఐసోలేషన్‌ నిబంధనల్లో మార్పు
close
Published : 28/04/2020 23:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఐసోలేషన్‌ నిబంధనల్లో మార్పు

దిల్లీ: ప్రమాదకర కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు... ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయిన రోగులు ఆస్పత్రులలోని ఐసోలేషన్‌ వార్డుల్లో మాత్రమే ఉండాలనే నియమం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అయితే ఐసోలేషన్‌ విషయమై కేంద్ర ప్రభుత్వం తాజాగా నూతన మార్గదర్శకాలను జారీచేసింది. తక్కువ లేదా ప్రాథమిక స్థాయిలో కొవిడ్‌-19 ఉన్న బాధితులు ఇంటివద్దనే ఐసోలేషన్‌లో (హోం ఐసోలేషన్‌) ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వివరించింది. కాగా, ఇప్పటి వరకు కొవిడ్‌-19 పాజిటివ్‌ అని పరీక్షల ద్వారా నిర్ధారణ అయిన అందరినీ వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తున్నారు. అయితే ఇంటివద్ద సదుపాయం ఉండి, ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాథమికస్థాయి కరోనా రోగులు తమ ఇంటి వద్దనే ‘హోమ్‌ ఐసోలేషన్‌’లో ఉండవచ్చని తాజా ప్రకటన తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

హోం ఐసోలేషన్‌లో ఉండాలంటే...

*సదరు కరోనా బాధితులకు వ్యాధి అతి తక్కువ లేదా ప్రాథమిక స్థాయిలో ఉన్నట్టు సంబంధిత వైద్యులు ధృవీకరించి సిఫార్సు చేయాలి.

*కొవిడ్‌ బాధితుడు సెల్ఫ్‌-ఐసోలేషన్‌ నిబంధనలను తప్పక పాటించటమే కాకుండా... ఆ మేరకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి. 

*వారు బ్లూటూత్‌, వై-ఫై ద్వారా జిల్లా నిఘా అధికారికి, నిఘా బృందానికి నిరంతర పర్యవేక్షణకు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని, వివరాలను తెలియచేస్తూ ఉండాలి. ఆ మేరకు కొవిడ్‌-19 బాధితులు ధృవపత్రాన్ని సమర్పించాలి.
*కరోనా బాధితుల నివాసం సెల్ఫ్‌ ఐసోలేసన్‌కు అనుగుణంగా ఉండాలి. మిగిలిన కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్లో ఉండాలి.
*కరోనా బాధితుడికి సహాయంగా ఎల్లప్పుడూ ఓ సహాయకుడు లేదా సహాయకురాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
*హోం ఐసోలేషన్‌ పర్యంతం ఆ సహాయకుడు సంబంధిత ఆస్పత్రికి రోగిని గురించిన సమాచారం ఇచ్చే విధంగా ఉండాలి. 
*సహాయకులు, వారి సంబంధీకులు వైద్యాధికారి సూచించిన ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఔషధాన్ని తీసుకోవాలి.
*బాధితుడు, సహాయకుడు ఇద్దరూ తమ తమ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ కలిగి ఉండాలి. దానిని అన్నివేళల యాక్టివ్‌గా ఉంచాలి.

వీరు వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?

*ఊపిరి పీల్చటంలో ఇబ్బందిగా ఉన్నపుడు
*ఛాతీలో నొప్పి, భారంగా లేదా ఇబ్బందిగా ఉన్నపుడు
*మానసిక అయోమయ స్థితి, లేవలేకుండా ఉన్నప్పుడు
*పెదవులు, ముఖం నీలంగా మారుతున్నపుడు
*చికిత్స అందిస్తున్న వైద్యాధికారి సూచనల మేరకు

హోం ఐసోలేషన్ ఎప్పుడు చాలించవచ్చు?

ఇంట్లోనే ఐసోలేషన్ నిబంధనలను పాటిస్తున్న వారు కొవిడ్-19 లక్షణాలు పూర్తిగా నయం అయినట్టు పరీక్షల ద్వారా నిర్ధారణ అయన తర్వాత... సంబంధిత కరోనా నిఘా అధికారి ఆ మేరకు ధృవీకరణ పత్రం జారీచేసిన అనంతరం కరోనా బాధితులు హోం ఐసోలేషన్ నుంచి బయటపడవచ్చు. హోం ఐసోలేషన్‌ను అనుమతిస్తున్న ఈ కొత్త విధానం వల్ల కొవిడ్‌-19 బాధితులకు ఆందోళన తగ్గటంతో పాటు.. వైద్య సిబ్బందిపై కూడా ఒత్తిడి తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని