పాకిస్థాన్‌, చైనా చేతిలో బందీనే!
close
Published : 06/05/2020 17:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాకిస్థాన్‌, చైనా చేతిలో బందీనే!

అమెరికా రక్షణ విభాగం మాజీ అధికారి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌కు ఓవైపు అమెరికాతో బీటలువారుతున్న సంబంధాలు, మరోవైపు చైనాతో వ్యాపార, వ్యూహాత్మక ఒప్పందాలతో ధృడపడుతున్న పరిస్థితులు చూస్తుంటే, పాకిస్థాన్‌ కేవలం చైనాకు ఒక కాలనీ కంటే ఎక్కువేమీ కాదని అమెరికా అభిప్రాయపడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో అమెరికా సత్సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌, చైనాతో చేతులు కలిపిందని అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్‌ వెల్లడించారు. చైనా పాకిస్థాన్‌ను ఒక వ్యాపార భాగస్వామిగా చూడడంలేదనే విషయాన్ని పాకిస్థాన్‌ తొందరలోనే గుర్తిస్తుందని మైఖేల్‌ రూబిన్‌ పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక ‘ది నేషనల్‌ ఇంటెరెస్ట్‌’లో ప్రచురితమైన వ్యాసంలో రూబిన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో పాకిస్థాన్‌ తాను చేసిన తప్పిదాన్ని తొందరలోనే తెలుసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా లక్షలమంది ముస్లింలను చైనా వివిధ క్యాంపులలో ఉంచిది. ఆ దేశంలో ఉన్న పాకిస్థానీలను అవమానపరచినా, హింసించినా పట్టించుకోని చైనాతో తాము బలమైన ఒప్పందాలు కుదుర్చుకున్నామనే విషయాన్ని తొందరలోనే పాకిస్థాన్ తెలుసుకుంటుందని తన వ్యాసంలో పేర్కొన్నారు. 

అయితే, ప్రస్తుతం కరోనావైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను కట్టడి చేయడంలో పాకిస్థాన్‌ విఫలమైంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు రోడ్డు రవాణా సదుపాయంతో పాటు చైనాకు అతిపెద్ద రవాణా మార్గంగా మారబోయే చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌)లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వైరస్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఈ కారిడార్‌లో ఉన్న గిల్గిట్‌-బాల్టిస్థాన్‌, పీఓకే, పంజాబ్‌, సింధ్‌తోపాటు బలూచిస్థాన్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో చైనా నుంచి వాణిజ్య రవాణా ప్రారంభమైతే ఈ వైరస్‌ తీవ్రత కార్చిచ్చులా వ్యాపిస్తుందనే భయం వీరిలో వ్యక్తమవుతున్నట్లు రూబిన్‌ వెల్లడించారు. 

ఈ కారిడార్‌ కోసం పనిచేస్తున్న చైనా కార్మికులు నూతన సంవత్సర వేడుకల కోసం తమ దేశానికి వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. చైనాలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిందని అక్కడి ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం పదినుంచి పదిహేను వేల మంది సీపెక్‌ కోసం పనిచేసే కార్మికులు తిరిగి పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో కార్మికులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు చైనా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికే గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతంలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంది. కేవలం ఈ ప్రాంతంలో రోజుకు 15మందికి వైద్య పరీక్షలు నిర్వహించగల ఒకే ఒక్క టెస్టింగ్‌ సెంటర్ ఉంది. అంతేకాకుండా 200 వెంటిలేటర్లు కావాలని అక్కడి వైద్యులు కోరినప్పటికీ కేవలం తొమ్మిది మాత్రమే అందుబాటులో ఉండడం అక్కడి పరిస్థితికి అద్ధం పడుతోంది. తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్‌ అధికారులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రూబిన్‌ పేర్కొన్నారు. 

ఇక ఈ వైరస్‌ చైనాలోని వుహాన్‌లో పుట్టినట్లుగా భావిస్తున్నప్పటికీ చైనా దీనిపై భిన్నవాదనలు వినిపిస్తోంది. అంతేకాకుండా అక్కడి బాధితులు, మరణాల సంఖ్యను ప్రకటించడంలో ఊడా విఫలం చెందింది. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడితోపాటు అక్కడి అధికారులు చైనాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో పాకిస్థాన్‌ను చైనా వ్యాపార భాగస్వామిగా చూడడం లేదనే విషయాన్ని అమెరికా అధికారులు మరోసారి నొక్కిచెబుతున్నారు. ఇలా ఎన్నో అనుమానాలకు కారణామైన చైనాను పాకిస్థాన్ మాత్రం బలంగా నమ్ముతోంది. ఇదే విషయాన్ని రానున్న రోజుల్లో పాకిస్థాన్‌ తెలుసుకుంటుందని మైఖేల్‌ రూబిన్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే, పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 22వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 500మంది మృత్యువాతపడ్డారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇవీ చదవండి..

చైనా: రహస్యం బయటపడుతుందని నోరు నొక్కేస్తోందా

ఉద్యోగమో..రామచంద్రా!
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని