చైనా కొత్త చట్టంపై హాంకాంగ్‌లో నిరసనలు
close
Published : 24/05/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా కొత్త చట్టంపై హాంకాంగ్‌లో నిరసనలు

ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగం

హాంకాంగ్‌: చైనా తీసుకొస్తున్న వివాదాస్పద జాతీయ భద్రతా చట్టంపై హాంకాంగ్‌ నిరసనలు మిన్నంటాయి. చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్డుపైకి రావడంతో వారిపై పోలీసులు బాష్పవాయువును, జల ఫిరంగలను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. చైనా తీసుకొస్తున్న చట్టం వల్ల హాంకాంగ్‌ ప్రాదేశిక స్వయంప్రతిపత్తి, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య అనుకూల వాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం నలుపు దుస్తులు ధరించిన నిరసనకారులు ప్రతిపాదిత చట్టానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. హాంకాంగ్‌ స్వేచ్ఛ కల్పించాలని నినదించారు. దీంతో పోలీసులు వారిని హెచ్చరిస్తూ నీలి రంగు జెండాలు చూపించారు. అప్పటికీ వారు వెనక్కి తగ్గకపోవడంతో వారిపై బాష్పవాయువును ప్రయోగించారు. జల ఫిరంగులు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. 120 మంది ఆందోళనకారులను అరెస్ట్‌ చేశారు. చట్ట విరుద్ధంగా ఒక చోట గుమిగూడారన్న ఆరోపణలపై వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొ,న్నారు. తొలుత తమ సిబ్బందిపై రాళ్లు రువ్వారని, గుర్తుతెలియని ద్రావణాన్ని తమపై ఆందోళనకారులు చల్లడంతో తాము జోక్యం చేసుకున్నామని తెలిపారు.

ఏమిటీ చట్టం.. ఎందుకీ ఆందోళనలు?

ప్రబల ఆర్థిక శక్తి అయిన హాంకాంగ్‌ ప్రస్తుతం చైనాలో ప్రత్యేక పాలనా వ్యవస్థ (ఎస్‌ఏఆర్‌)గా ఉంది. 1997 జులై 1న ఈ ప్రాంతం.. బ్రిటన్‌ నుంచి చైనా అధీనంలోకి వచ్చింది. నాటి నుంచి ‘ఒక దేశం, రెండు వ్యవస్థలు’ అనే విధానం ఇక్కడ అమల్లో ఉంది. దీని ప్రకారం చైనాలోని మిగతా ప్రాంతాల్లో లేని కొన్ని రకాల స్వేచ్ఛలను హాంకాంగ్‌లో పొందొచ్చు. ఇక్కడ పరిమిత స్థాయిలో ప్రజాస్వామ్యం, పౌర హక్కులు అమల్లో ఉంటాయి.

హాంకాంగ్‌ ప్రత్యేక పాలనా ప్రాంతం (హెచ్‌కేఎస్‌ఏఆర్‌)లో న్యాయ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని మెరుగుపరచడానికి ఈ బిల్లును తెస్తున్నట్లు చైనా తెలిపింది. హాంకాంగ్‌ ప్రాంతంలో చేపట్టే దేశద్రోహం, వేర్పాటువాద, విద్రోహ చర్యలు, విదేశీ జోక్యం, ఉగ్రవాదాన్ని నిషేధించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని చైనా అధికారులు పేర్కొన్నారు. దీన్ని చైనా పార్లమెంటు అయిన ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ (ఎన్‌పీసీ)కు శుక్రవారం సమర్పించింది. ఈ నెల 28న ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని