మరో పెనువివాదంలో చైనా..! 
close
Published : 29/05/2020 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో పెనువివాదంలో చైనా..! 

 సినో-బ్రిటిష్‌ ఒప్పందానికి తూట్లు

బీజింగ్‌: హాంకాంగ్‌ స్వయంపాలిత ప్రాంతం హక్కులను  కాలరాచేలా కీలక బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.  హాంకాంగ్‌లో జాతీయ భధ్రతా చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనాలోని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది. వేర్పాటు వాదం అణిచివేత, హాంకాంగ్‌ హక్కుల అణచివేత, ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం పేరుతో హింసకు పాల్పడం, విదేశీ జోక్యాన్ని నివారించడంతోపాటు చైనాలోని సెక్యూరిటీ ఏజెన్సీలు హాంకాంగ్‌లోకి వెళ్లడానికి అధికారం లభిస్తుంది. ఈ బిల్లుకు కేవలం ఒక ఓటు మాత్రమే వ్యతిరేకంగా వచ్చింది. 2,878 మంది అనుకూలంగా ఓటు వేయగా.. ఆరుగురు గైర్హాజరయ్యారు. 

ఈ చట్టానికి అవసరమైన విధివిధానాలను నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ తయారు చేస్తుంది. దీనికి మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత హాంకాంగ్‌ ప్రభుత్వం శాసన ప్రకటనతో దీనిని అమల్లోకి తెస్తుంది. అక్కడి చట్టసభను తప్పించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నారు. అంటే దొడ్డిదోవలో  ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం అన్నమాట. 1997 బ్రిటన్‌ పాలకుల నుంచి హాంకాంగ్‌ను తీసుకొనే సమయంలో చేసుకొన్న వన్‌ కంట్రీ, టూ సిస్టమ్స్‌ ఒప్పందానికి ఇది విరుద్ధం.

హాంకాంగ్‌ కోసం ఆత్రం..!

అసలు హాంకాంగ్‌ కోసం చైనా అంతగా ఎందుకు వెంపర్లాడుతోంది? ఒప్పందం ప్రకారం 2047 వరకు కూడా హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వకూడదని ఎందుకు అనుకుంటోంది? ఇప్పటి నుంచే ఈ నగరాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఎందుకు ఆత్రపడుతోంది..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆర్థిక అవసరాలు..! హాంకాంగ్‌ చైనాకు బంగారు బాతు.. ఆ బాతు గుడ్లను వాడుకోకుండా.. బాతునే కోసుకు తినాలని చూస్తోంది.

2019 జూన్‌ 9న వివాదానికి బీజం వేస్తూ హాంకాంగ్‌ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. మూడు రోజుల తర్వాత ఆందోళనలు మొదలయ్యాయి. అవి సునామీలా మారాయి.  సాక్షాత్తు హాంకాంగ్‌ పాలకురాలు, చైనా కీలుబొమ్మగా పేరున్న కెరీలామ్‌ ‘సారీ’ చెప్పినా.. ఏడ్చినా.. బిల్లును రద్దు చేసినా ఆందోళనలు 2019 చివరి వరకు కొనసాగాయి.   ఒక దశలో చైనా ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. భద్రతా దళాలు మారుదుస్తుల్లో హాంకాంగ్‌ ప్రదర్శనకారుల్లో చేరి దాడులు చేశాయి. హాంకాంగ్‌ సరిహద్దుల్లో భారీగా చైనా దళాలు, ట్యాంకులను మోహరించింది. అప్పట్లో వ్యవహారం మొత్తం చూస్తే  హాంకాంగ్‌పై చైనా దండయాత్ర చేస్తోందా.. లేక మరో తియాన్మన్‌ స్క్వేర్‌ పునరావృతం అవుతుందా అనే స్థాయిలో పరిస్థితి నెలకొంది. కానీ, 2020 ప్రారంభంలో చైనా, హాంకాంగ్‌ల్లో కరోనావైరస్‌ వ్యాపించింది. దీంతో ఉద్యమానికి కొన్నాళ్లు విరామం లభించింది. ఈ అదునుగా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. కానీ, వందల సంఖ్యలో విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్టు చేశారు. 

ఆ నగరం ఓ ఆర్థిక సౌధం 

ఒకప్పటి బ్రిటిష్‌ కాలనీ అయిన  హాంకాంగ్‌ ఆర్థికంగా ఎప్పుడూ సుసంపన్నంగానే ఉంది. ఇక్కడ ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం హాంకాంగ్‌కు పశ్చిమ దేశాల నుంచి పెట్టుబడుల వరదను పారించింది. చైనా కంపెనీలకు విదేశీ నిధులు ఇక్కడి నుంచే వెళతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్‌ మార్కెట్లలో హాంకాంగ్‌ మార్కెట్‌ ఒకటి. హాంకాంగ్‌ ఆదాయం, పరపతి నుంచి చైనా భారీగా లబ్ధిపొందింది.
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశేతర మార్కెట్‌ హాంకాంగే. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో 7శాతం ఈ ఒక్క నగరంలోనే ఉన్నాయంటే ఎంత వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు చెందిన బీవోసీ హాంకాంగ్‌ లిమిటెడ్‌ నోట్లు జారీ చేసే బ్యాంకుల్లో ఒకటి. ఈ బ్యాంకు నిర్వహణ ఆదాయం ఐదో వంతు హాంకాంగ్‌, మకావ్‌ల నుంచే వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో కొన్నిటి ప్రధాన కార్యాలయాలు హాంకాంగ్‌లోనే ఉన్నాయి. 

చైనాకు అవసరానికి సొమ్ము..

చైనాలో నగదు కొరతను ఎదుర్కొంటున్న రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు, స్థానిక ప్రభుత్వ ఆర్థిక సంస్థలు హాంకాంగ్‌ నుంచి రుణాలు తెచ్చుకొంటాయి. అవే రుణాలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిందే. ఇప్పుడు హాంకాంగ్‌ చేజారితే చైనాకు ఆర్థిక ఇబ్బందులు తప్పవు. 

డ్రాగన్‌ కంపెనీలకు ఆశ్రయం..

పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు ఉన్న హాంకాంగ్‌లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి చైనా కంపెనీలు ఇష్టపడతాయి. చాలా కంపెనీలు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, క్నుక్‌ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. 2015 నుంచి హాంకాంగ్‌లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్‌ డాలర్లకు పైగా సేకరించాయి.  చైనాలో సేకరించిన మొత్తంలో ఇది 80శాతానికి సమానం..! అదీ హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ శక్తి. 
తాజాగా విదేశీ పెట్టుబడిదారులు హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ ద్వారా షాంఘై మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఈ రకమైన ట్రేడింగ్‌ వాటా షాంఘై  స్టాక్‌మార్కెట్లో 8శాతానికి చేరుకొంది. 

డాలర్‌ మార్పిడీకి అడ్డా..

హాంకాంగ్‌ కరెన్సీ విలువ డాలర్‌కు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో చైనీయులు యువాన్లను డాలర్లలో మార్చుకోవడానికి హాంకాంగ్‌లోని బీమా ఉత్పత్తులను వాడుకొంటారు. క్రెడిట్‌ కార్డ్ల ద్వారా చెల్లింపులు చేసి చైనా నిబంధనలను బైపాస్‌ చేస్తుంటారు. దీనికి తోడు చైనా విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా హాంకాంగ్‌కే వెళతాయి.  2017 చివరినాటికి ఇవి దాదాపు 981 బిలియన్‌ డాలర్లను చేరుకున్నాయి. 

అల్లర్ల అదపు డ్రాగన్‌కు అత్యవసరం..

హాంకాంగ్‌లో ఏమి చేసైనా అల్లర్లను అదుపు చేయడం చైనాకు ఇప్పుడు అత్యవసరం. అమెరికా హాంకాంగ్‌ను వాణిజ్య యుద్ధంలో బేరాలాడటానికి ఆయుధంగా మలుచుకొంది. హాంకాంగ్‌ రక్షణకు అమెరికా ఏకంగా ఒక ఆంక్షల బిల్లును కూడా తాజాగా సిద్ధం చేస్తోంది. మరోపక్క మైక్‌ పాంపియో కూడా ఇక హాంకాంగ్‌ను స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏమాత్రం స్వతంత్ర ప్రాంతం చూడదని పేర్కొన్నారు. 

* హాంకాంగ్‌ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తులకు టారీఫ్‌లు విధించకుండా ట్రంప్‌ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్‌ నుంచే ఎగుమతులు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆందోళనలు ఆ ఎగమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ మినహాయింపులు ఇక దక్కకపోవచ్చు. 
* చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షాంఘై, షెన్జన్‌ వంటి నగరాలను పశ్చిమ దేశ కంపెనీలను ఆకర్షించేలా చేయాలని భావిస్తోంది. కానీ, ఇది రాత్రికి రాత్రే జరగదు. అప్పటి వరకు ఆర్థిక సంక్షోభం ఆగదు. అందుకే బంగారు బాతు వంటి హాంకాంగ్‌ను దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తోంది. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని