‘పాక్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్నది ఇమ్రాన్‌ మాటే’
close
Published : 06/06/2020 09:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాక్‌లో ఉగ్రవాదులు ఉన్నారన్నది ఇమ్రాన్‌ మాటే’

ఐరాస నివేదికపై పాక్‌ బుకాయింపును తిప్పికొట్టిన భారత్‌

దిల్లీ: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందన్న ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్సీ) నివేదికలో కొత్తేమీ లేదని.. గతంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అంగీకరించిన విషయాన్నే అది పునరావృతం చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి అనురాగ్‌ శ్రీవాస్తవ గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఇప్పటికైనా తమ విధానాన్ని మార్చుకొని.. తమ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని సూచించారు.

గత నెల విడుదలైన ఓ నివేదికలో పాక్‌ ఉగ్రవాద కార్యకలాపాల్ని యూఎస్‌ఎస్సీ నివేదిక ఒకటి బట్టబయలు చేసింది. అఫ్గానిస్థాన్‌ గడ్డపై కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రమూకల్లో దాదాపు 6,500 మంది పాకిస్థాన్‌కు చెందినవారు ఉన్నారని నివేదిక కుండబద్దలు కొట్టింది. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా వంటి ఉగ్రసంస్థలు ముష్కరులను ఎగుమతిచేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయని తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన భారత్‌ పాక్‌ నిజస్వరూపాన్ని నివేదిక కుండబద్దలు కొట్టిందని వ్యాఖ్యానించింది. 

పాక్‌ విదేశాంగ శాఖ దీనిపై స్పందిస్తూ.. నివేదికలోని అంశాల్ని భారత్‌ వక్రీకరిస్తోందని బుకాయించే ప్రయత్నం చేసింది. దీనికి భారత్‌ దీటుగా బదులిచ్చింది. ‘‘గత ఏడాది ఓ సందర్భంలో 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు పాక్‌ గడ్డపై ఉన్నారన్న మీ ప్రధాని(ఇమ్రాన్‌ ఖాన్‌) మాటల్ని గుర్తుకుతెచ్చుకోండి. ఆయన అంగీకరించిన వాస్తవాన్నే నివేదిక ఉటంకించింది. నివేదికపై నిందారోపణలు చేయడానికి బదులు ఆత్మవిమర్శ చేసుకొని పాక్‌ గడ్డపై నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదానికి స్వస్తి పలకాలి’’ అంటూ అక్కడి విదేశాంగ శాఖకు చురకలంటించింది.

గత ఏడాది జులైలో అమెరికాలో ఓ సమావేశంలో ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తమ దేశంలో ఇప్పటికీ 30 వేల నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు అంగీకరించారు. వీరంతా అఫ్గాన్ లేదా కశ్మీర్‌లో దాడులు చేసేందుకు శిక్షణ పొందారని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడు పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ నిరాశావాదాన్ని ప్రదర్శించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని