గులాబీ రంగులోకి ‘లోనార్‌ సరస్సు’!
close
Published : 11/06/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గులాబీ రంగులోకి ‘లోనార్‌ సరస్సు’!

ఆశ్చర్యానికి గురిచేస్తున్న 50వేల ఏళ్ల పురాతన సరస్సు
జీవ వైవిధ్యమే కారణమంటోన్న నిపుణులు!

ఔరంగాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోన్న ప్రాచీన లోనార్‌ సరస్సు రంగు ఒక్కసారిగా మారిపోయింది. సాధారణంగా పచ్చని రంగులో ఉండే ఈ సరస్సు తాజాగా గులాబీ రంగులోకి మారడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే సరస్సులోని లవణీయత, ఆల్గే కారణం వల్లే ఇది గులాబీ రంగులోకి మారినట్లు నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలో ఉన్న ఈ సరస్సు దాదాపు 1.2 కి.మీ వ్యాసార్థంతో ఉంటుంది. ముంబయి నుంచి దాదాపు 500కి.మీ దూరంలో ఉన్న ఈ సరస్సు, దాదాపు 50వేల సంవత్సరాల క్రితం ఉల్కాపాతం వల్ల ఈ బిలం ఏర్పడిందిగా ఇప్పటికే గుర్తించారు. దీనికున్న ప్రాచీన నేపథ్యం దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇక్కడకు వస్తుంటారు. అయితే, ఈ సరస్సు తాజాగా రాత్రికి రాత్రే రంగు మారి కనిపించడం అటు శాస్త్రవేత్తలతోపాటు ప్రకృతి ఔత్సాహికులను ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

లోనార్‌ బిలానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇప్పటికే దీన్ని జాతీయ భౌగోళిక వారసత్వంగా గుర్తించినట్లు ఈ సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు గజానన్‌ ఖారత్‌ వెల్లడించారు. అయితే, లోనార్‌ సరస్సు ఇలా రంగుమారడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేశారు. అయితే ఈసారి మాత్రం మరింత తేజంగా గులాబీ రంగులో మెరుస్తుండటం మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోందని గజానన్‌ ఖారత్‌ పేర్కొన్నారు. ఇలాగే, ఇరాన్‌లో ఓ సరస్సులో కూడా లవణీయత పెరుగుదల కారణంగా సరస్సు ఎరుపు రంగులో మారిన విషయాన్ని ఖారత్‌ గుర్తుచేశారు.

‘గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం సరస్సులో నీరు తగ్గిపోయింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సరైన వర్షం లేనికారణంగా కొత్త నీరు కూడా చేరలేదు. ఇలా కనిష్ట నీటి స్థాయి ఉండటం కూడా లవణీయత పెరగడంతోపాటు ఆల్గేలో మార్పుకు కారణం. ఇదే సరస్సు రంగు మారడానికి కారణమై ఉండవచ్చు’ అని సరస్సు సంరక్షణాభివృద్ధి సభ్యులు ఖారత్‌ అభిప్రాయపడ్డారు.

లోనార్‌ సరస్సు రంగు మారడంలో మానవ ప్రమేయం లేదని సరస్సును పరిశీలించిన  భూగోళశాస్త్ర నిపుణులు డాక్టర్‌ మదన్‌ సూర్యవంశి కూడా స్పష్టం చేశారు. అయితే, సాధారణంగా నీటిలో ఉండే శిలీంద్రాల వల్ల నీరు ఆకుపచ్చ రంగులోకి మాత్రమే మారుతుందని అన్నారు. ఇలా గులాబీ రంగులోకి మారడం లోనార్‌ బిలంలోని జీవవైవిధ్యం వల్లే జరగవచ్చని మదన్‌ సూర్యవంశి అభిప్రాయపడ్డారు. తాజాగా సరస్సు రంగు మారడంపై అధికారులు, శాస్త్రవేత్తలు మరింత పరిశోధనకు సన్నద్ధమయ్యారు.

 

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని