దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం ప్రారంభం
close
Published : 05/07/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స కేంద్రం ప్రారంభం

పది రోజుల్లోనే అందుబాటులోకి..

దిల్లీ: పది వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌-19 చికిత్స కేంద్రాన్ని దక్షిణ దిల్లీలో అందుబాటులోకి తెచ్చారు. చ్చతర్‌పుర్‌ పట్టణ కేంద్రంలోని రాధా సోమి సత్సంగ్‌ బియాస్‌ క్యాంపస్‌లో ఆసుపత్రిని సిద్ధం చేశారు. సర్దార్ పటేల్ కొవిడ్ కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ (ఎస్‌పీసీసీసీహెచ్‌)గా నామకరణం చేసిన ఈ ఆసుపత్రిని దిల్లీ లెఫ్టెనెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. కేంద్ర హోం శాఖ సహకారంతో దక్షిణ దిల్లీ జిల్లా యంత్రాంగం దీనిని కేవలం పది రోజుల్లోనే సిద్ధం చేయడం విశేషం. లక్షణాలు లేని, తేలికపాటి లక్షణాలు గల రోగులకు ఐసోలేషన్ కేంద్రంగా ఆసుపత్రి పనిచేయనుంది. రోగుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, వారికి మానసిక స్థైర్యాన్ని అందించేందుకు ఆసుపత్రి ఉపయోగపడనుంది. కేంద్రాన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ, మదన్ మోహన్ మాలవ్యా ఆసుపత్రులతో అనుసంధానించారు. ఆసుపత్రిలోని వార్డులకు జూన్ 15న గల్వాన్ వ్యాలీలో చైనాతో ఘర్షణలో మరణించిన భారత సైనికుల పేర్లు పెట్టాలని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) నిర్ణయించింది.
ఇవీ ఆసుపత్రి విశేషాలు: 
* 1,700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పుతో ఆసుపత్రిని సిద్ధం చేశారు. కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంతో ఉంటుంది. ప్రతి గదిలో 50 పడకలతో కేంద్రంలో మొత్తం 200 గదులు ఉన్నాయి. 
* ప్రస్తుతం రెండు వేల పడకల్లో ఉన్న పేషెంట్లకు చికిత్స అందించేందుకు 170 మంది వైద్యులు, 700 మంది నర్సులు అందుబాటులో ఉన్నారు.

* రాధా సోమి బియాస్‌ వాలంటీర్లు కూడా ఈ కేంద్రం నిర్వహణకు సహకరించనున్నారు.
* పది శాతం పడకల వద్ద ఆక్సీజన్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడే రోగులకు ఈ ఆక్సీజన్‌ను ఉపయోగించనున్నారు. 
* రోగులు వారి వెంట ల్యాప్‌ట్యాప్‌ తెచ్చుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ప్రతి పడక వద్ద ల్యాప్‌ట్యాప్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. 
* రోగులు స్వాంతన పొందేందుకు ఆసుపత్రిలో లైబ్రరీ, పలు ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. 
* ఆసుపత్రిలో 600ల మరుగుదొడ్లు ఉన్నాయి. 

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని