భద్రతపై పూనావాలాకు భరోసా ఇవ్వండి
close
Updated : 02/06/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భద్రతపై పూనావాలాకు భరోసా ఇవ్వండి

అవసరమైతే ఆయనతో హోంమంత్రి వ్యక్తిగతంగా మాట్లాడాలి
 మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు ఆదేశం

ముంబయి: కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) అదర్‌ పూనావాలాకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది. భద్రతకు సంబంధించి ఆయనకు ఉన్న ఆందోళనలన్నింటినీ తొలగించాలని సూచించింది. అవసరమైతే రాష్ట్ర హోం మంత్రి ఆయనతో స్వయంగా మాట్లాడాలని అభిప్రాయపడింది. పూనావాలాకు జడ్‌-ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.శిందె, జస్టిస్‌ అభయ్‌ అహూజాలతో కూడిన సెలవుకాలీన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది.

కొవిషీల్డ్‌ డోసుల కేటాయింపుపై ఎస్‌ఐఐ సీఈవోకు పలువురు రాజకీయ నేతలు, ఇతరుల నుంచి తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు ఎదురవుతున్నాయని పిటిషనర్‌ పేర్కొన్నారు. అందుకే ఆయన ప్రస్తుతం భారత్‌ను వీడి లండన్‌లో ఉంటున్నారని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కరోనా టీకాల ఉత్పత్తి ద్వారా దేశానికి పూనావాలా గొప్ప సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో ఆయనకు భద్రతపై ప్రభుత్వం పూర్తి భరోసా కల్పించాలని ఆదేశించింది. అవసరమైతే రాష్ట్ర హోం మంత్రి లేదా ఇతర ఉన్నతాధికారులు పూనావాలాతో వ్యక్తిగతంగా మాట్లాడాలని సూచించింది. ఆయనకు ఇప్పటికే వై కేటగిరీ భద్రత ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది గుర్తుచేశారు. జడ్‌-ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ఆయనకు కల్పించే భద్రత విషయంపై తమకు ఈ నెల 10న పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. టీకా డోసులను తమకే ముందుగా ఇవ్వాలంటూ శక్తిమంతమైన వ్యక్తుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని పూనావాలా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి గమనార్హం. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని