Covid: భూ వినియోగ తీరును బట్టి కరోనా హాట్‌ స్పాట్లు!
close
Updated : 03/06/2021 07:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid: భూ వినియోగ తీరును బట్టి కరోనా హాట్‌ స్పాట్లు!

మానవాళి, జీవజాతుల ఆరోగ్యానికి పర్యావరణమే ఆధారం  
తాజా పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా భూ వినియోగ తీరును బట్టే కరోనా హాట్‌ స్పాట్లు ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. అడవులను నరికి సాగుచేసే చోట్ల, అక్కడ ఇళ్లు నిర్మించుకున్న ప్రదేశాల్లో, పశువులను పెంచే ప్రాంతాల్లో గబ్బిలాలు ఎక్కువగా తిరుగుతుంటాయని... ఆయా చోట్ల వాటి నుంచి మనుషులకు కరోనా సంక్రమించే ముప్పు అధికమని విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మిలాన్‌, మస్సే యూనివర్సిటీ ఆఫ్‌ న్యూజిలాండ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన సాగించారు. కొవిడ్‌-19కు కారణమైన ‘సార్స్‌-కొవ్‌-2’గా పిలిచే కరోనా వైరస్‌ ఎక్కడ పుట్టిందన్నది ఇంతవరకూ స్పష్టం కాకపోయినా, అది కచ్చితంగా గబ్బిలాల నుంచే సంక్రమించిందని చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘‘హార్స్‌షూ రకం గబ్బిలాల్లో పలురకాల కరోనా వైరస్‌లు ఉంటాయి. ఇవి నేరుగా మనిషికి సోకడం, లేదంటే ముందుగా అలుగులకు సోకి, వాటి నుంచి మనుషులకు సంక్రమించడం సహజం. ఇదంతా అడవులు, పశు పెంపకం, జంతు మాంస విక్రయాలు జరిగే ప్రాంతాల్లోనే చోటుచేసుకుంటుంది. పశ్చిమ ఐరోపా నుంచి ఆగ్నేయ ఆసియా వరకూ హార్స్‌షూ గబ్బిలాల ఉనికి ఉన్న ప్రాంతాల్లో భూ వినియోగ తీరుపై అధ్యయనం చేపట్టాం. అడవులను నరికి ఇళ్లు కట్టుకున్న చోట్ల, వ్యవసాయ విస్తరణ ప్రాంతాల్లోనూ, పశు సంవర్ధక కేంద్రాలున్న చోట్ల గబ్బిలాల నుంచి మనిషికి వైరస్‌లు ఎక్కువగా సోకినట్టు తేలింది. భూ వినియోగ తీరు మారితే పర్యావరణంలోనూ మార్పులు సంతరించుకుంటాయి. తద్వారా ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి జునాటిక్‌ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదముంది’’ అని పరిశోధనకర్త పాలో దోడొరికో విశ్లేషించారు. పర్యావరణంపైనే మానవాళి, జంతువుల ఆరోగ్యం ముడిపడి ఉందన్నారు. జపాన్‌, ఫిలిప్పీన్స్‌, చైనా, థాయిలాండ్‌లోని కొన్ని ప్రాంతాలు... ప్రస్తుతం, భవిష్యత్తులో కరోనా వైరస్‌ల ‘హాట్‌ స్పాట్లు’గా కొనసాగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని