Covid Booster Dose: వద్దంటున్నా బూస్టర్‌ డోసులే ముద్దు...
close
Updated : 10/09/2021 15:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Booster Dose: వద్దంటున్నా బూస్టర్‌ డోసులే ముద్దు...

డబ్ల్యూహెచ్‌వో సూచనలు బేఖాతరు

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పేదలకు కనీసం ఒక్క కొవిడ్‌ టీకా డోసు కూడా అందలేదు. కానీ సంపన్న దేశాలు తమ జనాభాలో అత్యధికులకు ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసులూ వేసి మూడో (బూస్టర్‌) డోసుకు సిద్ధమవుతున్నాయి. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మళ్లీ తప్పుపట్టింది. ఈ ఏడాది చివరి వరకైనా బూస్టర్‌ డోసు ఊసు తలపెట్టవద్దని కోరింది. కొవిడ్‌ టీకాల ఉత్పత్తి, పంపిణీలను గుప్పిట్లో పెట్టుకున్న సంపన్న దేశాలూ, అక్కడి కంపెనీలు పేద దేశాల ప్రజలకు అడుగూబొడుగూ టీకాలను విదిలిస్తామంటే చూస్తూ ఊరుకోలేనని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్‌ అథనోం గురువారం పేర్కొన్నారు. బూస్టర్‌ డోసులపై సెప్టెంబరు ఆఖరు వరకైనా మారటోరియం విధించాలని గత నెలలో డబ్ల్యూహెచ్‌వో కోరింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదనీ, అందువల్ల ఈ ఏడాది చివరి వరకు బూస్టర్‌ డోసులపై మారటోరియం కొనసాగించాలని టెడ్రోస్‌ పిలుపునిచ్చారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న దీర్ఘ వ్యాధిగ్రస్తులకు, వృద్ధులకు బూస్టర్‌ డోసులు అవసరం కావచ్చు కానీ, ఆరోగ్యవంతులకూ మూడో డోసు ఇవ్వడం అనవసరమని ఆయన అన్నారు. అయితే, మారటోరియం పొడిగింపునకు అమెరికా సుముఖంగా లేదు. బూస్టర్‌ డోసుల ఆవశ్యకతపై పరిశీలన ముమ్మరం చేసింది.

మరోవైపు బ్రిటన్‌.. ఆస్టాజ్రెనెకా (కొవిషీల్డ్‌), ఫైజర్‌ బూస్టర్‌ డోసులకు లాంఛనంగా అనుమతి ఇచ్చినా, వాటి వినియోగంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రోగ నిరోధక శక్తి బలహీనపడినవారికి బూస్టర్‌ డోసు ఇవ్వాలని బ్రిటిష్‌ ఔషధ నియంత్రణ సంస్థ సూచిస్తోంది. బ్రిటిష్‌ జనాభాలో 12 ఏళ్లు పైబడినవారిలో 5 లక్షలమంది ఈ కోవలోకి వస్తారు. బూస్టర్‌ డోసుల విషయంలో తొందరపాటు తగదని ఆస్ట్రాజెనెకా హెచ్చరిస్తోంది. అసలు మూడో డోసు అవసరమా కాదా అనేది ఇంకా తేలలేదని పేర్కొంది. చివరకు 70 ఏళ్లుపైబడినవారికీ, వైద్యులు, వైద్య సహాయక సిబ్బందికీ బూస్టర్‌ డోసు ఇచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే ఫైజర్‌ బూస్టర్‌ డోసు రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచిందని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఆ దేశంలోని 92 లక్షల జనాభాలో 20 లక్షలమందికి ఇప్పటికే ఫైజర్‌ బూస్టర్‌ డోసు ఇచ్చారు. వారిలో 50 ఏళ్లు పైబడినవారే ఎక్కువ. బూస్టర్‌ డోసు ఎంతకాలం రోగనిరోధక శక్తిని పెంచుతుందో ఇంకా తేలాల్సి ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని