ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అల్ప సంఖ్యాకులకు సంకటం
close
Published : 24/09/2021 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అల్ప సంఖ్యాకులకు సంకటం

ఐరాస ఉన్నత స్థాయి సమావేశంలో భారత ప్రతినిధి

ఐరాస: హింసాత్మక అతివాదం, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం సమాజాల మధ్య సామరస్యాన్ని దెబ్బతీయడంతో పాటు అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు మరింతగా వివక్షకు గురయ్యేలా చేస్తోందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సమర్ధించరాదని స్పష్టం చేసింది. డర్బన్‌ డిక్లరేషన్‌, కార్యాచరణ కార్యక్రమాన్ని ఆమోదించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా బుధవారం ఐరాస సర్వప్రతినిధి సభ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో యూఎన్‌వోలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి ప్రసంగించారు. విద్వేషాలను, వివక్షపూరిత భావనలను రేకెత్తించి వ్యాపింపజేయడంలో నూతన మీడియా రూపాలు ఉపకరణాలు మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరాదని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి తిరుమూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికే ఉన్న అసమానతలను కొవిడ్‌ మరింత తీవ్రతరం చేసిందన్నారు.

ఐరాసలో సంస్కరణలకు జీ4 దేశాల డిమాండ్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాల జాబితాను విస్తరించాలని భారత్‌, జర్మనీ, బ్రెజిల్‌, జపాన్‌లతో కూడిన జీ4 దేశాలు పునరుద్ఘాటించాయి. తద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ఎదురువుతున్న పలు సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా ఐరాస సంస్థను సన్నద్ధం చేయవచ్చని పేర్కొన్నాయి. ఐరాస సర్వప్రతినిధి సభ 76వ సమావేశాల నేపథ్యంలో జీ4 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు ఎస్‌.జైశంకర్‌ (భారత్‌), కార్లోస్‌ ఆల్బర్టో ఫ్రాన్కో ఫ్రాన్స్‌(బ్రెజిల్‌), హీకో మాస్‌(జర్మనీ), మొతెగి తోషిమిత్సు(జపాన్‌) బుధవారం న్యూయార్క్‌లో సమావేశ మయ్యారు. ఐరాస భద్రతా మండలిని తక్షణమే సంస్కరించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ సాధన కోసం పరస్పరం సహకరించుకోవాలని, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని జీ4 దేశాల నేతలు నిర్ణయించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని