గ్రామీణ భారతానికి పునర్‌వైభవం
close
Published : 26/09/2021 05:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామీణ భారతానికి పునర్‌వైభవం

 విద్య, వైద్యంపై దృష్టి సారించాలి

 ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: ‘‘చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ రంగాలు అన్నింటిలో భారతీయ విధానాలను అలవర్చుకోవాలి. న్యాయవ్యవస్థకు భారతీయతను అద్దాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఇటీవల చెప్పడం అభినందనీయం’’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దిల్లీ విశ్వవిద్యాలయ వైద్యకళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా శనివారమిక్కడి విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘గ్రామీణ భారతానికి పునర్‌ వైభవం కల్పించేందుకు పల్లెల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాలి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి స్థానిక సంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగం పూర్తి సహకారం అందించాలి. ఖరీదైపోతున్న వైద్యాన్ని భరించలేని స్థితిలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకొచ్చింది. కరోనా టీకాపై మొదట్లో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరిగినా ప్రభుత్వాలు, వైద్యులు కల్పించిన చైతన్యంతో ప్రజలు నిర్భయంగా టీకాలు తీసుకుంటున్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వైద్య సిబ్బందితోపాటు ప్రసార మాధ్యమాలు కీలకపాత్ర పోషించాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తొలి వరుసలో నిలిచిన వైద్యులు, వైద్య సిబ్బంది పాత్రను సమాజం ఎప్పటికీ మరవదు. దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్‌ కళాశాల, అనుబంధ ఆసుపత్రి ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రంలో సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటుచేయాలి. వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత బాధ్యతల నిర్వహణలో వివక్ష చూపకూడదు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ చూపాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్లీ విశ్వవిద్యాలయం ఉపకులపతి పీసీ జోషీ, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని