అడవిగాచిన సాయం
close
Updated : 05/07/2021 05:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడవిగాచిన సాయం

రెవెన్యూ సిబ్బంది అండతో ఆక్రమిత భూములకు పాసు పుస్తకాల జారీ

సాగులో లేని వేలాది ఎకరాలకు ఏటా సొమ్ములు

ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అక్రమాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి

అటవీ భూముల్లో సాగుపేరుతో రైతుబంధు నిధులు దుర్వినియోగమవుతున్నాయి. రాష్ట్రంలో అటవీ ప్రాంతాలున్న జిల్లాల్లో పెద్దఎత్తున అడవులను అక్రమించారు. కొత్త పాసుపుస్తకాల పంపిణీని ఆసరాగా చేసుకుని లక్షలాది పుస్తకాలను దొడ్డిదారిన పొందారు. వాటితో ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తున్న సాయాన్ని అక్రమార్కులు దిగమింగుతున్నారు. ఇలా ఏడాదికి దాదాపు రూ.వందల కోట్ల దోపిడీ సాగుతోంది. కుమురం భీం ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీభూమి అన్యాక్రాంతం అయింది. కొన్నిచోట్ల గిరిజనుల పేరుతో కొందరు వేలాది ఎకరాల అటవీ భూమికి యాజమాన్య హక్కులు పొందారు. పోడు భూములకు హక్కులు కల్పించాలని గిరిజనులు ఒకవైపు పోరాటం చేస్తుండగా మరోవైపు అటవీ ప్రాంతంలో ఇష్టారీతిన ఆక్రమణలు, పాసుపుస్తకాలు పొందుతున్న దందా కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పలు జిల్లాల్లో చోటుచేసుకున్న అక్రమాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

ఆ రెండు జిల్లాల్లోనే 47 వేల ఎకరాలకు పైగా..

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో గత వానాకాలంలో 3.97 లక్షల ఎకరాల విస్తీర్ణానికి రైతుబంధు మంజూరైంది. ఈ జిల్లాలో గతేడాది సెప్టెంబరు వరకు డిజిటల్‌ సంతకాలు పూర్తయిన విస్తీర్ణం 3.54 లక్షల ఎకరాలే. ఇలా చూస్తే అదనంగా 43 వేల ఎకరాలకు రైతుబంధు అందినట్లు అర్థమవుతోంది. వాస్తవ సాగు విస్తీర్ణం, పాసుపుస్తకాల్లో ఉన్న విస్తీర్ణానికి పొంతన లేకుండా ఉంది. ఈ జిల్లాలో పోడుపేరుతో కొందరు ఇష్టారీతిన లక్ష ఎకరాల వరకు కొట్టేశారు. కొన్ని మండలాల్లో ఈ భూములకూ పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దాదాపు 4 వేల ఎకరాలకుపైగా అటవీ భూములకు పట్టాలు జారీ అయ్యాయి. మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామం సర్వే నంబరు 108లో 1500 ఎకరాల సాగు భూమి ఉండగా.. మూడు వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అయితే, అనర్హులకు ఇచ్చారని ఆందోళనలు జరగడంతో అధికారులు 1500 ఎకరాలకు పట్టాలను తొలగించారు. క్షేత్రస్థాయి సర్వే చేయకుండానే అర్హుల పాసుపుస్తకాలు తొలగించడం ఇక్కడ ఆందోళనకు దారితీస్తోంది. గండికామారంలో సర్వే నంబరు 132లో సాగుభూమి 156 ఎకరాలు ఉండగా 250 ఎకరాలకు పట్టాలు జారీ అయ్యాయి. భూపాలపల్లి మండలంలో 500 ఎకరాలకు సంబంధించి అటవీ భూములకు బై నంబర్లు వేసి పట్టాలు జారీ చేశారు.

అటవీ ప్రాంతానికి పట్టాలు

ప్రభుత్వం నిర్వహించిన కొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొందరు రెవెన్యూ సిబ్బంది, దళారులు సొమ్ముచేసుకున్నారు. అటవీ భూములు కొట్టేసిన వారికి దొడ్డిదారిన పట్టాలు మంజూరు చేశారు. సర్వే నంబర్లకు పక్కన బై నంబర్లు (ఉప సంఖ్య) వేసి కొత్త పాసుపుస్తకాలు జారీ చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఎకరా అటవీ భూమికి పట్టా చేసేందుకు రూ.పదివేల నుంచి రూ.30 వేల వరకు దండుకున్నట్లు సమాచారం. భద్రాద్రి జిల్లాలోనూ పలు మండలాల్లో రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారు.

* జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అటవీహక్కుల చట్టం కింద ఉన్న భూమి స్వల్పం కాగా  చెట్లు నరికివేసి ఆక్రమించిన భూమి వేలాది ఎకరాల్లో ఉంది.

* ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో 30 ఎకరాలకు అక్రమంగా పట్టా చేశారు. పలు మండలాల్లో అటవీ భూములకు పట్టాలు జారీచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

* ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఎల్కపల్లి పరిధిలో సర్వే నంబరు 61లో 30 హెక్టార్ల అడవి ఉంది. దీనికీ పట్టాలు జారీచేశారు. 120 సర్వే నంబరులో ఉన్న సాగు భూమి క్షేత్రస్థాయిలో ఎక్కడుందో తెలియదు. రైతులు అటవీ భూమిలోనే సాగుచేస్తున్నారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బెజ్జూరు మండలం తలాయి, పాపన్నపేట మండలాల్లో కొందరికి 130 ఎకరాలకు కొత్త పట్టాలు మంజూరు చేసి ఇచ్చారు. ఈ జిల్లాలో 3,745 ఎకరాలకు సంబంధించి అటవీ, రెవెన్యూశాఖల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి.

సర్వే చేస్తే వెలుగులోకి మరిన్ని అక్రమాలు

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న సరిహద్దు భూముల సర్వే చేస్తే మరిన్ని ఆక్రమణలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,18,980 ఎకరాలకు సంబంధించి రెండు శాఖల మధ్య వివాదం ఉందని 2017లో గుర్తించారు. దీన్ని గుర్తించి ఏ భూమి ఎవరిదో తేల్చేందుకు 2019లో రెవెన్యూ, అటవీ, భూమి కొలతలు-భూ దస్త్రాల నిర్వహణ శాఖలతో కలిపి సంయుక్త సర్వేకు బృందాలను నియమించారు. అయినప్పటికీ కొంత మేరకు మాత్రమే సర్వే చేశారు. రాష్ట్రంలో మూడు లక్షల హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణకు గురైందని అటవీశాఖ చెబుతోంది. ఈ శాఖ వద్ద ఉండే జీఐఎస్‌ (ఉపగ్రహ ఛాయా చిత్రం) పటాల సాయంతో అటవీ హద్దులు నిర్ణయించి ఆక్రమణకు గురైన చోట కందకాలు తవ్వుతున్నారు. ఈ సందర్భంగా హద్దుల గుర్తింపు సరిగా ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు ఆక్రమణకు గురైన అటవీ భూభాగంలో ఆసిఫాబాద్‌ జిల్లాలో 4860 హెక్టార్లు, భద్రాద్రి జిల్లాలో 28,454 హెక్టార్లు, మహబూబాబాద్‌ జిల్లాలో 10 వేల హెక్టార్లు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ప్రభుత్వం గత నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అక్రమంగా అటవీ భూములకు జారీ చేసిన పట్టాలు ఈ సర్వేలో తప్పకుండా బయటపడుతాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని