కేసీఆర్‌ చేతిలో బందీగా తెలంగాణ
close
Updated : 07/07/2021 05:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌ చేతిలో బందీగా తెలంగాణ

తెరాస నుంచి విముక్తి కోరుతున్నారు

స్వేచ్ఛ, సామాజిక న్యాయమే లక్ష్యం

నిరుద్యోగ సమస్యపైనే తొలిపోరాటం

రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయం కాదు

టీపీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, విద్యార్థుల బలిదానాల ఆశయాలు.. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా నెరవేరలేదని పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని.. ఒకప్పటి బిహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సామాన్యులు ప్రగతిభవన్‌ గేటు దగ్గరికి కూడా వెళ్లలేని పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తెరాస పాలన నుంచి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీలో అందరి అభిప్రాయాలను తీసుకుంటూ సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తామన్నారు. క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయంపాలన లక్ష్యంగా కాంగ్రెస్‌ ముందుకు సాగుతుందన్నారు. బుధవారం పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ముఖాముఖిలో ముఖ్యాంశాలు..

పీసీసీ అధ్యక్షుడిగా మీ లక్ష్యం ఏమిటి?

తెలంగాణ సాధన కోసం 1,200 మంది విద్యార్థులు ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ల ఆశయాలు నెరవేరలేదు. ఇప్పుడున్నది ప్రజా తెలంగాణ కాదు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పుకోడానికి అవకాశం లేదు. ఏఐసీసీ అధ్యక్షురాలు ఏ సదుద్దేశంతో రాష్ట్రాన్ని ఇచ్చారో ఆ ఆకాంక్షలు నెరవేర్చడం మా పార్టీ లక్ష్యం. అద్భుతమైన అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి నిబద్ధతతో పని చేస్తాం. ప్రజలు ఆ అవకాశం ఇస్తారని భావిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఎప్పుడైనా ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతాం. బస్సుయాత్రా, పాదయాత్రా అని కాదు సమష్టిగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తాం.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు?

నాయకుల్లో గందరగోళం, కార్యకర్తల్లో భయం ఉన్నాయి. పార్టీ మారినవాళ్లు ఆస్తులు, పదవులు సంపాదించుకుంటున్నారని.. తాము పార్టీలో ఉండి నష్టపోతున్నామేమో అని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అక్రమ కేసులు, దాడులతో లొంగదీసుకునే ప్రయత్నాల వల్ల కార్యకర్తలు భయపడుతున్నారు. వీటన్నిటిపై దృష్టి సారించి నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తాం.

పార్టీలో అంతర్గత విభేదాలపై మీ  అభిప్రాయం?

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు టీకప్పులో తుపానే. అన్నీ సర్దుకుంటాయి. పీసీసీపై నిర్ణయం రాకముందు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. నిర్ణయం జరిగాక 95 శాతం మంది ఏఐసీసీ అధ్యక్షురాలి నిర్ణయాన్ని గౌరవించారు. ఒకరిద్దరు మాట్లాడినా సర్దుకుంది. అందరం కలసికట్టుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం.

వరుస ఓటములతో నిస్తేజంతో ఉన్న పార్టీ శ్రేణులను ఎలా ముందుకు తీసుకెళ్తారు?

అందరినీ ఉత్తేజపరిచి సమస్యలపై పోరాటానికి సిద్ధంచేస్తాం. సమూలమైన మార్పులు తెచ్చి పార్టీని ముందుకు నడిపిస్తాం. తెలంగాణ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీయే తెలంగాణ తల్లి, ప్రతి ఇంట్లో ఆమె ఫొటో పెట్టుకోవాలి. ప్రజలకు కాంగ్రెస్‌ ద్వారానే మేలు జరుగుతుంది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన ఈ మూడు అంశాల ప్రాతిపదికన ప్రజల దగ్గరకు వెళ్తాం. సమష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తాం.

రాష్ట్రంలో ప్రస్తుతం మీరు గుర్తించిన ప్రధాన సమస్యలేమిటి?

ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లు ఇతర ప్రాంతాల వారు తరలించుకుపోతున్నారు. నిధులను సీఎం కేసీఆర్‌ కుటుంబం కొల్లగొడుతోంది. నియామకాలూ వాళ్ల చేతిలోనే ఉన్నాయి. తెలంగాణ కేసీఆర్‌ చేతిలో బందీ అయింది. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి నమూనా, సంక్షేమం ప్రజల్ని సంతోషపెట్టవు. వారు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలు నిధులు, రాజకీయ పదవుల్లో న్యాయబద్ధమైన వాటా కోరుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీలు కూడా జనాభా ప్రాతిపదికన అవకాశాలను కోరుకుంటున్నారు. ప్రజలు సంక్షేమ పథకాల కోసం గులాములుగా మారరు. 

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయం మేమే అని భాజపా అంటోంది?

భాజపా నినాదాల పార్టీ. కేంద్ర నిధులు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు. ఏం నిదులు తెచ్చారో బయటపెట్టాలి. సీఎం కేసీఆర్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఏమైంది? భాజపా నేతలు కేంద్రం నుంచి చిల్లి గవ్వ తీసుకురాలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఐదు పైసలైనా తీసుకువచ్చారా? రాష్ట్రంలో భాజపా ప్రత్యామ్నాయం కాదు. నాగార్జునసాగర్‌లో ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా రాలేదు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల వారికి అనుకోని ఫలితాలు వచ్చాయి అంతే.

క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్యపై మీ అభిప్రాయం

2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉన్నపుడు తయారైన కాంగ్రెస్‌ నాయకులు చాలామంది వివిధ కారణాలతో పార్టీ మారారు. ప్రస్తుతం నాయకులు కావడానికి చాలామందికి అవకాశం ఉంది. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు, నాయకులు కావాలనుకుంటున్నవాళ్లు ప్రజల తరఫున సమస్యలపై కొట్లాడితే నాయకులుగా గుర్తింపు వస్తుంది. కాంగ్రెస్‌ ఆ బాధ్యత తీసుకుంటుంది. 

రాష్ట్రంలో పాలన ఎలా ఉంది?

రాష్ట్రంలో పరిపాలనే లేదు. ఒకప్పటి బిహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఏ వ్యాపారైనా కప్పం కట్టాల్సిందే. ఇసుక దోపిడీ, భూముల ఆక్రమణలు, చెరువుల కబ్జాల్లో తెరాస నేతలు మునిగితేలుతున్నారు. లంచాల్లేకుండా పోస్టింగ్‌లు ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ ఉద్యోగులు, పోలీసులు, మండల ఉద్యోగులు భయం భయంగా బతుకుతున్నారు. ముఖ్యమంత్రి మంత్రులను కూడా కలవరు. ప్రజల సంగతి దేవుడెరుగు. సీఎం ఎన్నికల ప్రచారానికి వచ్చి పోతారు తప్ప ప్రజల దగ్గరకు వచ్చిందెక్కడ? ప్రజాదర్బార్‌లు లేవు. ప్రగతిభవన్‌ గేట్లు కార్పొరేట్‌ సంస్థలు, కాంట్రాక్టర్లకే తప్ప పేదవాళ్లకు తెరుచుకోవడంలేదు. ఇది దుర్మార్గమైన రాజరిక పాలన. ఇలాంటి నియంతృత్వ పోకడలు ఎక్కువ కాలం సాగవు. జలవివాదాన్ని రావణ కాష్ఠంలా రగిలించారు. దీనిపై రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని ఎందుకు చర్చించి పరిష్కరించుకోవడంలేదు?

పీసీసీ అధ్యక్షుడిగా మీ తక్షణ కార్యాచరణ ఏమిటి?

తెలంగాణ మొదటి శాసనసభలో ప్రభుత్వం 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా బిశ్వాల్‌ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని వెల్లడించింది. అంటే తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వం నియమించిన ఉద్యోగాల కంటే రిటైర్‌ అయినవాళ్లే ఎక్కువ. సంవత్సరం లోపు నోటిఫికేషన్లు ఇచ్చేలా పోరాటం చేస్తాం. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. మొదటి ప్రాధాన్య అంశంగా నిరుద్యోగ సమస్యపై పోరాటం చేస్తాం. యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యుఐ, కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలతో పాటు పార్టీలోని కీలకమైన నాయకులతో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని