కేబుల్‌ తెగినా సేవలు  ఆగవు
close
Updated : 12/07/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేబుల్‌ తెగినా సేవలు  ఆగవు

నెట్‌వర్క్‌, డేటా సమస్యలకు త్వరలో పరిష్కారం

సర్వీస్‌ ప్రొవైడర్ల ఎంపికకు వచ్చే నెలలో ‘ఈవోఐ’

‘ఈనాడు’తో టీ-ఫైబర్‌ సీఈవో సుజయ్‌ కారంపూరి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ సిగ్నల్స్‌, బ్రాడ్‌బ్యాండ్‌ లేకపోవడంతో విద్యార్థుల ఆన్‌లైన్‌ చదువులకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంటి నుంచి పనిచేసే నిపుణులకు బృంద సభ్యులతో ప్రాజెక్టులపై మాట్లాడేందుకు, వివరాలు పంపించేందుకు అంతరాయం కలుగుతోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు, ఏజెన్సీ.. మారుమూల ఆవాసాల్లో బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ సదుపాయాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఫైబర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ‘టీ-ఫైబర్‌’ ప్రాజెక్టును అమలు చేస్తోంది.  ప్రాజెక్టు నివేదికకు ఆమోదం లభించిన రెండేళ్లలోనే భారత్‌నెట్‌లో భాగంగా ఇప్పటికే 2,243 గ్రామాలు పూర్తిస్థాయి డేటా మౌలిక సదుపాయాలతో టీఫైబర్‌తో అనుసంధానమయ్యాయి. వచ్చే మూడు నెలల్లో 3,850 గ్రామాల్లో తనిఖీ, విస్తరణ పనులు పూర్తవుతాయని.. ఆ వెంటనే టీ-ఫైబర్‌ సేవలను ప్రారంభిస్తామని ‘టీ-ఫైబర్‌’ సీఈవో సుజయ్‌ కారంపూరి తెలిపారు.  గ్రామాల్లో సేవలు అందించేందుకు వీలుగా సర్వీస్‌ ప్రొవైడర్లను ఎంపిక చేసేందుకు వచ్చే నెలలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్‌ (ఈవోఐ) ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో టీ-ఫైబర్‌ అమలు, లక్ష్యాలపై ‘ఈనాడు’తో ఆయన మాట్లాడారు.

భూగర్భ కేబుల్‌లో ఏమైనా అవాంతరాలు ఎదురైతే సేవలకు అంతరాయాన్ని ఎలా అధిగమిస్తారు?
భూగర్భంలో వేసిన కేబుల్‌తో గిగా, టెరా, పెటా, హెక్సా, జెటా బైట్స్‌ సామర్థ్యం కలిగిన బ్రాడ్‌బ్యాండ్‌ను అందించేలా చర్యలు చేపట్టాం. ఒకచోట కేబుల్‌ తెగిపోయినా సేవలు నిరంతరం కొనసాగేలా ‘రింగు’ పద్ధతిని అవలంబిస్తున్నాం. సేవల్లో అంతరాయానికి ఆస్కారం లేకుండా ప్రాజెక్టు అమలు చేస్తున్నాం. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ కేబుల్‌ పనులు జరుగుతున్నాయి. జిల్లాల కేబుల్‌ను రింగ్‌రోడ్డు చుట్టూ వేసిన కేబుల్‌తో అనుసంధానం చేస్తాం. ఈ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు నానక్‌రాంగూడలో 9వేల చ.అడుగుల విస్తీర్ణంలో నెట్‌వర్క్‌ ఆపరేటింగ్‌ సెంటర్‌ (ఎన్‌వోసీ) సిద్ధం చేశాం.
రాష్ట్రంలో టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ప్రగతి ఎలా ఉంది?
రాష్ట్రంలో రూ.3,600 కోట్లతో టీ-ఫైబర్‌ ప్రాజెక్టు చేపట్టాం. జిల్లాలను మూడు ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టులు అప్పగించాం. ఇప్పటికే 11,736 కి.మీ. కేబుల్‌ నిర్మాణం పూర్తయింది. లక్ష్యంలో ఇది 64 శాతం. భద్రత, రక్షణ చర్యలు పూర్తయిన 2,243 గ్రామాలు టీఫైబర్‌తో అనుసంధానమయ్యాయి. భారత్‌నెట్‌ నిబంధనల ప్రకారం సాధించిన ప్రగతి మేరకు నిధులు విడుదలవుతాయి. తొలుత 10 శాతం, ఆ తరువాత 30 శాతం, 50 శాతం పనులు పూర్తయ్యాక మిగతావి ఇస్తారు. తొలి విడత నిధులు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ, స్టెరిలైట్‌, టీసీఐఎల్‌ సంస్థలు చేపడుతున్నాయి. ప్రస్తుతం 3,500 మంది కార్మికులు ప్రతిరోజూ పనిచేస్తున్నారు.
టీ-ఫైబర్‌ పూర్తయితే భవిష్యత్తు ఉపయోగాలు, ఉపాధి ఎలా ఉంటాయి?
టీ-ఫైబర్‌తో గ్రామీణ ఆర్థిక రూపురేఖలు మారుతాయి. ఇంటింటికీ 20 ఎంబీపీఎస్‌, విద్యాలయాలకు ఒక జీబీపీఎస్‌ కనీస వేగం ఉండేలా బ్రాడ్‌బ్యాండ్‌ అందుబాటులోకి వస్తుంది. టెలి మెడిసిన్‌, ఆన్‌లైన్‌ చదువులు నిరంతరం కొనసాగుతాయి. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డేటా వినియోగ సామర్థ్యం పెరిగితే ఆ మేరకు టీ-ఫైబర్‌ సర్వర్లలో స్వల్ప మార్పులతో టెరా, హెక్సా, జెటా వరకు సేవలు అందుతాయి.


మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ అందక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు కదా..!
కరోనాతో ఆన్‌లైన్‌ తరగతులు, ఇంటి నుంచి పని మొదలైంది. కొన్నిచోట్ల మొబైల్‌ నెట్‌వర్క్‌ అందక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్యను అధిగమించడమే టీ-ఫైబర్‌ లక్ష్యం. టీ-ఫైబర్‌ డీపీఆర్‌ను 2019 సెప్టెంబరులో కేంద్రం ఆమోదించింది. రెండేళ్లలోనే లక్షిత ప్రగతి సాధించాం. ఈ ఏడాది జనవరిలో నెలకు 1,056 కి.మీ చొప్పున డక్ట్‌, కేబుల్‌ పని జరిగింది. వచ్చే మూడు నెలల్లోగా 3,850 గ్రామాల్లో భద్రత, రక్షణ పరీక్షలు పూర్తవుతాయి. అక్టోబరు నాటికి ఆయా గ్రామాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ప్రాజెక్టు పూర్తవుతుందని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు అమలైతే రాష్ట్రంలోని 30 వేల పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యాలయాలు, రైతు వేదికలు, పంచాయతీలు.. ఇలా అన్నీ టీ-ఫైబర్‌ పరిధిలోకి వస్తాయి.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని