ఆది నుంచీ వివాదమే!
close
Updated : 16/07/2021 05:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆది నుంచీ వివాదమే!

నిరసన స్వరాల గొంతు నులిమేసే రాజద్రోహ చట్టం

సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మరోమారు రాజద్రోహం నేరం చర్చలోకి వచ్చింది. ఇంతకూ ఏంటీ రాజద్రోహం? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఇందులో ఏముంది? హైకోర్టులు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసిన ఈ చట్టానికి సుప్రీంకోర్టే గతంలో మళ్ళీ ఎందుకని ప్రాణం పోసింది?


ప్రజల స్వేచ్ఛను నొక్కేయటానికి భారత శిక్షాస్మృతిలో చేర్చిన రాజకీయ సెక్షన్లలో ఈ రాజద్రోహం సెక్షన్‌ రారాజు.  

- మహాత్మాగాంధీ


అత్యంత అభ్యంతరకరమైంది. చెడ్డదైన దీన్ని మనం ఎంత త్వరగా వదలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు.

- జవహర్‌లాల్‌ నెహ్రూ


... ఇలా అన్నప్పటికీ, నెహ్రూ ప్రభుత్వం నుంచి నేటి మోదీ ప్రభుత్వం దాకా ఈ చట్టం అమలవుతూనే ఉంది. 1860లో బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్షాస్మృతిని ప్రవేశపెట్టిన్నాటి నుంచీ ఇది వివాదాస్పదమే! నాడు బాలగంగాధర్‌ తిలక్‌, మహాత్మాగాంధీలను కూడా ఈ చట్టం కింద జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 124-ఎ సెక్షన్‌ను సవాలు చేస్తునే ఉన్నారు. ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)కు ఇది ఆటంకం అనేది తాజా విమర్శ! రాజ్యాంగం కంటే ముందు వచ్చిన చట్టాన్ని కొనసాగించటమా... రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు (భావ ప్రకటన స్వేచ్ఛ) విషయంలో రాజీ పడటమా అనేది ఓ వాదన!


ఏమిటీ సెక్షన్‌ 124-ఎ?

భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్‌ ఈ రాజద్రోహం గురించి చెబుతుంది. మాటల ద్వారాగానీ, రాతల ద్వారాగానీ, సంకేతాల ద్వారాగానీ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా... ఎవరైనా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై అసంతృప్తిని పోగు చేసినా, రెచ్చగొట్టినా, ధిక్కరించినా, శత్రుత్వ భావన కల్గించినా లేక అందుకు ప్రయత్నించినా అది రాజద్రోహమే.
* రాజద్రోహం అనేది నాన్‌బెయిలబుల్‌ నేరం. దీనికి మూడేళ్ళ జైలు నుంచి జీవితఖైదు దాకా (జరిమానాతో/జరిమానా లేకుండా) శిక్ష విధించొచ్చు. ఈ చట్టం కింద ఆరోపణలతో కేసు దాఖలైనవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు. పాస్‌పోర్టు అప్పగించాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టులో హాజరవ్వాలి.


అందుకోసం వచ్చిందీ చట్టం..

1837లో థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే రాసిన భారత శిక్షాస్మృతి ముసాయిదాలోని సెక్షన్‌ 113లో ఈ రాజద్రోహాన్ని కూడా చేర్చారు. కానీ 1860లో దీన్ని ఆమోదించే సమయానికి ఈ సెక్షన్‌ను ఎందుకనో తొలగించారు. 1857లో సిపాయిల తిరుగుబాటు అనంతరం... ప్రజల్లో జాతీయోద్యమ, స్వాతంత్య్ర భావనలను తగ్గించటానికి, తిరుగుబాటు ధోరణులను అణచి వేయటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ రాజద్రోహం సెక్షన్‌ను భారత శిక్షాస్మృతిలో చేర్చింది. అప్పట్లో భారత చట్ట వ్యవహారాలు చూసే జేమ్స్‌ ఫిడ్జ్‌జేమ్స్‌ స్టీఫెన్‌ సూచన మేరకు 1870లో వీటిని సవరణ రూపంలో తీసుకొచ్చారు. ఆ తర్వాత మరికొన్ని సవరణలతో... స్వాతంత్య్రానంతరం కూడా ఆ చట్టం అలాగే కొనసాగుతోంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దీనికి సవరణ చేసి... రాజద్రోహాన్ని కాగ్నిజబుల్‌ నేరంగా (ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి, విచారణ చేసేలా) మార్చారు.


హైకోర్టు కొట్టేస్తే... సుప్రీం నిలబెట్టింది

1958లో రామ్‌నందన్‌ వర్సెస్‌ ప్రభుత్వం కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసింది. పేదరికాన్ని పట్టించుకోనందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, అప్పటి ప్రధాని నెహ్రూను రామ్‌నందన్‌ విమర్శించారు. అందుకుగాను ఆయనపై రాజద్రోహం కేసు పెట్టారు. ఈ కేసును కొట్టేస్తూ... అలహాబాద్‌ హైకోర్టు రాజద్రోహం సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని తీర్పిచ్చింది. కానీ... 1962లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో ఈ రాజద్రోహం మళ్ళీ ప్రాణం పోసుకుంది. కేదార్‌నాథ్‌ వర్సెస్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ రాజ్యాంగ బద్ధమేనని తేల్చింది. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల్ని రెచ్చగొట్టేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా వ్యవహరించారంటూ కేదార్‌నాథ్‌ అనే కమ్యూనిస్టు నాయకుడికి విధించిన శిక్షను సుప్రీంకోర్టు ఆనాడు సమర్థించింది. రాజద్రోహం సెక్షన్‌ దుర్వినియోగం కాకుండా సూచనలూ చేసింది. ప్రజల్లో హింసను ప్రేరేపించేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా పనులు, మాటలుంటే అది రాజద్రోహం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు ఆనాడు తీర్పిచ్చింది. ప్రజల్ని హింసకు ప్రేరేపించనంతవరకు... ఎవరైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చని, ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ... ఇటీవల ప్రభుత్వ విమర్శకులపై రాజద్రోహం కేసులు ఎక్కువవుతుండటంతో... ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టే... ఆ చట్టం అమలుపై ప్రశ్నలు సంధించింది!


- ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని