‘మగ’పుటేనుగులు
close
Updated : 15/09/2021 06:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘మగ’పుటేనుగులు

మత్తులో చిన్నారులను చిదిమేస్తున్న ఉన్మాదులు
ప్రతి 3 గంటలకో లైంగిక దాడి
రోజుకు ఎనిమిదికి పైగా నమోదు  
రాష్ట్రంలో పెరుగుతున్న పోక్సో కేసులు
ఈనాడు, హైదరాబాద్‌

కళ్లకు కామపు పొరలు... ఉచ్ఛనీచాలు లేవు... చిన్నాపెద్దా తేడా లేదు.... వావీవరసా ఊసే ఉండదు... మనిషి మృగమవుతున్నాడు. ఉన్మాదిగా మారి  లైంగిక దాడులకు తెగబడుతున్నాడు. అభం శుభం తెలియని పసిపిల్లలనూ కిరాతకంగా చిదిమేస్తున్నాడు. ప్రతి మూడు గంటలకో అత్యాచారం. రోజుకు ఎనిమిదికి పైగా కేసులు... ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో వెెలుగు చూసిన ఆరేళ్ల చిన్నారి ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన అన్ని ఉదంతాల్లో గంజాయి, మద్యం, మాదకద్రవ్యాలు వినియోగించిన తర్వాతే కొందరు ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు వెల్లడైంది.

రాష్ట్రంలో చిన్నారులపై లైంగికదాడుల కేసులు ఏటికేడూ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఈ బెడద మరింత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, స్నేహితులే ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతుండటంతో అడ్డుకోవడం ఎలాగో తెలియక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. 2014లో బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద 938 కేసులు నమోదు కాగా గత ఏడాది (2020) నాటికి దాదాపు మూడింతలు పెరిగి 2,626 రికార్డయ్యాయి. ఈ ఏడాది ఇంకాస్త పెరిగి మొదటి ఏడు నెలల్లోనే 1750కి చేరుకున్నాయి. రాష్ట్రంలో మిగతా నేరాలు తగ్గుతున్నా, సైబర్‌నేరాలు, మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల్లో పెరుగుదల నమోదవుతోంది.

పరిచయస్తులతోనే ప్రమాదం

పిల్లలు వయసు పెరిగే కొద్దీ ఎదుటి వ్యక్తి దురుద్దేశాలను అర్థం చేసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు.అవసరమైతే తల్లిదండ్రుల సాయం తీసుకుంటారు. కానీ అవేమీ తెలియని పసిపిల్లలకు దుండగులు చాక్లెట్ల వంటివి ఆశ చూపించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వరంగల్‌లో తల్లి వద్ద నిద్రిస్తున్న తొమ్మిది నెలల పసిగుడ్డును ప్రవీణ్‌ అనే ఉన్మాది అపహరించి చిన్ని ప్రాణాన్ని చిదిమేశాడు. గత జులైలో ఒడిశాకు చెందిన అభిరామ్‌దాస్‌ అనే వ్యక్తి జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 99.7 శాతం కేసులలో చిన్నారులపై తెలిసిన వారే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నతండ్రే బిడ్డలపై లైంగికదాడికి తెగబడుతున్నాడు. గత ఏడాది మే నెలలో దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 45 ఏళ్ల తండ్రి 12 ఏళ్ల కూతురిపై అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది జులై నెలలో కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం మత్తులో ఉన్న తండ్రి 16 ఏళ్ల తన కుమార్తెపై అత్యాచారానికి ప్రయత్నించగా తల్లి అడ్డుకుంది.

మాదకద్రవ్యాలతో ఉపద్రవం

సైదాబాద్‌ ఘటనలో నిందితుడు రాజు వ్యసనాలకు బానిసయ్యాడు. గంజాయి మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వరంగల్‌ నిందితుడు ప్రవీణ్‌ ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు. కాచిగూడలో కన్నబిడ్డపై అత్యాచారయత్నం చేయబోయిన తండ్రి కూడా మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు నగరాల్లో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం ఇలాంటి అకృత్యాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో మాత్రమే పరిమితంగా చలామణి అయిన గంజాయి తదితర మాదకద్రవ్యాలు ఇప్పుడు కాలనీల్లోకీ చొచ్చుకొచ్చాయి.

అప్రమత్తతతోనే రక్షణ

తల్లిదండ్రులు అప్రమత్తమైతేనే పిల్లలకు రక్షణ సాధ్యం. పిల్లలు ఎంత చిన్నవారయినా ఒంటరిగా వదలవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను దగ్గరకు తీసుకునే వారి ప్రవర్తన ఎలా ఉందో గమనిస్తూనే ఉండాలి. కొన్ని సందర్భాల్లో పిల్లలు తమ సమస్యను తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. అందుకే పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చినా, ముభావంగా ఉన్నా తల్లిదండ్రులే చొరవ తీసుకొని ఆరా తీయాలి. సమస్య తెలుసుకొని సున్నితంగా వారికి అవగాహన, రక్షణ కల్పించాలి.


మత్తు... మానసిక రుగ్మతలే కారణం

- విశాల్‌ ఆకుల, జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి, ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ

లైంగికదాడులు పెరగడానికి ప్రధాన కారణం మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలే. కొంతమందిలో స్వతహాగా కొన్ని మానసిక సమస్యలు ఉంటాయి. పిడోఫిలియా అందులో ఒకటి. ఈ రుగ్మత ఉన్నవారు చిన్నపిల్లలతోనే లైంగికవాంఛలు తీర్చుకోవాలనుకుంటారు. మద్యం, గంజాయి వంటివి తాగినప్పుడు లైంగికవాంఛలు పెరుగుతాయి. దుండగులు మృగాల్లా ప్రవర్తిస్తారు. పెద్దవారయితే ఎదురు తిరుగుతారన్న ఉద్దేశంతో చిన్నపిల్లలపైనే దాడి చేస్తారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


ఆచూకీ చెబితే రూ. 10లక్షల నజరానా

హైదరాబాద్‌ నగరంలో ఓ బస్తీలో ఆరేళ్ల చిన్నారిని హత్యాచారం చేసిన కేసులో నిందితుడు పల్లకొండ రాజు ఆచూకీ తెలిపినా, పట్టించినా రూ.10లక్షల నగదు బహుమతి ఇస్తామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం ప్రకటించారు. అతడి ఫొటోను అధికారికంగా విడుదల చేశారు. నిందితుడు 5.9 అడుగుల ఎత్తు, రెండు చేతులపైన మౌనిక అనే పేరుతో పచ్చబొట్టు, తలకు టోపీ, మఫ్లర్‌ ధరించాడని, గడ్డం పెంచుకున్నాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని