ఆదాయమే అన్నింటికీ మూలం!
close
Updated : 18/09/2021 04:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆదాయమే అన్నింటికీ మూలం!

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడంపై విముఖత అందుకే..

దేశ ప్రజలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం’పై కేంద్రం పెదవి విరిచింది. పలు రాష్ట్రాలు అందుకు సుముఖంగా లేవని చెబుతోంది. ఇంతకీ దీనిపై రాష్ట్రాలకు ఉన్న అభ్యంతరమేమిటి? కేంద్రం ఎందుకు కాదంటోంది? పరిశీలిస్తే ఒకటే విషయం స్పష్టమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే తాము భారీగా ఆదాయం కోల్పోవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే కేంద్రం, రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదని చెబుతున్నారు.

పెట్రో పన్నుల లోగుట్టు

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని 2017లో ప్రవేశపెట్టినప్పుడు ముడి చమురు, సహజ వాయువు, పెట్రోలు, డీజిల్‌, విమాన ఇంధనమైన ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ను దీని పరిధి నుంచి మినహాయించారు. ఈ పెట్రో ఉత్పత్తులపై పన్ను వసూళ్లు కేంద్ర రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండటమే దీనికి కారణం. అందుకే అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు తగ్గినా కూడా భారత్‌లో వాటిని తగ్గించడానికి ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరుగా ఎక్సైజు, వ్యాట్‌ రేట్లను విధిస్తున్నాయి. ఆ రేట్ల మధ్య పొంతన లేదు. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే దేశమంతటా ఒకే విధమైన పన్ను రేటు అమల్లోకి వచ్చి ధరలు భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు దిల్లీలో పెట్రోలు ధరను తీసుకుని దానిపై కేంద్ర, రాష్ట్ర పన్ను రేట్లను, డీలర్‌ కమిషన్‌ను విశ్లేషిస్తే.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే లాభమేమిటో అర్థమవుతుంది. దిల్లీలో లీటరు పెట్రోలు మూల ధర, రవాణా చార్జీలతో కలిపి రూ. 41.10. దీనికి కేంద్ర ఎక్సైజు పన్ను, డీలర్‌ కమిషన్‌, రాష్ట్ర వ్యాట్‌ను కలుపుకొంటే మార్కెట్‌ ధర రూ. 101.19లు అవుతోంది. అదే పెట్రోలును జీఎస్టీ పరిధిలోకి తెస్తే లీటరుకు ఎక్సైజు, వ్యాట్‌ పన్నులు తొలగిపోయి, మూలధరపై 28% జీఎస్టీ (అంటే రూ. 11.50), ఆపైన డీలర్‌ కమిషన్‌ రూ. 3.84 పైసలను కలుపుకొంటే మార్కెట్‌ ధర లీటరుకు కేవలం రూ. 56.44 పడుతుంది. అంటే వినియోగదారునికి దాదాపు సగం ధర తగ్గిపోతుందన్న మాట. ఇదేవిధంగా లెక్కవేసుకుంటే ప్రస్తుతం దిల్లీలో రూ. 88.62లుగా ఉన్న డీజిల్‌ ధర రూ.55.41కి తగ్గిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో ఇదే రీతిలో పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిపోతాయి. కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై ప్రజలు ఇంధనంపై చేసే వ్యయం తగ్గిపోయినా, కేంద్ర రాష్ట్రాలు అదే పనిగా పన్నులు పెంచివేస్తూ ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటున్నాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలకు పెట్రో పన్నుల ద్వారా ఏటా రూ. 5 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇందులో రాష్ట్రాల వాటా రూ. 2 లక్షల కోట్లు. దీన్ని కోల్పోవడానికి రాష్ట్రాలు సుముఖంగా లేవు.

ప్రజలకు ప్రయోజనాలెన్నో..

పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఇంధన వ్యయం, రవాణా వ్యయం తగ్గి వినియోగదారులతోపాటు పరిశ్రమలు, వ్యాపారాలు కూడా లబ్ధి పొందుతాయి. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తే చాలామేర ఇతర ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

- ఈనాడు, ప్రత్యేక విభాగం


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని