ఎయి‘డెడ్‌’తో ఫీజులుం!
close
Updated : 20/09/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయి‘డెడ్‌’తో ఫీజులుం!

35వేల మంది డిగ్రీ విద్యార్థులపై భారం
ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత నిర్ణయంతో ఆందోళన
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు గ్రాంటును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుమారు 35వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. బోధన రుసుములకు అర్హులుకాని విద్యార్థులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాంటును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారే తప్ప బోధన రుసుములకు అర్హులు కాని వారిపై పడే భారాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో డిగ్రీ 2, 3 సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులపై ఆర్థిక భారం పడనుంది. గ్రాంటు నిలిపివేతతో ఎయిడెడ్‌ కళాశాలలు ప్రైవేటు విద్యాసంస్థలుగా మారిపోయాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులను అవి వసూలు చేయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 137 డిగ్రీ కళాశాలలు ఉండగా.. వీటిలో రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులు సుమారు 1.40లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 25శాతానికి పైగా బోధన రుసుముల పథకం పరిధిలో లేరు. మరో పక్క ప్రైవేటుగా మారిన వాటికి భవిష్యత్తులో ప్రభుత్వాల నుంచి నిధులు రావు.

ఆగిపోనున్న నిధుల విడుదల

ఇప్పటికే 124 యాజమాన్యాలు సిబ్బందిని వెనక్కి ఇచ్చేశాయి. ఇవి ప్రైవేటుగా మారిపోయినట్లే. దేవాదాయశాఖకు చెందిన మరో 4 కళాశాలలు ఉండగా వీటి నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకుంటున్నారు. మిగతా యాజమాన్యాలతో పాఠశాల విద్య కమిషనర్‌ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎయిడెడ్‌లో 28 స్వయంప్రతిపత్తి కలిగిన కళాశాలలు ఉన్నాయి. వీటికి యూజీసీ నుంచి ఏటా రూ.20 లక్షల వరకు నిధులు వస్తున్నాయి. ఇవి ప్రైవేటుగా మారితే యూజీసీ నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇవికాకుండా న్యాక్‌ గ్రేడ్‌-ఏ, బీ+ గుర్తింపు ఉన్న 35 కళాశాలలకు రూసా ద్వారా కేంద్రం నిధులు ఇస్తోంది. ఆ నిధులు ఇప్పటివరకు సగం మాత్రమే విడుదలైనందున మిగతా వాటి పరిస్థితి సందిగ్ధంలో పడింది. గుంటూరులోని హిందూ, జేకేసీ, ఏసీ లాంటి కళాశాలలకు రూ.2 కోట్లకు గాను రూ.కోటి ఇచ్చారు. రాబోయే రూ.కోటికి సంబంధించి కొంతవరకు పనులు చేశారు. నిధులు రావాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రూసా కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.


ఆర్థిక భారం ఇలా..

ఇప్పటివరకు ఎయిడెడ్‌ కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండడంతో ఫీజులు తక్కువగా ఉంటాయని విద్యార్థులు వీటిలో ప్రవేశాలు పొందారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఫీజుల భారం వారి నెత్తిన పడింది. గుంటూరులోని హిందూ కళాశాలలో బీఏ చదివే విద్యార్థి ప్రస్తుతం రూ.3,500 చెల్లిస్తుండగా.. ఈ కళాశాల ప్రైవేటుగా మారితే రూ.8వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అదే బీఎస్సీ (ఎంపీసీ) చదివే వారు రూ.7వేలు అదనంగా కట్టాల్సి ఉంటుంది. తెనాలిలోని మరో కళాశాలలో బీఏకు ప్రస్తుతం రూ.2,130 ఫీజు ఉండగా.. ప్రైవేటుగా మారితే రూ.8వేలు చెల్లించాల్సి ఉంటుంది.


 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని