‘పాలు’పోవడం లేదు!
close
Updated : 21/09/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాలు’పోవడం లేదు!

వానాకాలంలోనూ పెరగని ఉత్పత్తి
కర్ణాటక నుంచి కొంటున్న విజయ డెయిరీ
రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో 0.87 శాతమే పాడిపై ఉపాధి

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలంలోనూ రాష్ట్రంలో పాల కొరత వేధిస్తోంది. మరో పక్షం రోజుల్లో సీజన్‌ ముగుస్తున్నా ఇంతవరకూ ఉత్పత్తి పెరగలేదు. రైతుల నుంచి ఆశించినంత పాల సేకరణ లేకపోవడంతో ‘తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య’(విజయ డెయిరీ) ఇంకా కర్ణాటక నుంచే నిత్యం కొంటోంది. ఈ డెయిరీకి రోజూ 3.50 లక్షల లీటర్ల పాలు అవసరం. రైతుల నుంచి సేకరించేది 2.50 లక్షల లీటర్లలోపే. పాల ఉత్పత్తి సరిగా లేనందున కొన్ని డెయిరీలు పాలపొడిని సైతం కొంతమేర పాలుగా మార్చి సాధారణ పాలతో కలిపి విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం రికార్డుస్థాయిలో పెరుగుతున్నా పాడి పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంపు విషయంలో నిరాశాజనక పరిస్థితులున్నాయి. రాష్ట్రంలోని మొత్తం గ్రామీణ రైతు కుటుంబాల్లో కేవలం 0.87 శాతం మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. తమిళనాడులో 12 శాతం రైతు కుటుంబాలు పాడితోనే స్వయం ఉపాధి పొందుతూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి.

ఎందుకీ కొరత

రాష్ట్రంలో పాల కొరత గత ఏడాది కాలంగా తగ్గకపోవడం గమనార్హం. విజయ డెయిరీకి పాలు పోయడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు డెయిరీలు అధిక వెన్న ఉండే లీటరు గేదె పాలకు రూ.45-50 దాకా ఇస్తున్నాయి. విజయ డెయిరీ మాత్రం వెన్నశాతం ఆధారంగా లీటరుకు రూ.38-40 చెల్లిస్తోంది. పాలలో ఉండే వెన్నశాతాన్ని లెక్కించి ధరను డెయిరీలు నిర్ణయించడం ఆనవాయితీ. అత్యధిక శాతం పాలలో సాధారణంగా వెన్నశాతం 6-7 ఉంటోంది. 10 శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.75-80 దాకా చెల్లిస్తామని డెయిరీలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రంలో నాణ్యమైన దాణా, మేలైన గ్రాసం పెట్టి పశు పోషణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వెన్నశాతం పెద్దగా ఉండటం లేదని ప్రధాన డెయిరీ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల ఆవుల సంఖ్య పెరుగుతోంది. ఆవు పాలలో వెన్న చాలా తక్కువగా ఉంటోందని లీటరుకు రూ.27-30 లోపే విజయ డెయిరీ చెల్లిస్తోంది. అవసరాన్ని బట్టి ప్రైవేటు డెయిరీలు ఈ ధరను గ్రామానికో తీరుగా పెంచి కొంటున్నాయి. దీనివల్ల విజయ డెయిరీకి పాలు పెద్దగా రావడం లేదు. హైదరాబాద్‌లో రోజూ అన్ని డెయిరీలు కలిపి 25 లక్షల లీటర్లకు పైగా పాలు విక్రయిస్తుంటే అందులో విజయ డెయిరీ వాటా 3 లక్షల లీటర్లే. ఆ కాస్త పాలు కూడా సేకరించలేక కర్ణాటక నుంచి కొంటోంది. ఇతర ప్రైవేటు డెయిరీలు సైతం ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాయి.

పాల ఉత్పత్తి పెరగకపోవడానికి డెయిరీలు..రైతులు చెబుతున్నకారణలేమిటంటే..

పాడి పశువుల పెంపకం ఖరీదైన వృత్తిగా మారుతోంది. కూలీలు దొరకడం లేదు. చిన్న డెయిరీల్లో పశువుల దగ్గర పనిచేయడానికి బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కూలీలను పిలిపించి నియమించినట్లు రాష్ట్ర పాడి రైతుల సంఘం నేత బాల్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.

సాగునీటి లభ్యతతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో పశువులను మేపడానికి ఖాళీ భూములు తగ్గిపోయాయి.

రోజూ కూలికి వెళితే రూ.300 నుంచి 500 దాకా ఇస్తున్నారు. పాడి వల్ల అంత ఆదాయం రావడం లేదని ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు.

దాణాలో కలిపే సోయా, మొక్కజొన్న చెక్క ధరలు ఇటీవల ఏకంగా 20 శాతం పెరిగాయి. 25 కిలోల నాణ్యమైన దాణా చెక్క కావాలంటే రూ.వెయ్యి ఖర్చవుతోంది. దీంతో చాలామంది పాడిపై దృష్టి పెట్టడం లేదు.

పశుగ్రాసం పెంపకం పెద్దగా లేదు. రైతులు పంటల సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు.


గిట్టుబాటు కావడం లేదు
- సోమిరెడ్డి, ఛైర్మన్‌, జనగామ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం

పాడి పశువుల పెంపకం రోజురోజుకు తలకుమించిన భారమౌతోంది. ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లేదు. గత ఏడాదికాలంలో జనగామ జిల్లాలో 360 పాడి అవులు చనిపోతే  బీమా పరిహారం కోసం అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. ఎస్సీ కార్పొరేషన్‌ పేదలకు పాడి పశువులను రాయితీపై ఇస్తోంది. కానీ పాలమ్మితే వచ్చే మొత్తం పశుపోషణ ఖర్చులకూ సరిపోవడం లేదు.


సమీక్షిస్తాం
- అనితా రాజేంద్ర, కార్యదర్శి, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, ఎండీ, విజయ డెయిరీ

ర్ణాటక నుంచి నిత్యం పాలు కొంటున్న మాట వాస్తవమే. వానాకాలంలోనూ కొరత వల్ల తప్పడం లేదు. త్వరలో సమీక్షిస్తాం. పాడి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఏం చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని