చిక్కుల్లేని చక్కెర!
close
Updated : 22/01/2020 03:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిక్కుల్లేని చక్కెర!

ఇంటింటి ఆరోగ్యం

వద్దనుకుంటాం! కానీ స్వీట్‌ కనిపించగానే మనసులో చేసుకున్న బాసలన్నీ గాలికివదిలేసి ఒకటీ.. మరొకటీ అని వరసపెట్టి తినేస్తాం!  తర్వాత తీరిగ్గా పశ్చాత్తాప పడతాం. అందులోని చక్కెరతోనే ఈ చిక్కంతా! అనారోగ్య సమస్యలున్నవారే కాదు... బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చక్కెర గురించి, దాని ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోవాల్సిందే..


చక్కెర వాడకం ఎక్కడ ఎక్కువ?

సంప్రదాయ తీపి వంటకాల్లో, బేకరీ ఉత్పత్తులైన కేకులు, బిస్కట్లు, చాక్లెట్లు, సాస్‌లు, సాఫ్ట్‌ డ్రింక్స్‌, పండ్ల రసాల్లో కూడా ఎక్కువగా చక్కెరని వాడతారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే తీపి తీసుకుంటూ ఉంటాం. ఎనర్జీ బార్లలోనూ చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిపై ‘హై ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌’ అని రాస్తారు. నిజానికి ఇది కూడా ఓ రకం చక్కెరే. యాడెడ్‌ గ్లూకోజ్‌, లిక్విడ్‌ గ్లూకోజ్‌, మాల్ట్‌ సిరప్‌, మేపుల్‌ సిరప్‌... ఇలా ఏ పేరుతో ఉన్నా చక్కెరకు ప్రతిరూపాలే. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌లో ఈ పేర్లతో కనిపిస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కెలొరీలు లేని చక్కెరలున్నాయి.


ఎన్ని రకాలున్నాయి?

రెండు రకాల చక్కెర ప్రత్యామ్నాయాలు ఉంటాయి. ఇవి పొడులుగా, ద్రవరూపంలో దొరుకుతాయి.
1) నాన్‌ కెలొరీ స్వీట్‌నర్స్‌ (వీటి నుంచి కెలొరీలు అస్సలు అందవు.)
ఇవి ఒక రకమైన రసాయనాలు. చాలా తియ్యగా ఉంటాయి. సాధారణంగా ఉండే చక్కెరకు అయిదారు వందల రెట్లు తియ్యదనాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని అతి స్వల్ప పరిమాణంలో వాడినా తియ్యదనం వస్తుంది. వీటిని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఎక్కువగా వాడతారు. వీటిలో సాధారణంగా ఉండేవి సాకరిన్‌, సుక్రలోజ్‌, ఆస్పర్టెన్స్‌... ఇవన్నీ నాన్‌ కెలొరీస్‌ స్వీట్‌నర్స్‌ జాబితాలోకి వస్తాయి. వివిధ రకాల బ్రాండ్‌ పేర్లతో మార్కెట్లో దొరుకుతాయి.

2) లో కెలొరీ స్వీట్‌నర్స్‌

ఇవి చక్కెర కంటే తక్కువ కెలొరీలను ఇస్తాయి. మానిటాల్‌, లాక్టిటాల్‌ పేర్లతో మార్కెట్‌లో దొరుకుతాయి.  వీటినే డైట్‌ షుగర్‌ అని పిలుస్తారు.

 


అపోహలూ ఉన్నాయి...

* వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, మధుమేహం, మూత్రపిండ సమస్యలు వస్తాయని.. చాలామంది అపోహ పడుతుంటారు. వీటిని నిర్ణీత మోతాదులో వాడుకుంటే ఏ సమస్యా ఉండదు. అలాని అపరిమితంగానూ తీసుకోవద్దు.
* మార్కెట్లో కొంటున్న ప్రాసెస్డ్‌ ఫుడ్‌ మీద లేబుల్‌ను క్షుణ్నంగా చదవాలి. చక్కెర ప్రత్యామ్నాయం ఏ రూపంలో ఉంది? దాని నుంచి ఎన్ని కెలొరీలు అందుతాయో చూసుకోవాలి.
* కృత్రిమంగా తయారయ్యే చక్కెర ప్రత్యామ్నాయాల వల్లే నష్టం. మామూలు చక్కెర వల్ల అలా జరగదనుకోవడం పొరపాటు. ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే.
* చక్కెరకు సహజ ప్రత్యామ్నాయాలుగా చెప్పే తేనె, బెల్లం, ఖర్జూర.... వీటన్నింటి నుంచి దాదాపు చక్కెర నుంచి ఎన్ని కెలొరీలు వస్తాయో అన్నే కెలొరీలు అందుతాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. చెరకు నుంచి చక్కెరను తయారుచేసే క్రమంలో కొన్ని రకాల రసాయన పదార్థాలు దానికి కలుపుతారు. ఇది నచ్చనివారు సహజ తీపి పదార్థాలైన బెల్లం, తేనె లాంటి వాటిని వాడుకోవచ్చు.


రోజుకు ఎంత తీసుకోవాలి?

ఒక వ్యక్తి రోజుకు 20 నుంచి 25 గ్రాముల చక్కెర మోతాదును మించకుండా తీసుకోవాలి.  గ్రాము చక్కెర నుంచి నాలుగు కెలొరీలు లభిస్తాయి. రోజులో సుమారు 40 గ్రాముల చక్కెర తీసుకుంటే దాదాపు 160 కెలొరీలు కేవలం చక్కెర నుంచే వచ్చి చేరతాయి.

లడ్డూ, గులాబ్‌జామ్‌, కేక్‌, చాక్లెట్‌... వీటి నుంచి లభించే కెలొరీలు చాలా ఎక్కువ. కాఫీ, టీల నుంచి మొదలుకుని స్వీట్లు, పండ్లరసాలు, చాక్లెట్లు, కేక్స్‌... ఇలా ప్రతి దాన్నుంచి అదనంగా కెలొరీలు శరీరంలో జమ అవుతాయి. ఇదిలానే కొనసాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. బదులుగా చక్కెర ప్రత్యామ్నాయాలని అన్వేషించవచ్చు.


ఎవరు తీసుకోవద్దు...?

ఈ చక్కెర ప్రత్యామ్నాయాలను సంవత్సరం లోపు శిశువులకు పెట్టొద్దు. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులు తీసుకోవద్దు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని