మీరో పరీక్ష కాకండి!
close
Published : 30/01/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీరో పరీక్ష కాకండి!

సుమిత్రకి ఇద్దరు పిల్లలు. కొడుకు పదో తరగతి, కూతురు ఇంటర్‌ రెండో సంవత్సరం. పరీక్షల హడావుడి మొదలు కాగానే సుమిత్ర పడే ఆందోళన పెరిగిపోయింది. ఇంట్లో కేబుల్‌, వైఫై కనెక్షన్లు తీసేయడం, రోజుకో గుడికి వెళ్లి పూజలు చేయడం, పిల్లలకు కఠిన నియమాలు పెట్టి వారిని ప్రత్యేకంగా చదివించడం మొదలుపెట్టింది. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు రావాలని వారిపై ఒత్తిడి పెంచింది. పరీక్షలు దగ్గరపడేకొద్దీ పిల్లలు మరింత ఆందోళనకు గురై సరిగ్గా చదవలేక సబ్జెక్టులు తప్పారు.

స్రవంతికి ఇంటర్‌ చదువుతున్న అమ్మాయి ఉంది. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎలా సన్నద్ధమవ్వాలో ప్రణాళిక వేసుకోమని కూతురికి చెప్పింది స్రవంతి. ఎన్ని గంటలు చదవాలి, ఏయే సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి, టీవీ, ఫోను, స్నేహితులతో ఎంతసేపు గడపాలి... వంటివన్నీ కూతురి నిర్ణయానికే వదిలేసింది. ఎలాంటి ఒత్తిడి, అంచనాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చదివిన ఆ అమ్మాయి తొంభైశాతం మార్కులతో ఉత్తీర్ణురాలయ్యింది.
ఫిబ్రవరి నెల వస్తే చాలు.. పరీక్షల హడావుడి మొదలవుతుంది. వార్షిక పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళన చెందడం సహజమే. అలాంటి సందర్భంలో వారిని అర్థం చేసుకోవాలి. ఏడాదంతా తరగతి గదుల్లో, స్టడీ అవర్స్‌ల్లో సిలబస్‌ని పునశ్చరణ చేస్తూ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఇలా కాకుండా కొన్నిసార్లు తల్లిదండ్రులే కంగారు పడుతూ, అతి జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తారు. ఒక్కోసారి స్వేచ్ఛ ఇవ్వకుండా, మితిమీరిన లక్ష్యాలు, కఠిన నియమాలు విధిస్తారు. ఇవి పిల్లలను మరింత ఒత్తిడికి గురిచేస్తాయి. దీంతో పరీక్షలు బాగా రాయలేక, తల్లిదండ్రుల అంచనాలు అందుకోలేక కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంది.


పరీక్షలు జరిగేటప్పుడు...

* రాత్రంతా చదివి తెల్లవారాక నిద్ర పోయే అలవాటు ఉంటే మాన్పించాలి. ఈ అలవాటుతో పరీక్షల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. పరీక్షల సమయంలో సరైన పోషకాహారం, తగినంత ద్రవాహారం తప్పకుండా తీసుకునేలా చూడాలి. తగినంత విశ్రాంతి అవసరం. ఏదైనా తిన్న తరువాతే పరీక్షకు పంపాలి.

* తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్థులైతే, పరీక్షల సమయంలో పిల్లలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి. పిల్లలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నపుడు వారికి తల్లిదండ్రులు, కుటుంబాన్ని మించిన ఆసరా మరొకటి లేదు. పరీక్ష హాలు వద్ద దించి, మళ్లీ ఇంటికి తీసుకురావడం పిల్లలకు చాలా సాంత్వన ఇస్తుంది.

* పరీక్ష ముగిసిన తరువాత ఎలా రాశారో కనుక్కుని సానుకూలంగా స్పందించాలి. అనుకున్నంత బాగా పరీక్ష రాయలేదని పిల్లలు చెప్తే.. ‘నువ్వు సరిగా చదివితేగా? ఇప్పటి నుంచి బాగా చదవకపోతే ఊరుకోను...’ వంటి మాటలు మాట్లాడకూడదు. సమతౌల్యత పాటిస్తూ స్పందించాలి. ‘తరువాతి పరీక్ష గురించి ఆలోచించు..’ అంటూ తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం పిల్లలకు ఎంతో అవసరం. ఆరోపణలు, దూషణలు రాబోయే పరీక్షపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

* కేవలం మార్కులు, ర్యాంకులను పిల్లల తెలివితేటలు, ప్రతిభకు కొలమానంగా భావించకూడదు. ప్రతి విద్యార్థి ప్రతిభ వేర్వేరు స్థాయుల్లో ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వారికి లక్ష్యాలు నిర్దేశించుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. పరీక్షల గురించి పిల్లలు మరింతగా భయపడుతుంటే, కౌన్సెలర్‌తో ఒకసారి మాట్లాడించడం మంచిది.


ఈ జాగ్రత్తలు పాటించండి

1.తరబడి పుస్తకాల ముందు కూర్చున్నంత మాత్రాన ఏకాగ్రత కుదిరి చదువు బుర్రకెక్కినట్టు కాదని గుర్తించాలి. అలసిపోయిన మెదడుకి ఆటవిడుపు తప్పనిసరి. కాసేపు బయటకు వెళ్లమని, స్నేహితులతో కొద్దిసేపు గడిపి రమ్మని పిల్లలకు చెప్పాలి. ‘రోజంతా చదవాల్సిందే, బయటకు వెళ్లడానికి వీళ్లేదు, టీవీ చూడొద్ధు..’ వంటి నియమాలు అనవసరం.

2.పిల్లలను ఇతరులతో పోలుస్తూ, తక్కువ చేసి మాట్లాడకూడదు. ‘తోటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, వాళ్లకు తెలివితేటలు ఎక్కువ, నువ్వు వాళ్లకు పోటీ కాలేవు...’ ఇలాంటి మాటలు పిల్లల మనసును ప్రభావితం చేస్తాయి.

3.పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్లందరూ కలిసి టీవీ చూడటం, పెద్దగా మాట్లాడటం, అనవసర చర్చలు, గొడవలు, వాదోపవాదాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి ఇంటి వాతావరణాన్ని, విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.

4.పరీక్షలకు సన్నద్ద్ధమయ్యేటప్పుడు టీవీలు, స్మార్ట్‌ఫోన్‌కి అతుక్కుపోకుండా చూడాలి. అలాగని సమయం వృథా కాకూడదన్న ఉద్దేశంతో భోజనాలు, అల్పాహారాలు అన్నీ వారి గదిలోకే పంపించడం, బయటకు వెళ్లడానికి అనుమతించకపోవడం వంటి పనులు మానుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా ఏర్పాట్లు చేయాలి. ఆ సమయంలో పరీక్షల గురించి మాట్లాడకుండా సరదాగా గడపాలి. ఇంట్లోవాళ్లంతా తనతోనే ఉన్నారన్న భావన పిల్లలకు మానసిక సాంత్వన ఇవ్వడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

5.పాత రోజుల్లో మాదిరిగా వాళ్లు చదువుకుంటున్నంతసేపూ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మేలుకుని తోడుగా ఉండటం అనవసరం. ఏకాంతంలో ప్రశాంతంగా చదువుకోవడం వారికి ఇష్టమైతే, వారి అభిప్రాయాన్ని గౌరవించడం మంచిది.

- సుజాత వేల్పూరి, కౌన్సెలర్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని