టోపీ, చెప్పులు వదలడు! ఇదేమన్నా సమస్యా?
close
Updated : 06/02/2020 06:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టోపీ, చెప్పులు వదలడు! ఇదేమన్నా సమస్యా?

మా మనవడి వయసు అయిదేళ్లు. అమెరికాలో ఉంటాడు. బడిలో తోటి పిల్లలతో కలివిడిగా ఉండటం లేదని బాబును సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకువెళ్లారు. డాక్టర్‌ పిల్లాడికి ఆటిజం సమస్య ఉందని చెప్పారు. బాబు ఇంట్లో మా అందరితోనూ బాగానే ఉంటాడు. కానీ ఎడమ చేతితో రాస్తాడు. ఎప్పుడూ టోపీ, చెప్పులు వేసుకునే ఉండాలంటాడు. ఇదేమైనా మానసిక సమస్యా?
- సావిత్రి, హైదరాబాద్‌
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే... బాబు ఇంట్లో వాళ్లతో బాగానే ఉన్నా, బయటివారితో కలవలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అని ఆలోచించాలి. ఎప్పుడూ టోపీ పెట్టుకోవడం, చెప్పులు వేసుకుని ఉండటం.. లాంటి లక్షణాలను వైద్య పరిభాషలో స్టీరియోటైపిక్‌ బిహేవియర్‌ అంటారు. ఇరవై నాలుగ్గంటలూ అలా వాటిని వేసుకుని ఉండటాన్ని సెన్సరీ ఇష్యూగా పరిగణిస్తారు. నేల కాలికి తగలడం ఇష్టం లేకపోవడం వల్ల కూడా చెప్పులు వేసుకుంటున్నాడేమో. ఇవి కొన్ని ఆటిజం లక్షణాలే. అలాగని పూర్తిగా ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డరే అని చెప్పలేం. బాబు మానసిక ఎదుగుదలలో ఏదైనా సమస్య ఉందేమోననే అనుమానం వస్తోంది. బాబు వయసు అయిదేళ్లు కాబట్టి డెవలప్‌మెంట్‌ అసెస్‌మెంట్ చేయాలి. ఇందులో భాగంగా వయసుతోపాటు మెదడూ అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుందో లేదో తెలుసుకుంటారు. ఆటిజం ఉందా.. లేక కేవలం ఆ లక్షణాలేనా అన్నదీ పరీక్షిస్తారు. అలాగే మోటారు స్కిల్స్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ చేసిన తరువాత బాబుకు మెదడు ఎదుగుదలలో లోపమా లేక బ్రెయిన్‌లోని కుడి, ఎడమ భాగాల్లో తేడా ఉండటం వల్ల అయోమయానికి గురై ఇతరులతో కలవలేకపోతున్నాడా అనేది తెలుస్తుంది. బాబుకు ఏమైనా భయాలున్నాయా అనే విషయాన్ని కూడా పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఆటిజం సమస్య ఉందని తెలిస్తే... సామాజిక నైపుణ్యాలు నేర్పిస్తారు. స్పీచ్‌ థెరపీ, లాంగ్వేజ్‌ థెరపీ కూడా నేర్పుతారు. భయాలుంటే తొలగిస్తారు. చిన్నారికి స్పీచ్‌, ఆక్యుపేషన్‌ థెరపీలు అవసరమవుతాయి. తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ తప్పనిసరి. కాబట్టి ముందుగా బాబును సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువెళ్లండి.
మీ ప్రశ్నలు
vasukids@eenadu.net కు పంపించగలరు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని