దయలేని ఉదయం!
close
Updated : 29/02/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దయలేని ఉదయం!

అమ్మకు ఒత్తిడంతా అప్పుడే!

లేచామా... ఇంటెడు చాకిరీ చేశామా.. బాక్సులు సర్దామా బయల్దేరామా ఇది ఈనాటి తల్లుల ఆరాటం. అందులోనూ మహిళలు ఉద్యోగులు అయితే ఇక వారి శ్రమకు అంతుండదు.. ఉరుకులు, పరుగులతో.... ప్రతి ఉదయం హృదయవిదారకమే! అప్పుడే మాపట్ల దయచూపమంటోంది  మహిళాసమాజం....
ఎప్పుడు లేచేదో అమ్మ. నేను పడుకున్నాక ఎప్పటికో.. నిద్రపోయేది. నేను లేచేటప్పటికే ఎప్పుడో స్నానం చేసేసేది. వంటింట్లో నుంచి ప్రెషర్‌ కుక్కర్‌ కూత. అమ్మ హడావుడిగా బెడ్‌రూమ్‌లోకి వచ్చి.. అక్కను తట్టి.. నన్ను ఎత్తుకొని బాత్రూమ్‌లోకి వెళ్లిపోయేది. అక్కడికి వెళ్లేసరికే టూత్‌బ్రష్‌లపై పేస్ట్‌ సిద్ధం. బ్రష్‌ చేసుకొని వచ్చేసరికి.. డైనింగ్‌ టేబుల్‌ మీద బూస్ట్‌ రెడీ. అక్కకు హార్లిక్స్‌!! మాకవి అందించి మళ్లీ వంటింట్లోకి పరిగెత్తేది. వేడి వేడి కాఫీ ఇచ్చి నాన్నను లేపేది. కాఫీ తాగుతూ.. నాన్న పేపర్‌ కేసి చూస్తూ.. సోఫాలో కూర్చునేవాడు. అమ్మ మాత్రం.. వంటింట్లో నుంచి బెడ్రూమ్‌లోకి, అక్కడి నుంచి స్నానాల గదికి, ఏదో గుర్తొచ్చి వాకిట్లోకి, ఇంకేదో మర్చిపోయి మళ్లీ వంటింట్లోకి పరుగులు తీస్తూ.. మధ్య మధ్యలో కాఫీ తాగేది. ఒక్కోరోజు కాఫీ సంగతే మర్చిపోయేది.
అక్క మహా పొదుపరి, పైగా చాదస్తురాలు. స్నానానికి వెళ్తే నీళ్లు ఖర్చయ్యేవి కావు. సబ్బు అరిగేది కాదు. అరగంట దాటినా.. నీళ్ల శబ్దం వచ్చేది కాదు. మళ్లీ అమ్మే రావాలి. లేని ఓపికంతా తెచ్చుకొని వీపు రుద్ది మరీ స్నానం చేయించాలి. తర్వాత నావంతు. నేను మహా సిగ్గరి. చాలా చలాకీ. నా స్నానం నేనే చేస్తానని పేచీ పెట్టి.. ముఖం కూడా సరిగ్గా తడవకుండా అర నిమిషంలో బయటకు వచ్చేసేవాణ్ని. వీపులో చిన్న విమానం మోత మోగించి. స్నానం చేయించేది. అప్పుడు నాన్న నాకు మద్దతుగా వచ్చేవాడు. ‘రేపట్నుంచి మీరే చేయించండి వాడికి స్నానం’ అనేది అమ్మ. ఆ రోజు.. ఈ రోజు వరకూ రాలేదు.
ఘడియకోసారి గడియారం వంక చూస్తూ పనులు చేసేది అమ్మ. చిన్న గ్యాప్‌ దొరికితే చాలు చకచకా వచ్చేసి.. అక్కకు జడలు, నాకు యూనిఫామ్‌ వేసేది. వెనక్కి తిరిగే సరికి అమ్మ మాయం. వాకింగ్‌ నుంచి వచ్చిన తాతయ్యకు మందులు, తులసికోట పూజ ముగించుకొని వచ్చిన బామ్మకు ఫిల్టర్‌ కాఫీ ఇవ్వాలి కదా!! కాసేపటికి వంటింటి సంగ్రామం జోరందుకునేది. టిఫిన్లు, మధ్యాహ్నానికి భోజనాలు, లంచ్‌ బాక్సులు, తాతయ్యకు రాగి జావ, బామ్మకు ఉప్పు లేకుండా వంటలు.. అష్టావధానం కాదు.. శతావధానమే!!
స్కూల్‌ బస్సు రావడానికి సరిగ్గా అయిదు నిమిషాల ముందు.. అమ్మ జెట్‌ స్పీడ్‌తో పనులు చక్కబెట్టేది. వంకరపోయిన అక్క బొట్టుబిళ్ల సరిచేయడం, నాకు షూలు వేయడం, మా గదిలో రాత్రి మర్చిపోయిన పుస్తకాలు తెచ్చివ్వడం, వాటర్‌ బాటిళ్లు నింపడం.. అన్నీ క్షణాల్లో చక్కదిద్దేది.
మమ్మల్ని బస్సు ఎక్కించి లోపలికి వచ్చేసరికి.. నాన్న టిప్‌టాప్‌గా తయారై టిఫిన్‌ చేస్తూ ఉండేవాడు. ‘అల్లం పచ్చడి బాగుంది. రేపు గారెలు చేయవోయ్‌’ అని ప్రేమగా ఆదేశించేవాడు. అమ్మ సరే అంటూనే.. చకచకా గదిలోకి వెళ్లి అర నిమిషంలో రెడీ అయ్యేది. వంటింట్లోకి వెళ్లి.. గబగబా రెండు ఇడ్లీలు తినేది. ఆ పాటికే వాకిట్లోకి వెళ్లిపోయి.. బైక్‌ ఎక్కేసి.. హారన్‌ మోగించేవాడు నాన్న. ‘ఒక్క నిమిషం, అత్తయ్యా! వాషింగ్‌ మెషీన్‌ సాయంత్రం నేనొచ్చాక వేస్తాను. కుక్కర్‌లో బియ్యం కడిగి పెట్టాను. స్విచ్‌ వేయడం మర్చిపోకండి..’ ఇలా క్షేమం చెప్పి.. పరుగుపరుగున వెళ్లి బైక్‌ వెనుక సీట్లో కూర్చునేది అమ్మ. ‘ఎప్పుడూ లేటే!!’ నాన్న కితాబు. ముందు రోజు రాత్రి సినిమాకు గానీ వెళ్లామా.. అంతే సంగతులు. అమ్మకు కునుకుపడితే ఒట్టు!! అన్ని కుటుంబాల్లో ఇలా ఉండకపోవచ్చు. అందరు అమ్మ కథలూ దాదాపు ఇంతే అంటే కాదనగలమా!!
రోజూ ఇంతే!! ప్రతి ఉదయం ప్రశాంతంగా మొదలవ్వాలనుకుంటాం. అమ్మకు మాత్రం యుద్ధంతో మొదలవుతుంది. ప్రతి యుద్ధాన్నీ ప్రేమతో గెలుస్తుంది. ఆ యుద్ధంలో మనమూ భాగమవుదాం. అమ్మపై ఒత్తిడిని తగ్గిద్దాం.

వారేం కోరుకుంటున్నారు!
‘అమ్మ’కష్టంపై వీగార్డ్‌-మామ్స్‌ప్రెస్సో సంస్థ హైదరాబాద్‌ సహా దిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, పుణె నగరాల్లో తాజాగా చేపట్టిన సర్వేలో తేలిన వాస్తవాలివి..  
80%ఉదయంపూట వంట సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
70%గృహిణులు భర్తలు సాయం చేస్తే బాగుండనుకుంటున్నారు.
60%వంటగదిలో ఎవరి మద్దతూ దొరకడం లేదని చెబుతున్నారు.
28%మందికి మాత్రమే భర్త సాయం అందుతోందట.
27%అత్తగారి సాయం  తీసుకుంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని