చిన్నారులు చూపించారు... చక్కని పరిష్కారాలు!
close
Published : 12/03/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారులు చూపించారు... చక్కని పరిష్కారాలు!

వాళ్లంతా చిన్నపిల్లలే...మనదేశంలో ఎదురవుతున్న సమస్యల గురించి ఆలోచించారు...బుర్రలకు పదునుపెట్టారు...భలే యాప్‌లు తయారు చేశారు...అందరి ప్రశంసలు అందుకుంటున్నారు...ఇంతకీ ఏంటా విశేషాలు?
ఇదంతా సరే... ఈ చిన్నారుల ప్రతిభ ప్రపంచానికి ఎలా తెలిసింది అంటే... వైట్‌హ్యాట్‌జూనియర్‌ అనే విద్యా అంకుర సంస్థ విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తూ 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు పోటీపెట్టింది. నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపే ఆలోచనతో వచ్చినవారే విజేతలని ప్రకటించింది. ఆ ఆలోచనల్ని అమెరికాలోని సిలికాన్‌వ్యాలీలో ప్రదర్శిస్తామని తెలిపింది. దీనికి మనదేశం మొత్తంలో 7 వేల దరఖాస్తులు వస్తే అందులో 12 మంది చిన్నారులు అద్భుతమైన యాప్‌లు తయారుచేశారు. వాళ్లలో కొందరి గురించి తెలుసు కుందామా మరి!

ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్‌ ఇచ్చిన మందులన్నీ తెచ్చుకుంటాం. కొంచెం నయం కాగానే వాటిని వేసుకోకుండా వదిలేస్తాం. మరి వాటి సంగతో? మామూలుగా అయితే కొన్నాళ్ల తర్వాత పడేస్తాం. కానీ వాటిని ఇతరులకు ఇచ్చి సాయం చేయొచ్చు. అదెలా అంటారా? మెడ్‌మేజ్‌ యాప్‌తో. కోల్‌కతాకు చెందిన 11 ఏళ్ల యువరాజ్‌ షాహ్‌ వాళ్ల తాతయ్య వదిలేసిన మందుల్ని చూసి చేసిన ఆలోచనే ఈ యాప్‌. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది అంటే? యాప్‌ ద్వారా మందుల గడువు తేదీ, పేరు లాంటి వివరాల్ని అందులో ఉంచి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎంచుకోవచ్చు. అక్కడికి వెళ్లి ఆ మందుల్ని ఇచ్చి రావచ్చన్నమాట.


కళ్లు మసకగా కనిపించినా... దూరంగా ఉన్నవి చూడలేకపోయినా... కొన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం. తర్వాత అదే పెద్ద ఇబ్బందిగా మారిపోతుంటుంది. మరి సమస్య కొద్దిగా ఉన్నప్పుడే గుర్తించాలంటే ఎలా? గ్రామీణప్రాంతాల వారికైతే డాక్టర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండరు కదా? ఇవన్నీ ఆలోచించాడు ముంబయికి చెందిన 9 ఏళ్ల గర్విత్‌ సూద్‌. దృష్టి పేరుతో ఓ యాప్‌ తయారుచేశాడు. అక్షరాలు, అంకెలు చదవడం వస్తే చాలు... రకరకాల తెరల్లో చిన్న నుంచి పెద్ద సైజుల్లో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కళ్లు ఎంతబాగా కనిపిస్తున్నాయో ఈ యాప్‌తో ఇట్టే తెలుసుకోవచ్చన్నమాట.


ఈ పిల్లాడి పేరు సి.బి సజన్‌. ఉండేది చెన్నైలో. తన స్నేహితుల్లో ఊబకాయంతో బాధపడేవారిని గమనించాడు. అరె... పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం చాలా యాప్స్‌ ఉంటాయి కానీ మా పిల్లల కోసం ప్రత్యేకంగా లేవెందుకు? అనుకున్నాడు. ఏదైనా చేయాలని ఆలోచించాడు. పిల్లల ఆరోగ్యం కోసం... రోజూ చేయాల్సిన పనులు, వ్యాయామం, తినాల్సిన పదార్థాల వివరాలతో కిడ్స్‌హెల్త్‌ యాప్‌ తయారు చేశాడు. దీని ద్వారా పిల్లలు తమ వివరాల్ని ఇస్తూ రోజూ యాప్‌లో కనిపించే వివరాలతో ఆరోగ్యంగా ఉండొచ్చట.
 


ప్లాస్టిక్‌ వంటి చెత్తతో పర్యావరణం కలుషితం అయిపోతోంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఏ చెత్త భూమిలో కలిసిపోయేది? ఏది కలవకుండా ఉండిపోతుంది? ఇలాంటి విషయాలు మనలో ఎంతమందికి తెలుసు? అందుకే ఆ
సంగతుల్ని చెబుతూ వాటిపై అవగాహన కల్పించడానికి బెంగళూరుకు చెందిన పిల్లాడు ‘ట్రాష్‌ సార్టర్‌’ అనే యాప్‌ తయారు  చేశాడు. అబ్బాయి పేరు సొలనో పాల్‌. ఈ యాప్‌ చిన్నారులకు ఆటలానే ఉండి చెత్తకు సంబంధించిన విషయాల్ని తెలుపుతుంది.
దేనివల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో తెలియజేస్తుంది.


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని