అందానికి ఆరోగ్యానికి తరుణీ.. తరుణమిదే!
close
Published : 14/04/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందానికి ఆరోగ్యానికి తరుణీ.. తరుణమిదే!

జుట్టు చూడు ఎలా జీవం లేకుండా ఉందో.. కాస్త హెయిర్‌ప్యాక్‌ వేయొచ్చుగా? సమాధానం... టైం లేదు!   చర్మం చూడు పొడిబారిపోయి ఎలా ఉందో... కాస్త కేర్‌ తీసుకోవచ్చుగా? సమాధానం... టైంలేదు. ఇదే కాదు అందం, ఆరోగ్యం గురించి ఎవరేం చెప్పినా సమాధానం టైం లేదు అనే.  ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. మరి ఎందుకాలస్యం ఈ జాగ్రత్తలు తీసుకోండి..

విటమిన్‌ డి సంగతేంటి?
మామూలుగానే మనకు డి విటమిన్‌ తక్కువగా ఉంటుంది. మరి బయటకు రావడానికి జంకుతున్న ఈ వేళ.. డి ఎలా అందుతుంది?  క్యాల్షియం, ఫాస్ఫరస్‌ను శరీరం గ్రహించడానికి విటమన్‌-డి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలు, దంతాల అభివృద్ధికి ఈ విటమిన్‌ కావాలి. గుండె జబ్బులను, కుంగుబాటును తగ్గిస్తుంది. బరువు తగ్గిస్తుంది.

డి తగ్గితే..
చిన్నపనికే అలసట. కాస్త ఎక్కువ పనిపడితే ఒళ్లు, కండరాల నొప్పులు. నాలుగు మెట్లు ఎక్కితే అలసట. కింద కూర్చుని లేవడానికి కష్టపడతారు. ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. ప్రతిరోజూ మనకు 600 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ డి అవసరం. ఈ విటమిన్‌ డి సూర్యరశ్మి నుంచి అందుతుంది. మనకిప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి... ఆహార పదార్థాల నుంచి తీసుకోవచ్చు. చేప, గుడ్డులోని పచ్చసొనలో, లివర్‌లో ఉంటుంది. ప్రస్తుతం పాలల్లో కూడా విటమిన్‌ డిని జతచేస్తున్నారు.

జుట్టు సంరక్షణ
చాలామందికి జుట్టు ఊడిపోవడం, చిట్లిపోవడం జరుగుతుంటుంది. ఉద్యోగినులు మామూలు రోజుల్లో ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోలేరు. కానీ ఈ సమయంలో జుట్టుపై కాస్త శ్రద్ధ పెట్టొచ్చు.
* కొబ్బరినూనెలో గోరువెచ్చని ఆముదం కలిపి తలకు పట్టించాలి. రాత్రంతా ఉంచి మర్నాడు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

సహజసిద్ధమైన హెయిర్‌ప్యాక్‌లు..
* అరచెంచా గ్రీన్‌టీ పౌడర్‌లో చెంచా కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
* రెండు గుడ్ల తెల్లసొనకు కొన్ని చుక్కల ఆలివ్‌నూనె, నిమ్మరసం కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
* చెంచా కలబంద గుజ్జులో, కొద్దిగా బాదంనూనె కలిపి తలకు
పట్టించాలి. అరగంట ఆగి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.  వీటితోపాటు జుట్టు పెరగడానికి మంచి ఆహారం ఎంతగానో తోడ్పడుతుంది. జింక్‌, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-ఎ, సి, డి, ఇ... ఇవన్నీ సరిగ్గా తీసుకోవాలి.
విటమిన్‌ ఎ: క్యారెట్‌, పాలకూర, గుమ్మడికాయలు, చిలగడదుంపల్లో ఉంటుంది.
విటమిన్‌ బి: పొట్టు తీయని పప్పులు, మాంసం, ఆకుకూరల్లో లభిస్తుంది.
విటమిన్‌ సి: స్ట్రాబెర్రీ, నిమ్మకాయలు, క్యాప్సికమ్‌, జామకాయలు, మామిడిపండ్ల నుంచి అందుతుంది.
విటమిన్‌ డి: గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, పాలు, చేపలు
విటమిన్‌ ఇ: పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, బాదంపప్పు, పాలకూరలో ఉంటుంది.
ఐరన్‌: గుడ్లు, పాలకూర, పప్పుల్లో దొరుకుంది.
జింక్‌: పాలకూర, గుమ్మడి గింజల్లో, గోధుమ, పప్పుదినుసుల్లో లభిస్తుంది.
ప్రొటీన్‌: పప్పు, గుడ్లు, పాలు, చికెన్‌, మాంసాలు అందిస్తాయి.

చెమటకాయలుంటే...
వేసవికాలంలో చర్మాన్ని బాగా ఇబ్బందిపెట్టేవి చెమటకాయలు. వ్యాయామం చేసి స్నానం చేయకపోయినా ఇవి వస్తాయి.
* స్నానం చేసిన తర్వాత పౌడర్‌ రాసుకోవాలి. కేలమిన్‌ లోషన్‌ను రెండు, మూడుసార్లు రాస్తే తగ్గడానికి అవకాశం ఉంది.
* చల్లటి నీటిలో తువ్వాలును ముంచి, నీళ్లు లేకుండా పిండి దాంతో తుడవచ్చు. కలబంద జెల్‌ కూడా రాయొచ్చు.
* మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ని సంప్రదించి మందులు వాడాలి.
* చెమటకు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. అందుకని రెండు పూటలా స్నానం చేసి పొడిగా తుడుచుకుని పౌడర్‌ రాసుకోవాలి.


ఇలా చేయండి:

ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి నెయిల్‌ పాలిష్‌, లిప్‌స్టిక్‌లకు విరామం ఇవ్వండి. లేకపోతే గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. గోళ్లను శుభ్రంచేసుకుని చక్కగా కట్‌ చేసుకోవాలి. మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి.
* లిప్‌స్టిక్‌ వేసుకోకుండా వైట్‌ పెట్రోలియం జెల్లీ, ఆలివ్‌ నూనె, బాదంనూనె, పాలమీగడ పెదాలకు రాసుకోవచ్చు.
* పాలల్లో కొద్దిగా తేనె కలిపి పెదవులకు రాయడం వల్ల పొడిబారకుండా ఉంటాయి.
* లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీ ఉంటుంది కాబట్టి మేకప్‌ బ్రష్‌లు శుభ్రం చేసుకోవచ్చు. చాలామంది వీటిని ఎంతో కాలంగా వాడుతున్నా శుభ్రం చేయరు. దీనివల్ల బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు, చర్మ సంబంధ ఎలర్జీలు వస్తాయి. గోరువెచ్చని నీటిలో బ్రష్‌లను నానబెట్టి శుభ్రం చేసుకుని నీళ్లు పిండేయాలి. తర్వాత తువ్వాలుతో తుడుచుకోవాలి.


డా।। శైలజ సూరపనేని
కాస్మెటిక్‌ స్కిన్‌కేర్‌ ఫిజీషియన్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని