మధుకొవిడ్‌!
close
Published : 05/05/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధుకొవిడ్‌!

కొవిడ్‌-19 మధుమేహుల పాలిట పెను శాపంగా మారుతోంది. వీరికి వైరస్‌ సోకే ముప్పు ఎక్కువగా ఉండటమే కాదు, సమస్య మరింత తీవ్రంగానూ వేధిస్తోంది. కొవిడ్‌ బారినపడుతున్నవారిలో ఆరో వంతు మంది, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్నవారిలో దాదాపు సగం మంది మధుమేహులు కావటమే దీనికి నిదర్శనం. అంతేకాదు.. ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిలో కొత్తగా మధుమేహం మొదలవుతుండటం, అదీ తీవ్రదశలో ఉంటుండటం మరింత కలవరపరుస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు దీనిపై విశేషంగా దృష్టి సారించారు. వివిధ దేశాల అనుభవాలను విశ్లేషించి కొంగొత్త సంగతులను గుర్తిస్తున్నారు. కొవిడ్‌కు చికిత్స చేసేటప్పుడు మధుమేహ మందుల పనితీరును, వాటితో తలెత్తే అనర్థాలనూ గుర్తిస్తున్నారు. మందుల వాడకంలో జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌19-మధుమేహం-మందులపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

న్‌ఫెక్షన్లు ఏవైనా మధుమేహులకు చిక్కులు తెచ్చిపెట్టేవే. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో న్యుమోనియా, రక్తంలోకి ఇన్‌ఫెక్షన్‌ త్వరగా వ్యాపించటం వంటి సమస్యలకు ప్రధాన కారణం మధుమేహమే. కరోనా వైరస్‌ తరగతికే చెందిన సార్స్‌, మెర్స్‌ బాధితుల్లోనూ జబ్బు తీవ్రతకు, మరణాలకు మధుమేహమే ప్రధానంగా దోహదం చేసినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్‌-19లోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తోంది. మధుమేహం లేనివారితో పోలిస్తే మధుమేహుల్లో కొవిడ్‌ మరణాలు రెండింతలు ఎక్కువగానూ సంభవిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం మధుమేహుల్లో రోగనిరోధకశక్తి తగ్గటం, అదే సమయంలో అస్తవ్యస్తం కావటం. మధుమేహుల్లో తెల్లరక్తకణాల్లో భాగమైన టి లింఫ్‌ కణాలు (సీడీ4, సీడీ8), నూట్రోఫిల్స్‌ సంఖ్య తక్కువగా ఉండటం ఒంట్లోకి వైరస్‌ ప్రవేశించే ముప్పు పెరగటానికి దోహదం చేస్తోంది. మరోవైపు ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డప్పుడు రక్షణ వ్యవస్థ అవసరానికి మించి స్పందించటమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సీఆర్‌పీ, ఫెర్రిటిన్‌, డీడైమర్‌, ఐఎల్‌ 2, ఐఎల్‌6, ఐఎల్‌10, టీఎన్‌ఎఫ్‌ లాంటి సైటోకైన్లు పెద్దఎత్తున ఉత్పత్తయ్యి, ఉప్పెనలా విరుచుకుపడటం కరోనా జబ్బు దుష్ప్రభావాలు తీవ్రం కావటానికి దోహదం చేస్తోంది. సైటోకైన్ల ఉప్పెనతో ఊపిరితిత్తుల కణజాలం ఉబ్బిపోవటం, గట్టిపడటం, మొత్తంగా శ్వాస ప్రక్రియే దెబ్బతినటం ప్రాణాల మీదికి తెస్తోంది.

ఏంటీ సంబంధం?

కొత్త కరోనా జబ్బుకు మధుమేహం ముప్పు, తీవ్రతకు ఏంటీ సంబంధం? ఇందులో రెండు యంత్రాంగాలు కీలకపాత్ర పోషిస్తున్నట్టు బయటపడింది. ఒకటి- కరోనా వైరస్‌ మన కణాల్లోకి ప్రవేశించటానికి రక్తపోటు, జీవక్రియలు, వాపు ప్రక్రియల్లో పాలు పంచుకునే ప్రొటీన్ల వ్యవస్థను అధీనంలోకి తెచ్చుకోవటం. కరోనా వైరస్‌ మీదుండే ముళ్లలాంటి ప్రొటీన్‌ భాగాలు యాంజియోటెన్సిన్‌-కన్వర్టింగ్‌-ఎంజైమ్‌2 (ఏసీఈ2) గ్రాహకాలకు అతుక్కుపోవటం ద్వారానే కణాల్లోకి ప్రవేశిస్తోంది. ఉన్నట్టుండి గ్లూకోజు మోతాదులు పెరగటం వల్ల ఏసీఈ2 పనితీరు అస్తవ్యస్తం కావటమే ఇందుకు మార్గం సుగమమం చేస్తోంది. ఇక దీర్ఘకాలంగా గ్లూకోజు ఎక్కువగా ఉన్నవారిలో ఏసీఈ2 పనితీరు మందగిస్తుంది. ఇది వాపు ప్రక్రియకు, వైరస్‌ విజృంభించటానికి దోహదం చేస్తుంది. రెండు- గ్లూకోజు, ఇన్సులిన్‌ జీవక్రియల్లో పాలు పంచుకునే డైపెప్టిడైల్‌ పెప్టిడేజ్‌-4(డీపీపీ4)ను కరోనా వైరస్‌ తనకు అనుకూలంగా వాడుకోవటం. గతంలో సార్స్‌, మెర్స్‌ వైరస్‌లు దీని ద్వారానే ఒంట్లోకి ప్రవేశిస్తున్నట్టు తేలటం గమనార్హం. డీపీపీ4 గ్లూకోజు మోతాదులు పెరగటానికే కాదు, వాపు ప్రక్రియ ఎక్కువ కావటానికీ దోహదం చేస్తుంది. కొవిడ్‌ బారినపడ్డవారిలో సైటోకైన్ల ఉప్పెన మూలంగానే తీవ్ర అనర్థాలు సంభవిస్తుండటం చూస్తున్నదే.

కొత్తగా మధుమేహం కూడా..

కొత్త కరోనా వైరస్‌ పాంక్రియాస్‌లోని బి కణాలనూ నేరుగా దెబ్బతీస్తుంది. దీంతో ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గిపోతుంది. కొత్తగా మధుమేహం పుట్టుకొస్తుంది. చాలామందిలో ఆసుపత్రికి వచ్చేసరికే కీటోన్స్‌ అనే ఆమ్ల పదార్థాలు ప్రమాదకర స్థాయిలో ఉంటున్నట్టు ఇటలీ అనుభవాలు చెబుతున్నాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌లో ఇన్సులిన్‌ చాలా ఎక్కువగా అవసరపడుతుండటమూ గమనార్హం. అంటే అప్పటికే ఇన్సులిన్‌ నిరోధకత తీవ్రంగానూ ఉంటోందన్నమాట. అందుకే మధుమేహం లేనివాళ్లు వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడితే కొత్తగా మధుమేహం ఆరంభమైందా అన్నదీ చూడటం తప్పనిసరి.

మందులతో కాస్త జాగ్రత్త!

మధుమేహుల్లో చాలామంది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతోనూ బాధపడుతుంటారు. కరోనా జబ్బు నివారణకు మందులతో గ్లూకోజును అదుపులో ఉంచుకోవటమే కాదు. రక్తపోటు, కొలెస్ట్రాల్‌నూ కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవటమూ ముఖ్యమే. ఇక కరోనా జబ్బు బారినపడినా, కరోనా అనుమానిత లక్షణాలున్నా మధుమేహ మందుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే కొన్ని మందులు కిడ్నీల పనితీరుపై విపరీత ప్రభావం చూపొచ్ఛు● సల్ఫనైల్‌ యూరియా మందులు: ఎక్కువగా వాడేవి ఇవే. వీటితో గ్లూకోజు మోతాదులు మరీ పడిపోతాయి. కొవిడ్‌ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాల్సిన స్థితిలో ఉంటే వీటిని వేసుకోకూడదు.

మెట్‌ఫార్మిన్‌: ఇది వైరల్‌ ఇన్‌ఫెక్షన్లలో వాపు ప్రక్రియను తగ్గిస్తుంది. సార్స్‌, మెర్స్‌, హెపటైటిస్‌, హెచ్‌ఐవీ లాంటి ఇన్‌ఫెక్షన్లతో ఆసుపత్రుల్లో చేరినవారికిది ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాల్లో గుర్తించారు. మధుమేహుల్లో దాదాపు అంతా దీన్ని వాడేవారే. కాకపోతే దీంతో ఒంట్లో నీటిశాతం తగ్గే అవకాశముంది. అందువల్ల కొవిడ్‌కు చికిత్స తీసుకునే సమయంలో కిడ్నీల పనితీరును గమనిస్తూ ఉండటం మంచిది.●

డీపీపీ4 ఇన్‌హిబిటార్స్‌ (గ్లిప్టిన్లు): ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నవి ఇవే. వీటితో వచ్చే నష్టాలేవీ లేవు. కాకపోతే ఒంట్లో నీటిశాతం తగ్గొచ్ఛు ఇది తీవ్రమైతే కిడ్నీ వైఫల్యానికి దారితీయొచ్ఛు ఇలాంటి ముప్పును గమనిస్తే గ్లిప్టిన్లు ఆపేయటం మంచిది.

ఎస్‌జీఎల్‌టీ ఇన్‌హిబిటార్స్‌ (గ్లిఫ్లోజిన్లు): వీటితో రక్తం పరిమాణం తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజు అంత ఎక్కువగా లేకపోయినా కూడా కీటోసిస్‌ రావొచ్ఛు కొవిడ్‌కు చికిత్స తీసుకునేటప్పుడు వీటిని వాడకపోవటమే మంచిది. కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండటం తప్పనిసరి.

జీఎల్‌పీ రిసెప్టర్‌ ఎగోనిస్ట్స్‌ (గ్లుటైడ్లు): ఇవి వాపు ప్రక్రియను తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడకుండా చేస్తాయి. సైటోకైన్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల పనితీరును సంరక్షిస్తాయి. ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినకుండా కాపాడతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకుంటూ వీటిని కొనసాగించాల్సి ఉంటుంది.

ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు: ఇవి గ్లూకోజును అదుపులో ఉంచటంతో పాటు వాపు ప్రక్రియనూ తగ్గిస్తాయి. సైటోకైన్ల ఉప్పెన తలెత్తకుండా చూస్తాయి. తీవ్ర సమస్యతో ఆసుపత్రుల్లో చేరినవారికి గ్లూకోజు నియంత్రణకు ఇన్సులిన్‌ తప్ప మరేదీ ఇవ్వకూడదు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని