పండుటాకులు  భద్రం!
close
Updated : 05/05/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పండుటాకులు  భద్రం!

వృద్ధులూ పిల్లల వంటివారే. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే. కొత్త కరోనా జబ్బు విజృంభిస్తున్నవేళ ఇది మరింత ముఖ్యం. వృద్దులకు జబ్బు ముప్పే కాదు, తీవ్రతా ఎక్కువగా ఉంటుండటమే దీనికి కారణం. కొత్త కరోనా వైరస్‌ బారినపడుతున్న వారిలో వయసు మీద పడ్డవారే ఎక్కువ. వీరిలో మరణాలూ అధికంగానే ఉంటున్నాయి. అందుకే దీనికి కారణమేంటో, నివారణ ఎలాగో తెలుసుకొని ఉండటం అత్యవసరం.

కొత్త కరోనా వైరస్‌ సార్స్‌, మెర్స్‌లాంటి ఇతర కరోనా వైరస్‌లంత ప్రాణాంతకమైనది కాకపోవచ్ఛు చాలామందికి పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్ఛు కానీ మనుషుల నుంచి మనుషులకు త్వరగా, వేగంగా వ్యాపిస్తుంది. కొందరిలో న్యుమోనియా, ఊపిరితిత్తుల వైఫల్యం వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. ఇవే వృద్ధుల పాలిట పెను శాపంగా మారుతున్నాయి. నిజానికి కరోనా వైరస్‌కు చిన్నా పెద్దా తేడా లేదు. అన్ని వయసుల వారికీ సోకుతుంది. కాకపోతే వృద్ధులకు తేలికగా అంటుకుంటోంది. ఇంకాస్త ఎక్కువగానూ ఇబ్బంది పెడుతోంది. వయసుతో పాటు తలెత్తే మార్పులు, బలహీనత, ఇతరత్రా సమస్యల వంటివన్నీ వీరికి ముప్పును పెంచుతున్నాయి. మిగతా వాళ్ల కన్నా ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావటం, త్వరగా కోలుకోకపోవటం, జబ్బు త్వరగా ముదురుతుండటం వంటివన్నీ సమస్య తీవ్రమయ్యేలా చేస్తున్నాయి. అందుకే అంత కలవరం. కాబట్టే తగు జాగ్రత్తలు అవసరం.

వయసుకూ మరణాలకూ ..

కరోనా జబ్బు బాధితుల్లో మరణాలకూ వయసుకూ ప్రత్యక్ష సంబంధం కనిపిస్తోంది. అరవై ఏళ్లు దాటిన తర్వాత మరణించే ముప్పు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 60-69 ఏళ్ల వారిలో మరణాల శాతం 3.6 కాగా 70-79 ఏళ్ల వృద్ధుల్లో ఇది 8%, 80 ఏళ్లు దాటితే 15 శాతానికి పెరుగుతుండటం గమనార్హం. కరోనా మూలంగా వృద్ధుల్లో ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినే ముప్పు ఎక్కువ. సహజంగానే వయసు మీద పడుతున్నకొద్దీ ఊపిరితిత్తులు సాగే గుణం తగ్గుతూ వస్తుంది. ఇక వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ దాడిచేస్తే అగ్నికి ఆజ్యం తోడైనట్టే అవుతుంది. ఇతర వైరస్‌ల మాదిరిగానే కరోనా సైతం గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని మూలంగానే ఎంతోమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటికే గుండెజబ్బులు ఉన్నట్టయితే మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వృద్ధుల్లో చాలామంది గుండెజబ్బులతో బాధపడుతుండటం చూస్తున్నదే. మరోవైపు న్యుమోనియా లేకపోయినా చాలామంది మృత్యువాత పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా కరోనా వైరస్‌ శరీరాన్ని పలు విధాలుగా తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేసి పండుటాకులకు మరింత ప్రాణాపాయాన్ని మోసుకొస్తోందన్నమాట.

లక్షణాలు భిన్నం

కరోనా జబ్బు ప్రధాన లక్షణాలు జ్వరం, విడవకుండా దగ్గు, ఆయాసం. వృద్ధుల్లో ఇవి అంత స్పష్టంగా కనిపించకపోవచ్ఛు దీనికి ప్రధాన కారణం వయసుతో పాటు రోగనిరోధక శక్తి తగ్గటం. వృద్ధుల్లో జ్వరం అంతగా.. ఆ మాటకొస్తే కొందరిలో అసలే ఉండకపోవచ్ఛు త్వరగా అలసిపోవటం, ఆకలి తగ్గటం, అతిగా తికమక పడటం, ఏకాగ్రత కొరవడటం, తూలిపోతుండటం వంటివి కనిపిస్తుండొచ్ఛు కుటుంబ సభ్యులు ఇలాంటి లక్షణాలను గమనిస్తే నిర్లక్ష్యం చేయటం తగదు. వయసుతో పాటు తలెత్తే బలహీనతగా, మార్పులుగా భావించొద్ధు ఏమాత్రం అనుమానమున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కన్నా ఏమాత్రం ఎక్కువగా ఉన్నా జ్వరంగానే భావించాలి. స్వయంచాలిత ప్రతిస్పందనలు క్షీణించటం వల్ల దగ్గు సైతం అంతగా రాకపోవచ్ఛు కొందరిలో దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు సీవోపీడీ లాంటి ఇతర సమస్యలుగా పొరపడేలా చేయొచ్ఛు వృద్ధుల విషయంలో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జబ్బును అనుమానించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు వీటి గురించి తెలుసుకొని ఉండటం ఎంతైనా మంచిది.

ఇంట్లో వృద్ధులుంటే..

ఇంట్లో వృద్ధులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్తగా ఉండాలి. చాదస్తం కొద్దో, మతిమరుపుతోనో కొందరు చెప్పిన మాటలను పట్టించుకోకపోవచ్ఛు అలాగని నిర్లక్ష్యం చేయొద్ధు కసురు కోవద్ధు ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధులను చిన్న పిల్లల మాదిరిగానే పరిగణించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సోడియం హైపోక్లోరైట్‌ కలిపిన నీటితో బల్లలు, తలుపులు, గొళ్లాలను, బాత్రూమ్‌లను, గదులను, పరిసరాలను శుభ్రపరచుకోవాలి. వృద్ధుల దుస్తులను ఇతరుల దుస్తులతో కలపరాదు. ఇతరుల తువ్వాళ్లు, రుమాళ్లను వృద్ధులు వాడకుండా చూసుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బుల వంటి వాటికి వేసుకునే మందులు నిండుకోకముందే తెచ్చిపెట్టాలి. ఆయాసం, ఛాతీలో నొప్పి లేదా ఏదో నొక్కుతున్నట్టు అనిపించటం, తికమకపడిపోతుండటం, పెదాలు లేదా ముఖం నల్లగా అవుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించాలి.

ఒంటరి భావన రానీయొద్దు

ఇంట్లో అంతా దూరం దూరంగా ఉంటుంటే.. మనవలు, మనవరాళ్లను ముద్దాడకపోతుంటే.. బంధుమిత్రులు కలవటానికి రాకపోతుంటే వృద్ధులను ఒంటరితనం వేధించే అవకాశముంది. అలాంటి భావన రానీయొద్ధు ఇది వైరస్‌ అంటకుండా చూసుకునే ప్రయత్నమే తప్ప మరోటి కాదని వారు గ్రహించేలా వివరించి చెప్పాలి. ఇలా ఉండేది కొన్ని రోజులేనని, మున్ముందు ఎప్పటిలా అంతా కలివిడిగా ఉండొచ్చని తెలియజేయాలి. అదృష్టం కొద్దీ ఇప్పుడు మొబైల్‌ఫోన్ల వంటివి విరివిగా అందుబాటులో ఉన్నాయి. వీలైనప్పుడల్లా మిత్రులతో, బంధువులతో మాట్లాడించాలి. వీడియో కాల్స్‌ అయితే ఇంకా మంచిది. వృద్ధులకు ఇష్టమైన టీవీ కార్యక్రమాలు, సినిమాలు చూడనివ్వాలి. వీటితో కాలక్షేపం అవటమే కాదు, మనసూ తేలికవుతుంది. వీలుంటే కొత్త హాబీలు అలవరుచుకునేలా ప్రోత్సహించాలి. కథలనూ చదివించొచ్ఛు ఇప్పుడు కథలను వినిపించే యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పనులతో వృద్ధులు విసుగు చెందకుండా చూసుకోవచ్ఛు

స్వీయ రక్షణే కీలకం

ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉంటున్నా ఎవరి పనులు వారికుంటాయి. అన్నిసార్లూ వృద్ధులను కనిపెట్టుకోవాలంటే కుదరకపోవచ్ఛు అందువల్ల ఓపిక ఉన్నంతవరకు ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. ఇప్పుడు అందరికి కావాల్సింది స్వీయరక్షణే. దిగ్బంధం తొలగించిన తర్వాతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంట్లోనే ఉండటం ఉత్తమం. జనం గుమిగూడే చోట్లకు అసలే వెళ్లకూడదు.

చొరవ తీసుకొని కబుర్లు చెప్పటానికి ఎవరింటికీ వెళ్లొద్ధు అలాగే అవతలి వారిని కూడా ప్రస్తుతానికి రాకుండా చూడాలి.

ఇతరులతో కరచాలనం చేయొద్ధు ఒకరిని ఒకరు హత్తుకోవద్ధు మన సంప్రదాయ నమస్కార అలవాటు మంచిది.

ఇంటికి ఎవరైనా వస్తే కలవకపోవటం మంచిది. ముఖ్యంగా జ్వరం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు గలవారికి దూరంగా ఉండాలి.

తుమ్మినా, దగ్గినా తుంపర్లు మీటరు దూరం వరకూ ప్రసరిస్తాయి. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్లినా, వారికి కనీసం మీటరు దూరంలో ఉండాలి. రెండు మీటర్ల దూరంలో ఉంటే ఇంకా మంచిది.

దగ్గినా, తుమ్మినా ముక్కుకు నోటికి రుమాలు లేదా టిష్యూ పేపర్‌ అడ్డం పెట్టుకోవాలి. టిష్యూ పేపర్‌ను మూత ఉన్న చెత్త బుట్టలో వేయాలి. చేతి రుమాలును రోజూ ఉతకాలి. తుమ్ములు, దగ్గు వస్తున్నప్పుడు రుమాలు అందుబాటులో లేకపోతే మోచేతి మధ్యభాగాన్నైనా అడ్డం పెట్టుకోవాలి.

తరచూ చేతులను, ముఖాన్ని సబ్బుతో రుద్ది కడుక్కోవాలి. చేతుల శుభ్రతకు వీలుంటే ఆల్కహాలుతో కూడిన శానిటైజర్లు రాసుకోవచ్ఛు

ఇంట్లోనే వండిన సమతులాహారం తీసుకోవాలి. తరచూ నీరు తాగుతూ ఒంట్లో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. తాజా పండ్ల రసాలు తాగటం మంచిది. దీంతో రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్ఛు

బయటి నుంచి ఇంటికి వస్తే వెంటనే ధరించిన దుస్తులు విప్పేసి, స్నానం చేసి ఇంట్లోకి రావాలి.

ఏది ముట్టుకున్నా, ఎవరిని తాకినా ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకకూడదు.

కరోనా సమాచారాన్ని తెలుసుకోవటం మంచిదే గానీ అదేపనిగా దాని గురించి ఆలోచించటం తగదు. ఇది ఒత్తిడికి, దిగులుకు దారితీస్తుంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో కరోనా వివరాలను చూడటం, చదవటం, వినటం తగ్గించుకోవాలి.

ప్రాణాయామం వంటి గాఢంగా శ్వాస తీసుకునే వ్యాయామాలు చేయాలి. ధ్యానం చేయటం మంచిది. వ్యాయామం మానరాదు. కంటి నిండా నిద్రపోవాలి. సమతులాహారం తీసుకోవాలి. మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. సిగరెట్ల జోలికి అసలే వెళ్లరాదు.

రోజువారీ మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి. అనవసరంగా ఆసుపత్రులకు వెళ్లకూడదు. వీలైనంతవరకు ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని