బుజ్జాయిల మేలుకోరి..
close
Published : 16/06/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుజ్జాయిల మేలుకోరి..

కెరీర్‌ గ్రాఫ్‌ పైపైకి దూసుకుపోతున్న సమయంలో పెళ్లి, పిల్లలు వంటి బాధ్యతలతో ఉద్యోగానికి బ్రేక్‌పడింది. విరామం తీసుకోవాల్సి వచ్చింది. దాంతో కెరీర్‌ ముగిసిపోయిందని అనుకోలేదు వాళ్లు. తమకు ఎదురైన పరిస్థితుల నుంచి సామాజిక ప్రయోజనం కలిగించే వ్యాపార సంస్థలకు జీవం పోశారు. పసిపిల్లలకు హానిచేయని వ్యక్తిగత ఉత్పత్తులని అందిస్తూ శీతల్‌కాబ్రా వ్యాపారిగా నిలబడితే.. పర్యావరణానికి హానిచేయని సేంద్రియ న్యాప్కిన్లని తయారుచేస్తున్నారు అరుణ.

పసి పిల్లల కోసం వాడే షాంపూ దగ్గర నుంచి పౌడర్‌ వరకు ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటాం. నాణ్యతతో ఏమాత్రం రాజీపడాలని అనుకోం. తల్లిదండ్రులకు ఆ చింత లేకుండా బుజ్జాయిల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న ఉత్పత్తులివి...

మాది హైదరాబాద్‌. మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, ఆపై కంపెనీ సెక్రటరీస్‌ పూర్తిచేశా. కార్పొరేట్‌ సంస్థలో తొమ్మిదేళ్ల పాటు పనిచేశా. గర్భం దాల్చాక ఉద్యోగాన్ని వదిలేశా. పాప పుట్టిన తర్వాత తనకు ఎటువంటి రసాయనాలు వాడని షాంపూ, సబ్బులు వంటివి వాడాలనుకున్నా. పసిపిల్లల ఆరోగ్యంతో రాజీపడలేం కదా! మార్కెట్‌లో వెతికితే అలాంటి ఉత్పత్తులు చాలా తక్కువ ఉన్నాయి. చివరికి... వాటిని నేనే సొంతంగా ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అందుకోసం మొదట్లో కొన్ని క్లాసులకు హాజరయ్యా. తరువాత ఆయుర్వేద నిపుణుల సహకారంతో వాటి తయారీ ప్రారంభించా. కొన్ని నెలలు ప్రయోగాలు చేశాం. అనుకున్న ఫలితాలు వచ్చాక ఆయుష్‌ నుంచి మాన్యుఫాక్చరింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నా. మాయిశ్చరైజర్లు, సబ్బులు, పౌడర్‌ వంటి వస్తువుల్ని రసాయనాలు, నిల్వకారకాలు లేకుండా తయారుచేయడం ప్రారంభించా. ఇవన్నీ మా వెబ్‌సైట్‌ ఎర్తీసాపో.కామ్‌తో పాటు అమెజాన్‌, ఫస్ట్‌క్రై వంటి వివిధ ఈ కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ లభిస్తున్నాయి. మరి ఇబ్బందులేం లేవా అంటారా? ఎందుకు లేవు. ఉన్నాయి. అసలు సిసలు సేంద్రియ ఉత్పత్తులను రైతుల నుంచి సేకరించడం నేను ఎదుర్కొన్న పెద్ద సవాలు. ఏడాదిన్నర పాపని ఒళ్లో పెట్టుకుని సంస్థని విస్తరించడానికి చాలా కష్టపడ్డాను. కష్టం ఎంతైనా ఎంతో మంది పసిపిల్లలకు మా ఉత్పత్తులు చేరాలన్నదే నా లక్ష్యం. కేవలం చిన్నారులకే కాకుండా పెద్దవారికీ మా దగ్గర మాయిశ్చరైజర్‌లు, ఇంటికి ఉపయోగించే డిటర్జెంట్‌లు, హెయిర్‌ డైలు వంటివన్నీ దొరుకుతాయి.


భూమితో దోస్తీ చేసి..

నెలసరి సమయంలో ఉపయోగించే సింథటిక్‌ శానిటరీ న్యాప్కిన్ల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు నన్ను ఆలోచనలో పడేశాయి. అవి వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు పర్యావరణానికీ చేటే. ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనే అప్నాగ్రీన్స్‌...

నా విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఎంబీఏ పూర్తి చేశాక కొన్నాళ్లు కార్పొరేట్‌ రంగంలో పనిచేశా. పెళ్లి, పిల్లలతో నా కెరీర్‌కి బ్రేక్‌ పడింది. ఇప్పుడు వాళ్ల పనులు వాళ్లే చేసుకుంటున్నారు. ఈ తీరిక సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు సింథటిక్‌ న్యాప్కిన్ల వల్ల వచ్చే ఇబ్బందుల గురించి తెలిసింది. వాటితో ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలే కాదు...పర్యావరణానికీ హానే. ఇవి భూమిలో త్వరగా కలిసిపోవు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచిస్తున్నప్పుడు పర్యావరణానికి మేలుచేసే సేంద్రియ న్యాప్కిన్ల గురించి తెలిసింది. రసాయనాలు వాడకుండా... అరటి, వెదురునార, చెక్కగుజ్జు వంటి సహజ ముడిసరకుతో వీటిని చేయడం నేర్చుకున్నాను. వీటి తయారీకోసం ప్రత్యేకించి ఓ యంత్రాన్ని సొంతంగా తయారు చేయించుకున్నా. ఇద్దరితో మొదలై ప్రస్తుతం పదిమంది ఉద్యోగులతో మా సంస్థ నడుస్తోంది. చెక్కగుజ్జుని కొవిడ్‌ ముందు వరకూ చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్‌ కాటన్‌ని వాడుతున్నా. ఇక వెదురునారని అసోం, మహారాష్ట్రల నుంచి తెప్పించుకుంటా.ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో అరటి నారని కొనుగోలు చేస్తున్నాం.

నెలసరి పరిశుభ్రత, ప్యాడ్ల వాడకం విషయంలో నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవారికీ నిర్లక్ష్యం ఎక్కువే. అందుకే కాలేజీ విద్యార్థినులతో కలిసి ‘డొనేట్‌ ఎ ప్యాడ్‌’ క్యాంపెయిన్‌ చేశాం. గూంజ్‌, స్పందన వంటి ఎన్జీవోలతో కలిసి పనిచేస్తున్నాం. అరబిందో, సురక్షా ఫార్మా వంటి కొన్ని ప్రముఖ సంస్థలు తమ సీఎస్‌ఆర్‌ కార్యక్రమల కోసం మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. సంస్థ ప్రారంభించిన కొద్దికాలంలోనే ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. సిడ్బీ సంస్థ ఉత్తమ ఉత్పత్తిగా గుర్తించి సత్కరించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని