పీపీఈ కిట్‌ వ్యర్థాలనే.. దుప్పట్లుగా మార్చేసింది!
close
Published : 17/08/2020 00:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పీపీఈ కిట్‌ వ్యర్థాలనే.. దుప్పట్లుగా మార్చేసింది!

గొప్పతనం అనేది మన దగ్గర ఉన్నదానితో కాదు...మనం ఇచ్చేదానితో వస్తుంది అంటారు లక్ష్మీమేనన్‌. కేరళలోని కొచ్చికి చెందిన ఈ సామాజిక వ్యాపారవేత్త ఇప్పటికే పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతే లక్ష్యంగా వినూత్న ఆవిష్కరణలతో తనదైన ముద్ర వేశారు. తాజాగా కేరళలోని కొవిడ్‌-19 పేషెంట్లకోసం పీపీఈ కిట్ల స్క్రాప్‌తో దుప్పట్లు తయారు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

మనదేశంలో రాత్రిపూట ఏ మూల నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయండి. ఎందరో నిరాశ్రయులు ఫుట్‌పాత్‌లు, బస్టాండుల్లో చలికి వణికిపోతూ నేలపై పడుకోవడం కనిపిస్తుంది. వారికేదైనా పరిష్కారం చూపించాలని ఆలోచించే సమయంలోనే టైలరింగ్‌ యూనిట్లలో పెద్ద ఎత్తున రద్దు మిగిలిపోవడం కనిపించింది. దాంతో వాటిని బెడ్‌రోల్స్‌గా, దిండ్లుగా మార్ఛి.. నిరాశ్రయులకు ఉచితంగా పంపిణీ చేసే దిశగా ‘ప్యూర్‌లివింగ్‌’ పేరుతో ఈ సోషల్‌ ప్రాజెక్టుని ఎంపిక చేసుకున్నారామె. దీని ద్వారా వృద్ధులైన మహిళలకు ఉపాధి కల్పించారు. అయితే ఇది ప్రారంభించిన కొద్ది రోజులకే కొవిడ్‌ విజృంభణ మొదలయ్యింది.

దుప్పట్ల కొరతతో

కేసులు పెరగడంతో ప్రభుత్వం ప్రతి పంచాయతీలోనూ యాభై పడకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనివల్ల మంచాలు, దుప్పట్లు, దిండ్లు ఇతర నిత్యావసరాలకు డిమాండ్‌ పెరిగింది. ప్రతి అవసరం ఓ ఆవిష్కరణకు దారి తీస్తుందంటారు లక్ష్మి. ‘కొచ్చిలోని పరిస్థితులు...బాధితుల సౌకర్యార్థం ఏమైనా చేయగలమా అని ఆలోచించాను. స్థానిక నాయకురాలిని నేను మీకేమైనా సాయం చేయగలనా అని అడిగా. ఆమె దుప్పట్లు లేవని, ప్రజలు విరాళాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరనీ చెప్పారు’. దాంతో వాటినే అందించాలనుకున్నా అంటారామె. లక్ష్మి టైలరింగ్‌ యూనిట్లతో మాట్లాడినప్పుడు వారు తమ వ్యాపారం మందగించిందనీ, ఇప్పుడు తామంతా పీపీఈ కిట్లు తయారు చేస్తున్నామన్నారు. వాటిల్లో ఓ సంస్థ పీపీఈ కిట్‌ స్క్రాప్‌ పంపించడానికి అంగీకరించింది. ఆ రద్దుతో బెడ్‌షీట్‌లు తయారు చేయాలనుకున్నారు లక్ష్మి. ఈ మెటీరియల్‌ తేలిగ్గా, వాటర్‌ఫ్రూప్‌ తరహాలో ఉండటం వల్ల ఆమె ఆలోచన విజయవంతం అయ్యింది. లక్ష్మి ఆలోచన గుర్తించిన ఓ ప్రముఖ సంస్థ వాయనాడ్‌, ఎర్నాకుళం కొవిడ్‌ కేంద్రాలకు సాయం చేసేందుకు దుప్పట్లు ఇవ్వమంటూ ఆర్డరు ఇచ్చింది. దాంతో తన ఇంటినే ఉత్పత్తి కేంద్రంగా మార్చేసింది లక్ష్మీమేనన్‌. ఈ దుప్పట్ల తయారీవల్ల వ్యర్థాల నిర్వహణతోపాటూ ఉపాధికల్పన, సంపద సృష్టి చేయగలిగారు ఆమె. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అసోం, బిహార్‌, కోల్‌కతా, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి వీటి తయారీ కోసం చాలామంది ఆసక్తి చూపించడంతో వారికి తనవంతు సాయం అందిస్తున్నారు.


పెద్దలకోసం...

ఎర్నాకుళంలో జన్మించిన లక్ష్మీ మేనన్‌ హోమ్‌సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. కొన్నాళ్లు అమెరికాలో జ్యుయలరీ డిజైనర్‌గా పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఓ సారి బయోడిగ్రేడబుల్‌ పెన్‌ని చూశారు. అది ఆమెపై ఎంతో ప్రభావం చూపించింది. ఇండియాకు వచ్చాక 2012లో ప్యూర్‌లివింగ్‌ పేరుతో సంస్థను ప్రారంభించి.. కాలుష్యాన్ని పెంచే ప్లాస్టిక్‌ పెన్నుల స్థానంలో కాగితాలను రీసైక్లింగ్‌ చేసి సీడ్‌పెన్స్‌ని తయారుచేశారు. ఇవి భూమిలో సులువుగా కలిసిపోతాయి. ఈ పెన్నుల అంచుల్లో భద్రపరిచిన విత్తనాలు మొలకెత్తుతాయి.అంతేకాదు...ఈ సంస్థలో ఉద్యోగులుగా క్యాన్సర్‌ బాధితుల్ని నియమించుకున్నారు. లక్ష్మీ ప్రారంభించిన మరో ప్రాజెక్ట్‌ అమ్మూమ్మతిరి. దీని లక్ష్యం వృద్ధాశ్రమాల్లో ఉండే పెద్దలకు స్వావలంబన అందించడం. అందులో భాగంగా పత్తి ఒత్తులు తయారు చేసే పనిని వారికి అప్పగించారు. 2018లో వరదలు ముంచెత్తినప్పుడు ఆ సంస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది. అయినా ఆమె తన ప్రయత్నం ఆపలేదు. ఆ సమయంలో కూడా మత్స్యకారులకు కృతజ్ఞతలు చెబుతూ సీడ్‌పేపర్స్‌తో బోట్లను తయారు చేసి నీళ్లల్లో పెద్ద ఎత్తున వదిలారామె. కాగితం నానిపోయాక...వాటిల్లోని విత్తనాలు మొక్కలుగా మెలకెత్తుతాయి. అలా పచ్చదనం పరిఢవిల్లుతుందనే ఆశ ఆమెది. కేరళలోని చేనేత గ్రామం అయిన చెండమంగళం వారం పాటు వరదనీటిలో మునిగిపోవడం వల్ల ముడిసరకు అంతా తడిచిపోయింది. ఆ ముడిసరకునే వాడి చేకుట్టి అనే బొమ్మను తయారు చేశారామె. హోప్‌డాల్‌గా పేరొందిన ఈ బొమ్మ ప్రతి ఇంటికీ చేరడం విశేషం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని