తెనాలి తెలివి..
close
Published : 29/08/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెనాలి తెలివి..

ది విజయనగర సామ్రాజ్యం. రాజుగారి కోటకు దగ్గర్లో ఓ గ్రామం. ఆ ఊర్లో ఓ ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఒక రోజున నలుగురు వ్యక్తులు వచ్చి ‘అవ్వా! మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం.. మాకు మీరు ఓ గదిని అద్దెకు ఇస్తే.. కొన్ని రోజులు ఇక్కడే విశ్రాంతి తీసుకుని తర్వాత మళ్లీ మా ప్రయాణం ప్రారంభిస్తాం’అని అన్నారు.

‘మీరు ఇక్కడ ఉండేది కొన్ని రోజులే కదా.. నాకు అద్దె వద్ధు. ఏమీ వద్ధు. మీ భోజనాల వరకు డబ్బులు ఇవ్వండి చాలు’ అని అవ్వ అంది. కొన్ని రోజులు గడిచాక వాళ్లు బంగారు నాణేలతో ఉన్న కుండనొకటి ఆమెకిచ్చారు. ‘అవ్వా.. దీన్ని భద్రంగా చూడాల్సిన బాధ్యత మీదే. మేము నలుగురమూ అడిగితేనే ఈ కుండ మాకు ఇవ్వాలి.’ అని ఆమెతో ప్రమాణం చేయించుకుని కుండ ఇచ్చారు.

ఓ రోజున వాళ్లు తమ గదికి తిరిగి వస్తుండగా దగ్గర్లోనే ఏవో తినుబండారాలు, పండ్లూ కనిపించాయి. ఆ రోజు వాళ్ల దగ్గర నాణేలేమీ లేవు. ‘అవ్వ ఇల్లు దగ్గర్లోనే ఉంది కాబట్టి నేను వెళ్లి ఆ నాణేల కుండ తీసుకు వస్తాను’ అని ఆ నలుగురిలో ఒకడు మిగతా వాళ్లతో అన్నాడు. మిగిలిన ముగ్గురూ సరే అన్నారు. దీంతో ఆ నాలుగో వ్యక్తి వెళ్లి.. అవ్వను ఇవ్వమన్నాడు. ‘ఇతనికి కుండ ఇవ్వవచ్చా’ అని అవ్వ కేక వేసింది. ‘ఆ ఇవ్వవచ్చు’అని ఆ ముగ్గురూ చెప్పారు. వెంటనే ఆమె వచ్చిన వాడికి కుండనిచ్చింది. వాడేమో ఇదే అవకాశమని మెల్లిగా జారుకున్నాడు.

ఎంతసేపటికీ అతడు రాలేదని మిగతా ముగ్గురూ అవ్వవద్దకు వెళ్లి ‘అవ్వా! కుండ ఏది?’ అని అడిగారు. ‘అదేంటి.. నన్ను అడుగుతారు. వచ్చిన వాడికి ఇవ్వమని మీరే అరచి మరీ చెప్పారుగా!’ అంది. దానికి ఆ ముగ్గురూ నానా రభసా చేశారు. ‘ముసలమ్మ దొంగ. మా కష్టార్జితం అంతా కాజేసింది’అని అరవసాగారు. ఈ గొడవకు చుట్టుపక్కల వాళ్లందరూ పోగయ్యారు. అదే సమయంలో తెనాలి రామలింగడు అటుగా వెళ్తూ వీరి గోల విన్నాడు. ‘ఈ అవ్వ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆమె మిమ్మల్ని మోసం చేసి ఉండదు’ అన్నాడు. ఆ ముగ్గురూ ఆయన్ను పోల్చుకోలేకపోయారు. తమకు, అవ్వకు మధ్య జరిగిన ప్రమాణం, షరతుల గురించి చెప్పారు. నలుగురం వస్తేనే ఇవ్వమన్నాం కదా.. ఆమె ఏమో ఇవ్వకుండానే ఇచ్చాను అని అబద్ధం ఆడుతోంది అని ఆ ముగ్గురూ కేకలేశారు.

వెంటనే తెనాలి రామలింగడికి విషయం అర్థమైంది. ‘అవును అవ్వ అబద్ధం ఆడుతోంది. కుండ తన వద్దే ఉంది’ అని రామలింగడు అనగానే... ఆ ముగ్గురు దొంగల మొహాలు వెలిగిపోయాయి. ముసలమ్మకేమో కళ్లవెంబడి నీళ్లు ఉబికి వచ్చాయి. ‘కానీ ఆ కుండ ఇప్పుడు మీకు ఇవ్వడం కుదరదు కాక కుదరదు’ అని అంతలోనే రామలింగడు కుండబద్ధలు కొట్టాడు. ‘అదేంటి.. మాది మాకు కావాల్సిందే’ అని వారు పట్టుబట్టారు. ‘మీ కుండ మీకు కావాల్సిందే అంటే.. ఆ నాలుగో వాడు రావాల్సిందే’ అని రామలింగడు తేల్చేశాడు. ఈ ముగ్గురూ గతుక్కుమన్నారు. ‘అయినా వాడో దొంగవెధవ. వాడు ఎక్కడున్నాడో.. ఎవరికి తెలుసు. మేం ఉన్నాం కదా..’ అని పట్టుబట్టారు.

‘మీలో ఒకడు దొంగైతే.. మీరూ దొంగలే అన్నమాట..’అని రామలింగడు అనగానే వారు తమ బండారం బయటపడిందని పారిపోయే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న భటులు ఆ ముగ్గురినీ బంధించారు. తర్వాత పారిపోయిన ఆ నాలుగో వాడినీ పట్టుకుని బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. తన మీద పడ్డ నింద తొలగిపోయి.. నిజం బయట పడ్డందుకు అవ్వ ఎంతో సంతోషించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని