వ్యాయామంపై కరోనా ఒత్తిడి
close
Updated : 15/09/2020 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వ్యాయామంపై కరోనా ఒత్తిడి

కరోనా జబ్బు వ్యాయామాన్నీ ‘ఒత్తిడి’కి గురిచేస్తోంది! ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పని పరిస్థితి ఇది. సాధారణంగా వ్యాయామంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం మెదడులో హాయిని కలిగించే సెరటోనిన్‌ హార్మోన్‌ విడుదల కావటం. అయితే కరోనా జబ్బుతో తలెత్తే ఒత్తిడి మీద వ్యాయామం అంత ప్రభావమేమీ చూపటం లేదని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. జన్యువులు, పరిసరాలు వ్యాయామ ప్రయోజనాలను తొక్కిపెడుతున్నాయని సూచిస్తోంది. కొవిడ్‌ విజృంభణ మూలంగా ఇంటికే పరిమితమైన కవలల్లో- ఎప్పటి మాదిరిగానే వ్యాయామం చేసినవారితో పోలిస్తే మరింత ఎక్కువగా వ్యాయామం చేసినవారిలో ఒత్తిడి, ఆందోళన తగ్గకపోగా ఇంకాస్త అధికమైంది కూడా. కరోనా భయంతో ఇంటికే పరిమితం కావటం వల్ల ఎంతోమంది వ్యాయామం తగ్గించేస్తున్నారని.. ఇది మానసిక సమస్యలు పెరగటానికి దారితీస్తుందన్నది నిపుణుల భయం. కానీ ఫలితాలు విభిన్నంగా వెలువడటం విచిత్రం. కవలల్లో జన్యువులు దాదాపు ఒకేలా ఉంటాయి. సాధారణంగా ఒకే వాతావరణంలో పెరుగుతారు. అందుకే పరిశోధకులు వ్యాయామం, మానసిక ఆరోగ్యం మీద జన్యువులు, పరిసరాల ప్రభావాలను అర్థం చేసుకోవటానికి కవలలను ఎంచుకున్నారు. ఒత్తిడిని నియంత్రించుకోవటానికి వ్యాయామం కచ్చితంగా తోడ్పడుతుందని చెప్పలేమని.. వ్యాయామానికీ జన్యువులకూ పరిసరాలకూ ఏదో సంబంధం ఉంటోందని అధ్యయన నేత గ్లెన్‌ డంకన్‌ చెబుతున్నారు. అలాగని వ్యాయామం తగ్గించేయటానికీ లేదు. రోజు మాదిరిగానే వ్యాయామం చేసినవారితో పోలిస్తే తగ్గించినవారిలో ఒత్తిడి, ఆందోళన మునుపటి కన్నా పెరిగిపోయాయి మరి. వృద్ధులు, మహిళల్లో ఇవి మరింత ఎక్కువగానూ కనిపించాయి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో భయంతో వ్యాయామం తగ్గించినా, అతి నమ్మకంతో వ్యాయామం పెంచినా పెద్దగా ప్రభావమేమీ ఉండటం లేదన్నమాట. కరోనా ఆంక్షలు, భయం తొలగిన తర్వాత ఇవి మారిపోయే అవకాశముండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.


కచేరీలతోనూ ముప్పే

కరోనా బాధితులు దగ్గినా, తుమ్మినా.. వారికి సన్నిహితంగా మెలిగినా ఇతరులకు వైరస్‌ సోకుతుంది. అంతేకాదు, పాట కచేరీలతోనూ.. ముఖ్యంగా బిగ్గరగా, హల్లులతో కూడిన స్వరాలతో కూడిన పాటలు పాడటంతోనూ వైరస్‌ వ్యాపించే ప్రమాదముంది. బిగ్గరగా పాడేటప్పుడు వెలువడే తుంపర్లు గాలిలో కలిసి చుట్టుపక్కలకు విస్తరిస్తున్నట్టు లుండ్‌ యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. నిజానికి బృందగానాలతో కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నట్టు ఇంతకుముందే బయటపడింది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా వీటిపై కొన్ని ఆంక్షలు విధించారు. అయితే పాడినప్పుడు ఎంత మేరకు తుంపర్లు వెలువడతాయి, ఎంతవరకు విస్తరిస్తాయన్నది శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. ఈ నేపథ్యంలోనే పరిశోధకులు దీనిపై దృష్టి సారించారు. కొవిడ్‌ సోకిన గాయకులను ఇద్దరిని, ఆరోగ్యవంతులైన 12 మంది గాయకులను ఇందుకోసం ఎంచుకున్నారు. శ్వాసిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వివిధ రకాల పాటలు పాడుతున్నప్పుడు, ఫేస్‌మాస్క్‌ ధరించి పాటలు పాడుతున్నప్పుడు.. ఇలా రకరకాల సమయంలో వెలువడే తుంపర్ల తీరు తెన్నులను నిశితంగా పరిశీలించారు. పెద్ద తుంపర్లలో కొన్ని అతి తక్కువ దూరానికే పరిమితమైతే.. సూక్ష్మ తుంపర్లు కొద్ది నిమిషాల వరకూ అక్కడి గాలిలోనే తేలియాడుతున్నట్టు గుర్తించారు. ఎంత బిగ్గరగా పాడితే అంత ఎక్కువగా తుంపర్లు గాల్లో కలుస్తున్నాయి. కొవిడ్‌ బాధిత గాయకులు పాడుతున్నప్పుడు సమీపంలోని గాలిలో గుర్తించేంత స్థాయిలో వైరస్‌ ఏమీ కనిపించలేదు గానీ శ్వాసనాళంలో వైరస్‌ మోతాదులు ఒకో చోట ఒకోలా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే అందరిలోనూ వైరస్‌ సంఖ్య ఒకేలా ఉండాలనేమీ లేదని గుర్తుచేస్తున్నారు. తుంపర్ల వ్యాపించే దూరాన్ని పరిగణనలోకి తీసుకొని చూస్తే- కొవిడ్‌ బాధిత గాయకులు పాడేటప్పుడు వెలువడే తుంపర్లతో ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అలాగని పాట కచేరీలను పూర్తిగా ఆపెయ్యాల్సిన అవసరం లేదని, తగు జాగ్రత్తలతో వైరస్‌ వ్యాపించే ముప్పును తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని