కొనుగోలుదారుల మనసు తెలుసుకునేలా!
close
Updated : 03/10/2020 05:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనుగోలుదారుల మనసు తెలుసుకునేలా!

భవిష్యత్తుపై స్థిరాస్తి రంగం అంచనాలు

ఈనాడు, హైదరాబాద్‌

ప్రతి రంగం కొవిడ్‌కు ముందు.. ఆ తర్వాత అన్నంతగా ప్రభావితమైంది. స్థిరాస్తి రంగం దీనికి మినహాయింపేమీ కాదు. కరోనా కుదుపు నుంచి క్రమంగా కోలుకుంటోంది. నిర్మాణ సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల్లో మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఇళ్లను అందించేందుకు బోర్డు రూముల్లో ఆలోచనలు సాగుతున్నాయి. కొనుగోలుదారుల మనసు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అనరాక్‌-ఫిక్కి దీనిపై అధ్యయనం చేసి ఇటీవల ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ రంగంలో భవిష్యత్తులో రాబోయే కొత్త పోకడల గురించి పరిశ్రమ అంచనాలను ప్రస్తావించారు.  
విశాలమైన ఇల్లు..
కొవిడ్‌ లాక్‌డౌన్‌, ఇంటి నుంచే పనిచేయడం, పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలతో కుటుంబ సభ్యులంతా ఎక్కువ సమయం ఇళ్లలోనే ఉంటున్నారు. నివాసం మరింత విశాలంగా ఉంటే బాగుండు అనే భావన ఎక్కువమంది వ్యక్తం చేయడంతో పెద్ద ఇళ్ల వైపు డిమాండ్‌ పెరగనుంది. తమ బడ్జెట్‌లో దొరికేవాటి కోసం కొనుగోలుదారులు శివారు ప్రాంతాలకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నారు. 2.5, 3.5 పడక గదులు వీరికి బాగా సరిపోతాయి. అదనపు స్థలాన్ని కార్యాలయం, పిల్లలకు ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు తగ్గట్టుగా మార్చవచ్చు.

వారాంతంలో గడిపేందుకు..
వారాంతంలో కుటుంబంతో కలిసి ప్రకృతి నడుమ పని ఒత్తిడికి దూరంగా ఉండాలని కోరుకునేవారు పెరుగుతున్నారు. వీరంతా వీకెండ్‌ హోమ్స్‌, వ్యవసాయ క్షేత్రంలోని నివాసాల వైపు చూస్తున్నారు. కొవిడ్‌ సమయంలో భౌతికదూరం పాటించేందుకు, హోం క్వారంటైన్‌లో ఉండేందుకు చాలామంది వీటిలోనే ఆశ్రయం పొందారు. ఇప్పుడు వీటికి మరింత డిమాండ్‌ పెరగనుంది.
స్థలాల వైపు...
బహుళ అంతస్తుల గృహ సముదాయాలతో పోలిస్తే విల్లాలు, వరుసగా కట్టే ఇళ్లలో భౌతిక దూరం సాధ్యమవుతుంది. కాబట్టి ప్లాట్ల వైపు కొనుగోలుదారులు మొగ్గుచూపే అవకాశం ఉంది. వీటిలో ఎంచక్కా 1500 నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు వస్తుంది. ఈ తరహా ప్రాజెక్ట్‌లకు మున్ముందు డిమాండ్‌ ఉంటుందని అంచనా.


అంతరం తగ్గింది..

కొత్త ఇల్లు కొనాలన్నా.. సొంతంగా కట్టుకోవాలన్నా ఎక్కువమంది ఆశ్రయించేది గృహ రుణాలనే. ప్రస్తుతం బ్యాంకులు సులభంగానే రుణాలు మంజూరు చేస్తున్నాయి. వడ్డీ రేట్లు కూడా 7 శాతానికి దిగి వచ్చాయి. అయినా రుణం తీసుకోవాలంటే వచ్చే వార్షికాదాయం ఎంత? ఎంతవరకు ఈఎంఐ చెల్లించగలం అనేది ప్రధానం. గృహ రుణ చెల్లింపు, ఆదాయాల నిష్పత్తి దీనినే ప్రతిబింబిస్తుంది. ఈ నిష్పత్తి ఎంత తగ్గితే అంతగా అందుబాటులో ఉన్నట్లు పరిగణిస్తారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం అందుబాటు (అఫర్డబులిటీ రేషియో) ఉందని అనరాక్‌-ఫిక్కి తాజా నివేదికలో పేర్కొంది. స్థిరాస్తి రంగంలో ప్రత్యేకించి గృహ నిర్మాణంలో రాబోతున్న కొత్త పోకడల గురించి ప్రస్తావించింది.


టౌన్‌షిప్‌లు..
గేటెడ్‌ కమ్యూనిటీలకు మించి సౌకర్యాలు కావాలని కోరుకునేవారు పెరుగుతున్నారు. ఇలాంటివారిని దృష్టిలో పెట్టుకునే టౌన్‌షిప్‌లు రాబోతున్నాయి. వీటిలో సకల హంగులు ఉంటాయి. మున్ముందు వీటికి మంచి డిమాండ్‌ ఉంటుంది.
అందుబాటు ఇళ్లకు..
అందుబాటు ధరలతోపాటు మధ్యస్థంగా ఉండే ప్రాజెక్ట్‌లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. హైదరాబాద్‌తో సహా అగ్రశేణి 7 నగరాల్లో 70 నుంచి 75 శాతం ఇళ్ల వాటా ఈ విభాగంలోనే ఉంటుంది. వీటిని విస్మరించొద్దని బిల్డర్లకు సూచించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని