థాంక్స్‌.. కరోనా
close
Published : 31/10/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థాంక్స్‌.. కరోనా

రోనా ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. కానీ ఓ విషయంలో మాత్రం నా స్నేహితుడు ప్రవీణ్‌కి ఎంతో మేలు చేసింది. ఆ సంఘటనని మీతో పంచుకుంటున్నా.
ప్రవీణ్‌ కేరింతలు కొడుతున్నాడు. విజయ గర్వంతో పిడికిళ్లు గాల్లోకి విసిరాడు. అసలేం జరిగిందంటే.. ఆరోజు కాలేజీ కల్చరల్‌ ఫెస్ట్‌. చివరగా డాన్స్‌ పోటీల విజేతని ప్రకటించారు. ‘అండ్‌ ద విన్నర్‌ ఈజ్‌ ప్రవీణ్‌’ అని పిలవగానే తన కళ్లలో ఆనందభాష్పాలు. ఈ రోజు కోసం ఎంతో కష్టపడ్డాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు. ‘డాన్స్‌ తిండి పెడుతుందా?’ అని ఎందరితోనో చీవాట్లు తిన్నాడు. చిన్నప్పట్నుంచి అన్నీ భరిస్తూ ఇదిగో మొదటిసారి అవార్డు అందుకున్నాడు. తను ఎదురుచూసిన క్షణాలు, అరుపులు కేకల మధ్య మొదటి బహుమతి అందుకున్నాడు. ‘రూ.ఐదువేల క్యాష్‌ ప్రైజ్‌. ఇది మొదటి సంపాదన కదా! ఏం చేస్తావురా?’ అనడిగా. ‘ఇది మా అమ్మకి అంకితం. నీకు తెలుసు కదరా. అమ్మ చివరి క్షణం వరకూ నాకోసమే పరితపించేదని. ఎంత సంపాదించినా ఈ చెక్‌లోని డబ్బును మాత్రం ఖర్చు చేయను. ఇది అమ్మకి నేనిచ్చే కానుక’ అన్నాడు.

ఇది జరిగిన కొన్నాళ్లకు నన్ను కలవడానికి చెన్నై వచ్చాడు ప్రవీణ్‌. సిటీ అంతా తిరుగుతూ రెండ్రోజులు సరదాగా గడిపాం. మర్నాడు ఇద్దరికీ ఒంట్లో నలతగా అనిపించింది. పైగా దగ్గు. అసలే కరోనా కదా ఇద్దరం కొవిడ్‌ పరీక్షకి వెళ్లాం. వెళ్లి వరుసలో నిల్చున్న కాసేపటికి ప్రవీణ్‌ గాబరా పడుతూ కనిపించాడు. ఏమైందని అడిగా. ‘రేయ్‌ వేణూ.. నా పర్సుని ఆసుపత్రి ఎంట్రెన్స్‌ ముందు బైక్‌ మీద పెట్టి మర్చిపోయారా’ అన్నాడు. డబ్బులు ఎంత ఉన్నాయంటే 3 వేల రూపాయలన్నాడు. ‘ఇప్పుడు మనకు టెస్టులు ముఖ్యం. డబ్బులు పోతే పోనీలేరా’ అన్నా. ‘అది కాదురా.. నాకు డబ్బుల గురించి బెంగ లేదు. కాలేజీలో డాన్స్‌ పోటీల్లో బహుమతిగా ఇచ్చిన చెక్‌ ఉంది అందులో. అది అమ్మ జ్ఞాపకంరా’ అన్నాడు బాధగా. ఆ మాటతో నాకు అయ్యోపాపం అనిపించింది. ఆ పర్సు దొరకాలని అందరు దేవుళ్లకు మొక్కుకున్నా.
టెస్ట్‌ పూర్తయ్యేదాకా ప్రవీణ్‌ దిగులుగానే ఉన్నాడు. అయిపోగానే వేగంగా బయటికి పరుగెత్తాడు. కాసేపయ్యాక సంతోషంగా తిరిగొస్తూ నాకు ఎదురుపడ్డాడు. వాడి మొహం ఫ్లడ్‌ లైటులా వెలిగిపోతోంది. ‘వేణూ.. నా పర్సు వదిలి రెండు గంటలైంది కదా. దొరకదనే అనుకున్నా. కానీ కరోనా భయమేమో.. ఒక్కరూ దాన్ని తాకలేదురా. డబ్బులు సేఫ్‌. అన్నింటికన్నా ముఖ్యం అమ్మ జ్ఞాపకం భద్రంగా ఉంది’ అంటుంటే వాడి కళ్లలో మెరుపు. నేను వాడి భుజంపై చేయేసి ‘థాంక్‌ గాడ్‌’ అన్నా. ‘థాంక్స్‌ దేవుడికి కాదురా.. కరోనాకి చెప్పాలి’ అన్నాడు. ఇద్దరం నవ్వుకుంటూ ఇంటికొచ్చాం. రెండ్రోజుల తర్వాత మాకు ‘నెగెటివ్‌’ వచ్చింది. మా సంతోషం రెట్టింపైంది.

- వేణు

మరిన్ని కథనాలకు ఈతరం ఇ-పేపర్‌ చదవండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని