కరోనాకు స్మార్ట్‌ఫోన్‌ పరీక్ష!
close
Published : 09/12/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకు స్మార్ట్‌ఫోన్‌ పరీక్ష!

సందర్భం

ముక్కులో దూదిపుల్లను తిప్పి కరోనా పరీక్ష నమూనా తీసి, ఒక పరికరంలో పెట్టారు. దాన్ని మొబైల్‌ ఫోన్‌ ముందుంచారు. అరగంటలోపే కరోనా వైరస్‌ ఉందో లేదో తెలిసిపోయింది! ఇది ఊహించుకోవటానికే చిత్రంగా ఉంది కదూ. అదే నిజమైతే? యూసీ బెర్కెలీ, యూసీ శాన్‌ఫ్రాన్సిస్కో పరిశోధకులు దీన్నే సుసాధ్యం చేశారు. క్రిస్ప్‌ఆర్‌ అనే జన్యు సవరణ పద్ధతి సాయంతో కొత్తరకం కరోనా నిర్ధారణ పరీక్షను రూపొందించారు. ఇది త్వరగా, అదీ కచ్చితంగా ఫలితాన్ని చెప్పటమే కాదు.. వైరస్‌ సంఖ్యనూ ఇట్టే చెప్పేస్తుంది. మామూలుగానైతే క్రిస్ప్‌ఆర్‌ పరీక్ష పద్ధతుల్లో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చి, దాన్ని వృద్ధి చేసి పరిశీలిస్తుంటారు. ఇది సంక్లిష్టమైంది. సమయమూ ఎక్కువే పడుతుంది. కొత్త పరీక్షకు ఇలాంటివేవీ అవసరం లేదు. నేరుగా ఆర్‌ఎన్‌ఏ ద్వారానే వైరస్‌ ఆనవాళ్లను నిర్ధారించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పరీక్ష సదుపాయాలు అందుబాటులో లేని చోట్ల.. తరచూ, వేగంగా పరీక్షలు చేయాల్సిన సందర్భాల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. కాస్‌ 13 ప్రొటీన్‌కు మరో సహాయ ప్రొటీన్‌ను జతచేసి ఈ పరీక్ష పరికరాన్ని రూపొందించటం విశేషం. ముందుగా ముక్కు నుంచి తీసిన నమూనాను పరికరంలో వేస్తారు. నమూనాలో వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఉంటే కాస్‌13 సహాయ ప్రొటీన్‌ నుంచి విడిపోతుంది. వెంటనే సహాయ ప్రొటీన్‌ ఓ వెలుగు వెలుగుతుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌ కెమెరా గుర్తించి, ఫొటో తీస్తుంది. అంటే కెమెరా ఫోనే మైక్రోస్కోప్‌లా పనిచేస్తుందన్నమాట. కేవలం 5 నిమిషాల్లోనే ఫలితం వెలువడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అదే వైరస్‌ సంఖ్య తక్కువగా ఉంటే 30 నిమిషాలు పట్టొచ్చని వివరిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని