చిక్కకుండా చక్కగా ఫాలో..
close
Published : 16/12/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిక్కకుండా చక్కగా ఫాలో..

ఇంటా.. బయటా.. ఆఫీస్‌.. టూర్‌..  ఇలా ఎక్కడికి వెళ్లినా వెంటే స్మార్ట్‌ ఫోన్‌.. దీంతో మనుషుల కంటే ఎక్కువగా ఫోన్‌లపైనే నిఘా పెడుతున్నారు మోసగాళ్లు. అందుకే ఈ సూత్రాల్ని ఫాలో  అయిపోండి..

నకిలీలను నిజం అనుకోవద్దు
వాట్సాప్‌లో ఏదైనా కాంటాక్ట్‌ నుంచో.. గ్రూపులోనో ఓ వీడియో వస్తుంది. దయనీయమైన దృశ్యాలతో నిజం అనిపించేంతలా ఆ వీడియో క్లిప్‌ ఉంటుంది. లేదూ ఏదో వాయిస్‌ కాల్‌ వస్తుంది. వారి మాటలు వింటే మనసు కరిగిపోతుంది. ఆకట్టుకునే వాయిస్‌, చక్కని పదజాలంతో ప్రొఫెషనల్‌గా వాటిని తీర్చిదిద్దుతారు. నిజం అనుకుని స్పందిస్తే ఉచ్చులో పడినట్టే. ఒకటికి రెండు సార్లు నిజానిజాలు నిర్ధారించుకున్నాకే స్పందించండి. వ్యక్తిగతంగా సంప్రదించాకే నిజం అని నమ్మండి.

ఊరికి వెళ్తే జాగ్రత్త..

ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. ఏం చేస్తున్నా.. సోషల్‌ మీడియాలో అనుక్షణం అప్‌డేట్‌ చేయడం లైఫ్‌ స్టైల్‌గా మారిపోయింది. ఇలా అన్ని అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేయడం వల్ల మీరెక్కడ ఉన్నారో మోసగాళ్లకి మీరే చెప్పినట్టు అవుతుంది. అలాగే, మీ పై నిఘా పెట్టిన వారికి పూర్తి అవగహన వచ్చేందుకు మీరు పంచుకునే సమాచారమే ఉపయోగపడుతుంది. దీంతో మిమ్మల్ని ట్రాప్‌ చేయడం వారికి మరింత సులభం. పర్యటనలకు వెళ్లినప్పుడు పబ్లిక్‌, హోటల్‌ వై-ఫైలను వాడడం మంచిది కాదు. మీ ఫోన్‌ డేటాతోనే నెట్టింట్లో విహరించండి. పబ్లిక్‌ నెట్‌వర్క్‌ వాడకం తప్పనప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనాన్షియల్‌ ఎకౌంట్‌లలోకి లాగిన్‌ అవ్వొద్దు. పబ్లిక్‌ ప్రాంతాల్లో ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు హోటల్‌ గదుల్లో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా ఉన్న ఛార్జింగ్‌ స్టేషన్లను వాడొద్దు.

పిల్లలపై ఓ కన్నేయండి

మచ్చిక చేసుకోవడానికి.. మభ్యపెట్టడానికి పిల్లల్నే లక్ష్యంగా చేసుకుంటారు హ్యాకర్లు. ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు, ఇతర నెట్టింటి పరిజ్ఞానం నిమిత్తం పిల్లల ‘స్క్రీన్‌టైమ్‌’ ఎక్కువైంది. రోజులో కనీసం ఐదు గంటల పాటు స్మార్ట్‌ ఫోన్‌ని యాక్సెస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకట్టుకునేలా కొన్ని మాల్వేర్‌ లింక్‌లతో కూడిన మెయిల్స్‌, మెసేజ్‌లను హ్యాకర్లు పంపుతున్నారు. ఉదాహరణకు పిల్లలకు ఇష్టమైన ఏదైనా వీడియో గేమ్‌ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటూ మెసేజ్‌ రావొచ్చు. దాంట్లోని లింక్‌పై క్లిక్‌ చేస్తే చాలు. మాల్వేర్‌ ప్రోగ్రామ్‌ మాటేసి కూర్చుంటుంది. అందుకే పిల్లల చేతికి స్మార్ట్‌ ఫోన్‌ని ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బృందంతో అప్రమత్తం..

ఉద్యోగం, వ్యాపారాల్లో అవసరం నిమిత్తం కొందర్ని నియమించుకుంటాం. వారిలో అకౌంటెంట్‌లు, లాయర్లు, సీఎస్‌లు.. ఉండొచ్చు. వారినే లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు వ్యాపారంలో మీరేదైనా పెద్ద డీల్‌ చేస్తున్నప్పుడు ఆర్థిక వ్యవహారాల సంగతులు అకౌంటెంట్‌లు, సీఎస్‌లకూ తెలుస్తుంది. వారూ వ్యవహారాల్లో పాలు పంచుకుంటారు. అలాంటప్పుడు హ్యాకర్లు వారిని ట్రాప్‌ చేసి ఆర్థిక వ్యవహారాల్ని దారి మళ్లిస్తారు. ఇలాంటి సమయాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్ద మొత్తంలో లావాదేవీలను ముఖాముఖిగా కొనసాగించడం మంచిది. అలాగే, ముఖ్యమైన వ్యవహారాల్లో భాగస్వాములయ్యే వారికి సైబర్‌ సెక్యూరిటీ గురించి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం.

* ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని ఎవరికైనా పంపాల్సివస్తే ‘కాన్ఫిడెన్షియల్‌ మోడ్‌’లో మాత్రమే మెయిల్‌ చేయాలి.
* థర్డ్‌పార్టీ యాప్‌ స్కానర్లతో ముఖ్యమైన డాక్యుమెంట్‌ల ఫొటోలు స్కాన్‌ చేయొద్దు.
* నెలలో ఒక రోజు  బృందంతో కలిసి సైబర్‌ సెక్యూరిటీపై వర్క్‌షాప్‌లు నిర్వహించడం అలవాటు చేసుకోండి.
* హెచ్‌టీటీపీ‘ఎస్‌’ ఉన్న సర్వీసుల్ని మాత్రమే యాక్సెస్‌ చేయండి.
* ఓపెన్‌ నెట్‌వర్క్‌లో ఉన్నప్పుడు థర్డ్‌పార్టీ ఫైల్‌ సర్వీసుల్ని వాడక పోవడం మంచిది.
* ‘వీపీఎన్‌’.. వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్‌లను సెట్‌ చేసుకుని పబ్లిక్‌ వై-ఫైలను వాడడం శ్రేయస్కరం
* ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్న యాప్‌లను లాక్‌ చేసి జాగ్రత్త పడాలి.
* హ్యాకర్ల దాడుల్ని పూర్తిగా అడ్డుకోలేంగానీ.. ఎప్పటికప్పుడు ఫోన్‌ని స్కాన్‌ చేయడం ద్వారా వారి పన్నాగాలకు చెక్‌ పెట్టొచ్చు.  
* పేరెంటల్‌ కంట్రోల్స్‌తో నియంత్రించొచ్చు. ‘గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌’ని ప్రయత్నించొచ్చు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని