కరోనా అంతం ఎప్పుడు?
close
Updated : 29/12/2020 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా అంతం ఎప్పుడు?

అవునన్నా, కాదన్నా.. ఇది కరోనా సంవత్సరమే! ఇంతగా ఏవగించుకున్న, ఈసడించుకున్న ఏడాది మరోటి లేదు. ఒక్క ఆరోగ్యాన్నే కాదు.. జీవితాలు, బంధాలు, అనుబంధాలు, జీవనోపాధులు, ఆర్థిక వ్యవస్థలను అన్నింటినీ అతలాకుతలం చేసేసింది. ఇప్పుడందరి కోరిక ఒక్కటే. కరోనా అంతం కావాలనే. కొత్త సంవత్సరంలో దీని ఊసు వినిపించకూడదనే.

వరూ కలగని ఉండరు, 2020 కరోనా భయంతో మొదలవుతుందని. ఎవరూ అనుకొని ఉండరు, కరోనా భయం ఏడాదంతా కొనసాగుతుందని. గత సంవత్సరం చివర్లో చైనాలో ఆరంభమైన కరోనా అనతికాలంలోనే మహమ్మారిగా మారి, ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేసింది. దాదాపు అన్ని దేశాల ప్రజలనూ ఇల్లు కదలనీయకుండా కట్టడి చేసేసింది. మనదేశంలో జనవరిలో తొలికేసు నమోదైనప్పట్నుంచీ వెనుదిరిగి చూసింది లేదు. ఇప్పటివరకు 1.02 కోట్లకు పైగా మందిని చుట్టబెట్టిన ఇది 1.47 లక్షల మందిని కబళించేసింది. ఇంత భయంకరమైన వాతావరణంలోనూ ఊరటనిచ్చేది ఒక్కటే. ఊహించినంతగా మరణాల సంఖ్య లేకపోవటం. డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవా దృక్పథం.. శాస్త్రవేత్తల అవిశ్రాంత కృషి ఫలితంగా కరోనా కోరలు గట్టిగానే అణచి వేయగలిగాం. వైరస్‌ గుట్టుమట్లను పట్టుకోవటం, ఉన్న మందులనే కొత్తగా ఉపయోగించుకోవటం దగ్గర్నుంచి.. సత్వరం టీకాలను రూపొందించు కోవటం వరకు ఎన్నెన్నో అస్త్రాలు సొంతం చేసుకున్నాం. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 2.4% కాగా.. మనదేశంలో 2% కన్నా తక్కువే కావటం విశేషం. ఇది ఒకింత సంతృప్తి కలిగించేదే అయినా కరోనా అంతమొందినప్పుడే పూర్తి మనశ్శాంతి. నిజంగా ఇది సాధ్యమేనా? అయితే ఎప్పుడు? మరో రెండు రోజుల్లో 2021లోకి కాలుడితున్న తరుణంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. దీనికి సమాధానం ఎక్కడో లేదు. మనలోనే ఉంది. ఎందుకంటే కరోనాను అంతమొందించాల్సింది మనమే. మన చేతలతోనే.

భయం తగ్గించుకున్నప్పుడు

భయాన్ని జయిస్తే కొవిడ్‌ను జయించినట్టే! చాలామందిలో భయం, ఆందోళనే విపరీత పరిణామాలకు దారితీస్తోంది. భయపడుతున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేం. ఇది జబ్బు కన్నా మరింత హాని చేస్తుంది. కాబట్టి అనవసర భయాలకు తావివ్వకుండా అవగాహన పెంచుకుంటే కరోనాను అంతం చేయటం కష్టమేమీ కాదు. సార్స్‌-కోవ్‌2 మరో పదేళ్ల వరకూ మనతోనే ఉంటుందని టీకాను రూపొందించిన శాస్త్రవేత్తలే పేర్కొంటుండొచ్చు. అంతమాత్రాన బెంబేలెత్తి పోవాల్సిన పనిలేదు. అగ్ని ప్రమాదాలు జరుగుతాయని వంట చేయటం మానేస్తామా? రోడ్డు ప్రమాదాల భయంతో ప్రయాణాలు ఆపేస్తామా? మనం కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌2ను పూర్తిగా తుదముట్టించలేకపోవచ్చు గానీ జాగ్రత్తగా మసలుకుంటే కరోనా మహమ్మారిని మాత్రం కచ్చితంగా అంతం చేయగలం. అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశంలోనే మామూలు ఫ్లూతో ఏటా 5 లక్షల మంది మరణిస్తున్నారు. అయినా భయపడటం లేదు కదా. వాస్తవాలు తెలుసుకుంటే భయాలను పోగొట్టుకోవచ్చు. మనదేశంలో కేసుల సంఖ్య గత నెలలో రోజుకు 25 వేల కన్నా పెరగటం లేదు. ఆ మాటకొస్తే తగ్గుతూనే ఉన్నాయి. జబ్బు నుంచి కోలుకున్నవారి సంఖ్య 95% కన్నా ఎక్కువే. ఇంతగా కోలుకోవటం మరే జబ్బుల్లోనూ లేదంటే అతిశయోక్తి కాదు. మనదేశంలో ఏటా 28 లక్షల క్షయ కేసులు నమోదవుతుండగా.. 4.74 లక్షల మంది మరణిస్తున్నారు. కాలుష్యం మూలంగా ఏటా 18 లక్షల మంది, సీవోపీడీతో రోజుకు 2,300 మంది, రోడ్డు ప్రమాదాల మూలంగా గంటకు 17 మంది చనిపోతున్నారు. వీటితో పోలిస్తే కరోనా మరణాలెంత? దాదాపు 80% మందిలో అసలు లక్షణాలే కనిపించటం లేదు. 15% మందిలో తీవ్రమవుతుండగా.. 5% మందికే వెంటలేటర్‌ అమర్చాల్సి వస్తోంది. వీరిలో 2% మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా వైరస్‌ బలహీన పడుతోందనటానికి ఇదే నిదర్శనం. క్రమంగా ఇది సాధారణ జలుబు స్థాయికి చేరుకుంటోంది. కాకపోతే కొవిడ్‌-19లో వ్యాధి ప్రబలత (మార్బిడిటీ) తీవ్రంగా ఉండటమే ఆందోళనకరం. ఇందులోనూ మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలే ఎక్కువగా పాలు పంచుకుంటున్నాయి. కాబట్టి మొదట్లో అంటే ఏమో గానీ.. ఇప్పుడు కొవిడ్‌-19ను భూతంగా చూడాల్సిన పనిలేదు. దీనర్థం విచ్చలవిడిగా తిరగటమని కాదు. నిర్లక్ష్యం అసలే కూడదని. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే అవగాహనతో మెలగాలి. దీని కోరల్లో చిక్కకుండా, కలిసి జీవించటం నేర్చుకోవాలి. కొవిడ్‌ అంతానికి ఇదే తొలి మెట్టు.

రోగనిరోధకశక్తి పెంచుకున్నప్పుడు

మన రోగనిరోధకశక్తి బలంగా ఉంటే వైరస్‌ ఎంత ఉద్ధృతంగా ఉన్నా ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎంతోమంది కరోనా బారినపడకపోవటానికి ఇదే పెద్ద ఉదాహరణ. రోగనిరోధకశక్తి తగ్గినవారికి ఏ వైరస్‌ అయినా త్వరగానే సోకుతుంది. అంటే రోగనిరోధకశక్తిని బలోపేతం చేసుకుంటే కరోనాను అంతం చేసినట్టే. ఇందుకోసం సమతులాహారం తీసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం ముఖ్యం. అలాగే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. గాఢంగా శ్వాస తీసుకునేలా చేసే ప్రాణాయామం, ధ్యానం మేలు చేస్తాయి. యోగా సైతం రోగనిరోధకశక్తి పెరగటానికి తోడ్పడుతుంది. అవసరమైతే జింక్‌, విటమిన్‌ సి, విటమిన్‌ డి మాత్రలతోనూ నిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. రోజుకు ఒక జింక్‌ 50 ఎంజీ మాత్ర, రోజుకు రెండుసార్లు విటమిన్‌ సి 500 ఎంజీ మాత్రలు, వారానికి ఒకసారి విటమిన్‌ డి 6000 ఐయూ మాత్రలు తీసుకోవచ్చు. ఇవి వైరస్‌ను ఎదుర్కోవటానికి అదనపు బలాన్నిస్తాయి.

టీకాలు తీసుకున్నప్పుడు

అందరూ కొవిడ్‌ టీకాలు తీసుకుంటే కరోనా కథ ముగిసినట్టే. టీకాలతో గానీ సామూహికంగా గానీ కరోనాను ఎదుర్కొనే నిరోధకశక్తి సంతరించుకుంటే కరోనా అంతమైనట్టే. వైరస్‌ వ్యాప్తిలో ఉన్నా పెద్ద ప్రభావమేమీ ఉండదు. కొన్నిదేశాల్లో ఇప్పుటికే టీకాలు ఆరంభించేశారు. మనదేశంలోనూ జనవరిలో టీకా అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా ముప్పు ఎక్కుగా ఉండే ఆరోగ్యసిబ్బందికి, రోగనిరోధకశక్తి తగ్గినవారికి, 60 ఏళ్లు పైబడ్డవారికి, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులు గలవారికి ప్రాధాన్యమిచ్చినా క్రమంగా అందరికీ ఇస్తారు. ఆలోపు సామూహిక రోగనిరోధక శక్తి సంతరించుకుంటే ఇంకా మంచిదే. మనదేశంలో సుమారు 30 కోట్ల మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు అంచనా. దురదృష్టవశాత్తు ఇవి ఐదారు నెలల వరకే ఉంటున్నాయి. అందుకే టీకా రెండు మోతాదులు తీసుకోవాలని చెబుతున్నారు. మనం మార్చి 24 నాటికి 30 కోట్ల మందికి టీకా ఇవ్వగలిగినా చాలు. ఇటు టీకా నిరోధకశక్తి, అటు సామూహిక రోగనిరోధకశక్తి.. రెండూ కలిసినట్టవుతుంది. దీంతో మనదేశంలో కరోనా అంతం సాధ్యమవుతుంది. అందుకే టీకా విషయంలో సందేహాలు పెట్టుకోవద్దు. తీసుకోవాలా? వద్దా? అనే మీమాంస తగదు. పలు దశల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి.. సురక్షితంగా పనిచేస్తున్నట్టు తేలిన తర్వాతే టీకాలకు అనుమతిస్తారనే సంగతి తెలుసుకోవాలి. ఇతరత్రా మందుల్లాగానే కొందరికి అలర్జీ తలెత్తొచ్చేమో గానీ వీటితో పెద్దగా దుష్ప్రభావాలేవీ తలెత్తటం లేదు. కాబట్టి కరోనా వచ్చినా, రాకున్నా టీకా తీసుకోవటం తప్పనిసరి. టీకా తీసుకున్నా కూడా ఇతరులకు దూరంగా ఉండటం, మాస్కు ధరించటం, చేతులు సబ్బుతో కడుక్కోవటం మానరాదు. వీటిని ఎప్పటికీ మన జీవన విధానంలో భాగంగానే పరిగణించాలి.

జబ్బులు అదుపులో ఉంచుకున్నప్పుడు

కరోనా తీవ్రమైనవారిలో మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా వంటి వాటితో బాధపడుతున్నవారే అధికం. దీర్ఘకాలిక జబ్బులను అదుపులో ఉంచుకుంటే కరోనా తీవ్రం కాకుండా చూసుకోవచ్చనటానికిదే నిదర్శనం. కరోనా అంతంలో ఇదీ కీలకపాత్ర పోషిస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు గలవారు క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. ఆస్థమాతో బాధపడేవారు కాలుష్యం, దుమ్ముధూళి, కీటకాలు, పుప్పొడి వంటి అలర్జీ కారకాలకు దూరంగా ఉండాలి. విధిగా ఇన్‌హేలర్లు వాడుకోవాలి. కొవిడ్‌ భయంతో ఆసుపత్రికి వెళ్లకుండా ఉండటం మంచిది కాదు. కనీసం పోన్‌, వీడియో కాల్స్‌ ద్వారానైనా డాక్టర్‌తో మాట్లాడాలి. సీవోపీడీ, ఆస్థమా గలవారు, 60 ఏళ్లు పైబడ్డవారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు విధిగా ఫ్లూ, న్యుమోనియా టీకాలు తీసుకోవాలి. ఇవి కరోనా ముప్పు తగ్గేలా చేస్తాయి. ఇలా కరోనా అంతానికీ దోహదం చేస్తాయి.

ప్రవర్తన మారినప్పుడు

మన ప్రవర్తనను మార్చుకుంటే పరోక్షంగా కరోనాను అంతమొందించినట్టే. కరోనా వ్యాప్తిలో వైరస్‌ ఉద్ధృతి కన్నా మన ప్రవర్తనే ముఖ్య భూమిక పోషిస్తోంది మరి. ఇతరులకు దూరంగా ఉండటం.. ముక్కు, నోరు పూర్తిగా కప్పుకొనేలా మాస్కు ధరించటం, చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తే అసలు కరోనా సోకే అవకాశమే ఉండదు. బ్రిటన్‌లో మాదిరిగా కొత్తరకం కరోనా వైరస్‌లు ఎన్ని పుట్టుకొచ్చినా భయపడాల్సిన పనుండదు. నిజానికి పరిణామం చెందటం వైరస్‌ సహజ గుణం. తన మనుగడలో భాగంగా వాతావరణం, మందుల ప్రభావాలను తట్టుకోవటానికి వైరస్‌ అనుక్షణం జన్యుపరంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ క్రమంలో తీవ్రం కావొచ్చు లేదూ బలహీన పడొచ్చు. బ్రిటన్‌లో గుర్తించిన కొత్తరకం వైరస్‌ కూడా ఇలాంటిదే. ఇది వేగంగా వ్యాపించటం నిజమే కావొచ్చు గానీ మరీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న దాఖలాలేవీ లేవు. ఆ మాటకొస్తే ఇది వ్యాపించటంలోనూ మన ప్రవర్తన, అలవాట్లే ఎక్కువ కారణమవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి కొత్తరకం వైరస్‌ను సెప్టెంబరులోనే గుర్తించారు. అప్పట్నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వైరస్‌ నిజంగానే వేగంగా వ్యాపించి ఉంటే, ఇప్పటికే కుప్పలు తెప్పలుగా కేసులు నమోదు అయ్యిండేవి. అలాంటిదేమీ లేదు. దీనికి కారణం మనం తీసుకుంటున్న జాగ్రత్తలే. వీటిని ఇలాగే కొనసాగించటం అత్యవసరం.

చికిత్సలు రూపొందినప్పుడు

సరైన చికిత్సలతో ఎంతటి జబ్బయినా నయమవుతుంది. ఇది కొవిడ్‌-19కూ వర్తిస్తుంది. అదృష్టమేంటంటే ప్రస్తుతం వాడకంలో ఉన్న స్టిరాయిడ్లు.. అలాగే రక్తాన్ని పలుచగా, రక్తం గడ్డలు ఏర్పడకుండా చేసే మందులతోనే ఎంతోమంది ప్రాణాలు నిలుస్తుండటం. ఇప్పుడు కొవిడ్‌ చికిత్సపై తొలినాటి సందిగ్ధత లేదు. జబ్బు ఎలా వస్తుంది? ఎందుకు తీవ్రం అవుతుంది? మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? అనేవి బాగా అవగతమయ్యాయి. వైరస్‌ మూలంగా వాపు ప్రక్రియ తలెత్తటం, సైటోకైన్లు ఉప్పెనలా దాడి చేయటం వల్లనే తీవ్ర దుష్ప్రభావాలు పుట్టుకొస్తున్నాయని గుర్తించటం చికిత్స గతినే మార్చేసింది. దీన్ని అరికట్టటానికి స్టిరాయిడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తొలిదశలోనే స్టిరాయిడ్లు తీసుకున్నవారిలో చాలామందికి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే రావటం లేదు. మరోవైపు రక్తాన్ని పలుచగా చేసే, రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసే ఆస్ప్రిన్‌, హెపారిన్‌ వంటి మందులూ ఉపయోగపడుతున్నాయి. వీటితో కరోనా తీవ్రత, మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం మోనోక్లోనల్‌ యాంటీబాడీల మీద ప్రయోగాలు సాగుతున్నాయి. మందులతో ఫలితం కనిపించనివారికివి ఉపయోగపడుతున్నట్టు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ఇది మంచి పరిణామం.

అపోహలు తొలగించుకున్నప్పుడు

అపోహలు తొలగించుకోవటం చాలా ముఖ్యం. కరోనా అంతంలో ఇది కీలకం.
* కరోనా కాగితాలతో రాదు, కార్డుబోర్డులతో రాదు. తినే వస్తువులతో రాదు. ఇలాంటి విషయాలను తెలుసుకుంటే భయం తొలగిపోతుంది. రోజువారీ పనులకు విఘాతం కలగదు.
* హాని చేస్తాయనే అపోహతో కొందరు రక్తం గడ్డలను నివారించే మందులను నాలుగైదు రోజులకే ఆపేస్తున్నారు. ఇది మంచిది కాదు. కొందరికివి నాలుగైదు నెలలు అవసరపడొచ్చు.
* స్టిరాయిడ్స్‌ తీసుకుంటే గ్లూకోజు పెరుగుతుందని, ఇతర సమస్యలకు దారితీస్తుందనే అపోహలు వద్దు. అవసరమైతే వీటిని ఎక్కువ రోజులు వాడుకోవాల్సి రావొచ్చు.
* సీటీస్కాన్‌తో కరోనా నిర్ధారణ అవుతుందనుకోవటం పెద్ద అపోహ. యాంటీజెన్‌, ఆర్‌టీపీసీఆర్‌ వంటి నిర్ధారణ పరీక్షలు నెగెటివ్‌గా ఉన్నా కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జబ్బు తీవ్రత, ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడటం వంటివి తెలుసుకోవటానికే సీటీ స్కాన్‌ ఉపయోగపడుతుంది. కరోనా నిర్ధారణకు కాదు.
* ఇప్పుడు నెగెటివ్‌ పరీక్ష అవసరం లేదు. వైరస్‌ పాజిటివ్‌గా తేలిన 14 రోజల తర్వాత దాదాపు 95% మందిలో నెగెటివ్‌గా మారుతోంది కాబట్టి రెండోసారి నిర్ధారణ పరీక్ష అనవసరమని ఐసీఎంఆర్‌ సూచిస్తోంది. ఎవరికైనా 14 రోజుల తర్వాతా వైరస్‌ ఉన్నట్టు తేలినా జబ్బు ఉన్నట్టు కాదు. వైరస్‌ అచేతన స్థితిలో ఉన్నా పాజిటివ్‌గానే వస్తుంది. ఇది ఇతరులకు వ్యాపించేది కాదు. నష్టం లేదు. కరోనా తిరగబెట్టటమనేది అరుదు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని