..ఇక నడవలేను అనుకున్నా!
close
Published : 03/01/2021 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

..ఇక నడవలేను అనుకున్నా!

‘ఒక అమ్మాయి వద్దంటే దానర్థం వద్దనే’... ‘పింక్‌’ సినిమాలో అమ్మాయిల అభిప్రాయాన్ని బలంగా వినిపించింది మినాల్‌.. ‘థప్పడ్‌’లో తాప్సీ కనిపించదు. గృహహింసపై పోరాడే ఇల్లాలు అమృతే కనిపిస్తుంది.. ‘సాండ్‌కీ ఆంఖ్‌’లో ముదిమి వయసులో స్త్రీ అస్తిత్వం కోసం పోరాడే ప్రకాషీతోమర్‌ని చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఇలా స్త్రీల సమస్యలని ఒక్కోప్రాతతో తెరపైకి తెచ్చిన తాప్సీ ఆ పాత్రలు తనకు ఏ పాఠాలు నేర్పాయో వసుంధరతో పంచుకుంది..
* థప్పడ్‌లో నా పాత్రపేరు అమృత. ఎటువంటి సందర్భంలోనూ ఆలోచనారహితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటి నిర్ణయాల వల్ల కలిగే పరిణామాలను తిరిగి యథాస్థితికి తీసుకురాలేమని ఈ పాత్ర చెబుతుంది. సహనం ఎంతో అవసరమో అమృతే నేర్పింది.

* పింక్‌ సినిమాలో మినాల్‌ అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర పోషించా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వేసే అడుగు సరైనది అనిపిస్తే మరొక ఆలోచన లేకుండా చివరి వరకూ పోరాడాలి. ఎదుటివారు ఏమనుకుంటారో, విమర్శిస్తారేమోనని వెనుకడుగేయాల్సిన అవసరం లేదని మినాల్‌ని చూసి నేర్చుకున్నా.  
* నామ్‌షబానాలో షబానా పాత్ర నాది. ఆపద వచ్చినప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారని సమయాన్ని వృథా చేయకుండా ...తనకోసం తాను నిలబడే బలమైన వ్యక్తిత్త్వం ఉన్న పాత్ర అది. ఒంటరిగా ఉన్నప్పుడు భయాన్ని తరిమేసే షబానా అయిపోతాను నేను.  

* నీతిశాస్త్రలో రోషిణి పాత్ర నాది. ఓ ఆడపిల్లకు అన్యాయం జరుగుతున్నప్పుడు దానికి కారణం ఇంట్లోని సభ్యుడైనా సరే... కఠినంగా ఉండి గుణపాఠం చెప్పాల్సిందే అని చెబుతుంది రోషిణి పాత్ర. చివరకు ఆ అన్యాయానికి కారణమైన వ్యక్తి ప్రాణాలు తీయడానికి వెనుకడుగు వేయని సాధారణ ఆడపిల్లగా నటించా. 

* సాండ్‌కీఆంఖ్‌లో కుటుంబబాధ్యతల్లో పడి తన ఉనికినే మర్చిపోయిన ఓ అమ్మ తనలో దాగిన నైపుణ్యాలని వెలికి తీసి దేశాన్నే అబ్బుర పరుస్తుంది. ఆమె పేరు ప్రకాషీ. భవిష్యత్తులో నాలోని ప్రతిభను పెంచుకోవడానికి, నా ఉనికిని మరవకుండా ఉండటానికి ఈ ప్రకాషీ పాత్రను మరిచిపోలేను.  

* నా కొత్త సినిమా రష్మీరాకెట్‌... ఈ చిత్రం షూటింగ్‌ మొదలైన మూడో రోజే ట్రాక్‌లో పరుగుపెట్టేటప్పుడు అకస్మాత్తుగా నా కాళ్లు పనిచేయడం మానేశాయి. కండరాలు గాయపడ్డాయి. చాలాసేపటి వరకూ అడుగు ముందుకు వేయలేకపోయా. జీవితంలో మొదటిసారి భయపడ్డా. మళ్లీ నడవగలనా అనుకున్నా. నన్ను నమ్మి చిత్రం షూటింగ్‌ మొదలైంది. చిత్రీకరణ జరగాలంటే ఆ సమయానికి, ప్రాంతానికి ఎంతో ఖర్చు అవుతుంది. ఇవన్నీ నా మెదడులో కదిలాయి. అంతే నాలో తెలీని శక్తి వచ్చింది. ఫిజియోథెరపీ తరువాత వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నా. ఈ సినిమా కోసం నేను పూర్తిగా ఓ అథ్లెట్‌గా మారిపోయా.

ఆడపిల్ల చదువు కోసం...
ప్రపంచం ఎంతగా అభివృద్ధిపథంలో నడుస్తున్నా లింగవివక్ష మాత్రం అలాగే ఉంది. గృహహింసకు వ్యతిరేకంగా స్త్రీలు పోరాడాలి. కనీసం రేపటి తరంలోనైనా ఈరకమైన మార్పు రావాలని వీడియోల ద్వారా మహిళల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నా. ఓ స్వచ్ఛందసంస్థతో కలిసి బాలిక-విద్య అంశంపై అవగాహన కలిగిస్తున్నా. అమ్మాయిల డ్రాపవుట్స్‌ని తగ్గించేందుకు బాలికలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నా.  


నా కల: హాలీవుడ్‌ చిత్రం అవెంజెర్స్‌లో ఇండియన్‌ ఫిమేల్‌ సూపర్‌ హీరో పాత్రలో నటించాలని ఉంది.
ఇష్టమైన ప్రశంస: నువ్వు అందంగా ఉన్నావు అనే ప్రశంస కన్నా, ఈ పాత్రకు న్యాయం చేశావనే ప్రశంస అంటే నాకిష్టం.
మీకోమాట: కలలు కనండి. వాటిని నిజం చేయడానికి ఎవరో వస్తారని ఆశించకుండా మీరే ముందడుగు వేయండి.
అమ్మ నుంచి: అమ్మ పూర్తిగా కుటుంబానికే అంకితమైంది. అయితే ఈ ప్రయాణంలో తననితాను మర్చిపోయింది. నేను మాత్రం కుటుంబాన్ని చూసుకుంటూనే, నా ఉనికినీ కాపాడుకుంటా.
ఇడ్లీ సాంబార్‌: దిల్లీలో దొరికే స్ట్రీట్‌ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. అలాగే హైదరాబాద్‌లో దొరికే ఇడ్లీసాంబారు, దోసె కూడా ఇష్టమే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని