ఏడాది అంతా శరణం అయ్యప్పా!
close
Published : 28/01/2021 00:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడాది అంతా శరణం అయ్యప్పా!

శబరిమల అయ్యప్ప దర్శనం అంటే అందరికీ గుర్తు వచ్చేది నవంబరు, డిసెంబరు మాసాల్లో జరిగే మండల పూజ. మకర సంక్రాంతినాటి జ్యోతి దర్శనం. అత్యధిక శాతం మంది భక్తులు ఈ సమయంలోనే మాల ధారణతో శబరిమల చేరి ఇరుముడిని సమర్పించి వస్తుంటారు. మరి మిగిలిన సమయంలో అయ్యప్ప దర్శనం ఎలా?
శబరిమల పుణ్యక్షే‌్రత్రాన్ని నవంబరు నుంచి జనవరి దాకా లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకొంటారు. తర్వాత కూడా ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ దాకా ప్రతి నెలలో సుమారు అయిదు రోజుల పాటు అయ్యప్ప దేవాలయాన్ని తెరచి ఉంచుతారు. ఈ కాల పట్టిక ను ఏటా జనవరి నెలలో శబరిమల దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. దీనికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించుకొని మాలధారణ చేయవచ్చు. సాధారణంగా మలయాళ మాసంలో మొదటి అయిదు రోజుల పాటు దేవాలయాన్ని తెరచి ఉంచడం ఆనవాయితీ. అదేకాకుండా ఓనమ్‌,  విషు, ప్రతిష్ట వంటి మలయాళ పండగ సమయాల్లో కూడా ఆలయం తెరచిఉంటుంది. మొదటి రోజు ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకొని ఏర్పాట్లు చేసుకుంటారు. అందువల్ల ఆరోజు సాయంత్రం 5 గంటల నుంచి భక్తుల దర్శనాలు మొదలవుతాయి. తర్వాత రోజుల్లో మాత్రం తెల్లవారుజాము నుంచి రాత్రి దాకా భక్తులు అయ్యప్పను దర్శించవచ్చు..

ఆలయం తెరచి ఉంచిన 4, 5 రోజుల్లోనూ శబరిమలలో నిర్వహించే పూజలకు ప్రత్యేకమైన కాలపట్టిక  ఉంటుంది. దీనిని బట్టి భక్తులు ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఆయా రోజుల్లో తెల్లవారుజామున స్వామివారి సన్నిధిలో గణపతి హోమం నిర్వహిస్తారు. అయ్యప్ప ఆలయంలోని అర్చకస్వాములు ఈ హోమాన్ని నిర్వహిస్తారు. తర్వాత ఉష పూజ నిర్వహిస్తారు. వీటిలో భక్తులు  పాల్గొనవచ్చు. మరో వైపు సాధారణ భక్తులకు దర్శనాలను కూడా తెల్లవారుజామునుంచే అనుమతిస్తారు. అనంతరం యథావిధిగా స్వామి వారికి నెయ్యాభిషేకాలు జరుగుతాయి.  తర్వాత మరో విశిష్ట పూజ ఉంటుంది. కలశాలలో ఔషధ మూలికలు, సుగంధ ద్రవ్యాలతో కూడిన మంత్ర జలాలను నింపి అష్ట కలశాభిషేకం నిర్వహిస్తుంటారు. దీంతో స్వామి కొత్త తేజస్సుతో మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. మధ్యాహ్నం నివేదన తర్వాత  గుడిని మూసివేస్తారు. సాయంత్రం గుడిని తెరిచినప్పుడు భక్తులను సాధారణ దర్శనాలకు అనుమతిస్తారు.ఈ సమయంలో జరిగే మరో విశేష పూజగా పడిపూజను చెప్పుకోవచ్చు. స్వామి వారి ఆలయంలో పవిత్రంగా భావించే పదునెట్టాంపడికి అర్చక స్వాములు పూజను నిర్వహిస్తారు. సాధారణంగా రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ పూజ ప్రారంభం అవుతుంది. విభిన్నమైన పుష్పాలు, పత్రాలతో మెట్లకు  పూజ చేసి, అన్ని మెట్ల మీద కర్పూరాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో భక్తుల శరణుఘోషతో ఆలయమంతా దివ్యమైన వాతావరణం నెలకొంటుంది. తర్వాత స్వామి వారికి పుష్పాభిషేకం జరుగుతుంది. ముందుగా నమోదు చేసుకొన్న భక్తులకు పెద్ద ఎత్తున బుట్టలలో పుష్పాలను సమకూరుస్తారు. వీటిని స్వయంగా భక్తులు స్వామికి సమర్పించుకోవచ్చు. ఈ పుష్పాభిషేకం జరుగుతున్నంత సేపు సాధారణ భక్తులకు దర్శనాలు జరుగుతూనే ఉంటాయి.  

మకర విళక్కు లేక మకర జ్యోతి సీజన్‌ లో శబరిమల ఆలయం విపరీతమైన రద్దీతో కిట కిటలాడుతుంటుంది. కానీ ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ దాకా నిర్ణీత సమయాల్లో గుడిని తెరచినప్పుడు గుడిలో తీరికగా దర్శనం, పూజలు చేయించుకొనే వెసులుబాటు ఉంటుంది.  ఈ అయిదారు రోజుల పాటు శబరిమల చుట్టుపక్కల అన్ని ఏర్పాట్లు జరిగిపోతుంటాయి. పెద్ద పాదం నడక దారిలోకి మాత్రం అనుమతించరు. పంబ నుంచి మాత్రం రెండు మార్గాల్లోనూ కాలినడకన వెళ్లవచ్చు. చెంగనూరు రైల్వే స్టేషన్‌ నుంచి పంబకు విరివిగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. ఎరుమేలి వెళ్లాలి అనుకొనేవారు మాత్రం ప్రత్యేకంగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. పంబకు చేరుకొన్నాక అక్కడ భోజనాది వసతులు అన్నీ లభిస్తుంటాయి. ఆలయం తెరిచే తేదీలు, నిబంధనలు కోవిడ్‌ కట్టడి చర్యల రీత్యా స్వల్ప మార్పులు ఉండవచ్చు. వెబ్‌ సైట్‌ లో ఎప్పటికప్పుడు పరిశీలించుకొని ప్రయాణం ఖరారు చేసుకోవటం మేలు.
 

-యలమంచిలి రమా విశ్వనాథన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని